Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయిత, కవి, బాల సాహితీవేత్త, ఖమ్మం గుమ్మం నుండి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న ఉపాధ్యాయులు బొల్లేపల్లి మధుసూధనరాజు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు, ఆసక్తిరీత్యా బాలల కోసం తపించి రాసిన బాల సాహిత్య కారులు. మార్చి 3,1960న ఖమ్మం జిల్లా వైరాలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి సామ్రాజ్యం-శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణరాజు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ చేసిన మధుసూధనరాజు ఉపాధ్యాయులుగా పనిచేసి 2018లో పదవీ విరమణ పొందారు. తొలుత వివిధ ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ బాల సాహిత్యం పట్లనే తన ఆసక్తి కనబరిచి ఇప్పటికీ బాల సాహిత్య రచన, బాలల వికాసం దిశగా తపించి పనిచేస్తున్నారు
'బాల సాహిత్య రచనే నాకు రాష్ట్రపతి పురస్కారాన్ని అందించింది' అని చెప్పుకునే మధుసూధనరాజు జిల్లా విద్యాశాఖ 2006లో నిర్వహించిన కార్యశాలలో పాల్గొని, ప్రముఖ బాల సాహితీవేత్తలతో ఏర్పాటు చేసిన సంపాదకవర్గంలో ఉన్నారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో 100 పుస్తకాలు అచ్చుకాగా ఒక ఖమ్మం నుండే 9 కథా పుస్తకాలు, 13 కథా వాచకాలు, 22 కథా కార్డులు అచ్చయ్యాయి. ఖమ్మం విద్యాశాఖ వెలువరించిన బాలల మాస పత్రిక 'బడిమెట్లు'కు నామకరణం చేయడమే కాక ఈయనే సంపాదకులుగా ఉన్నారు. పనిచేసిన ప్రతిచోట తన ముద్రను వేసే రాజు పిల్లలతో శతక పద్యాలు కంఠస్థం చేయించడమే కాక శతక పద్యాలతో వివిధ ప్రయోగాలు చేసి 7 తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను నమోదు చేయించారు. ముఖ్యంగా బాలబాలికలతో వేమన, దాశరథి, సుమతీ శతకం వంటివాటితో శతావధానం చేయించి ప్రయోగాలు చేశారు.
ఉపాధ్యాయునిగా పాఠాలు చెబుతూనే పిల్లలతో పాటలు, గేయాలు, కవితలు రాయించారు. తోటి ఉపాధ్యాయులతోనూ రచనలు చేయించి, వాటిని కూడా ప్రచురించారు మధుసూధనరాజు. రచయితగానే కాక బాల వికాసకారులుగా బడి కేంద్రం మధుసూధనరాజు చేసిన పనులు చక్కని ఫలితాలనిచ్చాయి. సృజన సాహితీ సమితి సత్తుపల్లి ప్రచురించిన 'బొమ్మకు బోలెడు కథలు', ముప్పైయేడు మంది బడిపిల్లలు బొమ్మలకు రాసిన కథల పుస్తకం. మరో పుస్తకం 'చిరుదివ్వెలు' సత్తుపల్లి మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు అదే మండలంలోని వివిధ ప్రాంతాలు, అంశాలు, విశేషాల గురించి రాసిన వ్యాస సంకలనం. దీనికి మధుసూధనరాజు సంపాదకత్వం వహించారు. ఇలాంటిదే మరో రచన వీరి సంపాదకత్వంలో 'బడి గంటలు' పేరుతో వచ్చింది. ఇది సత్తుపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పిల్లలు, టీచర్ల రచనా సంకలనం. వీరి సంపాకత్వంలోనే వచ్చిన 'వేమన భాషామృతం' మోడల్ టెక్ట్స్ బుక్ లాంటిది. వంద వేమన పద్యాలతో పది పాఠాలు కూర్చి, దీనిని టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, నోట్లా తీసుకొచ్చారు. బాలల రచనలే కాక సృజన సాహితీ వేదిక ఇరవైఏండ్ల సందర్భంగా ప్రచురించిన సంచికకు సంపాదకత్వం వహించారు రాజు.
బాల వికాసకారులుగానే కాక బాల సాహిత్యకారులుగా మధుసూధనరాజు 'రాజు'లా వెలిగారు. ఆ కృషి, తపనలోంచి వచ్చినవే వీరి బాల సాహిత్య రచనలు. వార్త మొగ్గలో వచ్చిన కథలను 2003లో 'మల్లెల మనసులు' పేరుతో సంపుటిగా తెచ్చారు. మరో రచన 'తాత చెప్పిన కథలు', యాభై ప్రసిద్ధ వేమన పద్యాలకు రామాయణ, భారత కథలు కొన్నింటిని జోడించి, మరి కొన్ని స్వీయ కథలతో రాసిన రచన యిది. బాలల కథలే కాకుండా బాలల కోసం చక్కని గేయాలను రచించారు ఈయన. తన స్వీయ గేయాలను 'ఆనంద నంది వర్దనాలు' పేరుతో రాశారు. లండన్లో ఉండే తన మనవడు, మనవరాలి కోసం ఈ గేయాలు రాసినప్పటికీ పుస్తకంగా ఇవి తన మనవడు, మనవరాలి లాంటి అనేక మంది బాల బాలికలకు తాయిలంగా అందాయి.
వర్ణమాలలోని అక్షరాలను ఆలంబనగా చేసుకుని చక్కని గేయాలుగా రాశారు మధుసూధనరాజు. వాటిలో 'అచ్చుల హరివిల్లు' శీర్షికన రాసిన అచ్చుల గేయాలు తెలుగు అక్షరాల్లానే అందంగా ఉన్నాయి. 'ఆనందంగా బడి కెళదాం/ ఆడుతు పాడుతూ చదివేద్దాం/ ఆడిపాడి, అలసి సొలసి/ ఆడమరిచి నిద్దుర పోదాం' వంటివి అందుకు నిదర్శనం. 'ఉ' అక్షరంతో రాసిన 'ఉగాది పండుగ వచ్చింది/ ఉదయం నిద్దుర లేచాము/ ఉడుపులు కొత్తవి తొడిగాము/ ఉల్లాసంగా గడిపాము' వంటివి ఇందులో ఉన్నాయి. 'ఏటి ఒడ్దున చిలుకమ్మ/ ఏడుస్తున్నది ఏలమ్మా?/ ఏనుగు వచ్చి ఆటలాడగా/ ఏడుపాపినది చూడమ్మా' అని రాస్తారు. గేయాన్ని అందంగా రాయడమే కాదు అంతే అందమైన వర్ణనలు చేర్చడం ఈ తాతయ్యకు బాగా తెలుసు, అందుకే లండన్లోని తన వారసుల కోసం ఇండియాలోని ఇంటి గుమ్మానికి యింత చక్కని గేయతోరణాలను కట్టారు. 'ఆనంద నందివర్ధనాలు'లోని రంగుల ఫొటోలకు రాసిన గేయాలు కూడా అటువంటివే. మల్లెవంటి మనసుతో సాహిత్య సృజన చేస్తున్న 'బొల్లేపల్లి' బొడ్డుమల్లికి జేజేలు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548