Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్లే, రూట్, స్టోక్స్ విఫలం
- ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడో టెస్టు
మాంచెస్టర్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్, వెస్టిండీస్ విజ్డెన్ సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రసవత్తవరంగా సాగుతోంది. తొలి రోజు ఆటలో ఆధిపత్యం ఇరు జట్లతో తోబుచులాడుతోంది. తొలి ఓవర్లోనే వికెట్ కూల్చి కరీబియన్లు తొలుత పైచేయి సాధించగా..ఓపెనర్ రోరీ బర్న్స్ అర్థ సెంచరీతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తొలి రోజు ఆటలో రెండు సెషన్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 131/4తో నిలిచింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ (2 నాటౌట్), ఒలీ పోప్ (24 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా ఆడుతున్నారు. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ మూడో టెస్టు మొదలైంది. ఇరు జట్ల క్రికెటర్లు మోకాళ్ల కూర్చోని సమానత్వ సంకేతాలు అందించారు.
రసవత్తవరం.. : తొలి రెండు టెస్టులను ఒక్కో జట్టు సాధికారికంగా సొంతం చేసుకున్నాయి. నిర్ణయాత్మక మూడో టెస్టులో ఏ జట్టు స్పష్టమైన ఆధిపత్యం చెలాయించటం లేదు. ఆధిపత్య పోరు ఇంకా నడుస్తూనే ఉంది. మరోసారి టాస్ నెగ్గిన బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఆతిథ్య జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ జోరుకు కళ్లెం వేసింది. గత మ్యాచ్ శతక హీరో డామినిక్ సిబ్లే (0)ను కీమర్ రోచ్ తొలి ఓవర్ ఆఖరు బంతికి అవుట్ చేయగా.. కెప్టెన్ జో రూట్ (17) రనౌట్ అయ్యాడు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (20) వికెట్లను కీమర్ రోచ్ గిరాటేశాడు. ఓపెనర్ రోరీ బర్న్స్ (57, 147 బంతుల్లో 4 ఫోర్లు) మరో ఎండ్‌లో నిలిచాడు. విలువైన భాగస్వామ్యాలతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అర్థ సెంచరీ అనంతరం స్పిన్నర్ ఛేజ్ బంతికి స్లిప్స్‌లో బాహుబలి కార్న్‌వాల్ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒలీ పోప్, జోశ్ బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కార్న్‌వాల్, జేసన్ హౌల్డర్, గాబ్రియల్‌కు వికెట్లేమీ దక్కలేదు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : రోరి బర్న్స్ (సి) కార్న్‌వాల్ (బి) ఛేజ్ 57, డామినిక్ సిబ్లే (ఎల్బీ) కీమర్ రోచ్ 0, జో రూట్ (రనౌట్) ఛేజ్ 17, బెన్ స్టోక్స్ (బి) కీమర్ రోచ్ 20, ఒలీ పోప్ నాటౌట్ 24, జోశ్ బట్లర్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు :11, మొత్తం : (53 ఓవర్లలో 4 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-1, 2-47, 3-92, 4-122.
బౌలింగ్ : కీమర్ రోచ్ 12.4- 1-28-2, గాబ్రియల్ 13.2-3-22-0, జేసన్ హౌల్డర్ 12-3-25-0, కార్న్‌వాల్ 13-2-44-0, రోస్టన్ ఛేజ్ 2-1-1-1.