Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం
- ఫైనల్లో అజరెంకాపై కండ్లుచెదిరే విజయం
- మూడేండ్లలో రెండో యుఎస్ టైటిల్ వశం
జపాన్ స్టార్ నవోమి ఒసాక చరిత్ర సృష్టించింది. 1994 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్ కోల్పోయినా.. టైటిల్ విజయం సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. 1994 మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో దిగ్గజం మార్గరెట్ కోర్టుపై సాంచెజ్ సంచలన విజయం సాధించగా.. తాజాగా బెలారస్ భామ, మాజీ వరల్డ్ నం.1 విక్టోరియా అజరెంకాపై నవోమి ఒసాక కండ్లుచెదిరే విజయం సాధించింది. 2018లో యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఒసాక మళ్లీ 2020లో ట్రోఫీ ముద్దాడింది. ఒసాక కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో ఒసాక ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి ఎగబాకింది.
న్యూయార్క్ (యుఎస్ఏ) : యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్. ఏడేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం బెలారస్ భామ, మాజీ వరల్డ్ నం.1 విక్టోరియా అజరెంకా టైటిల్ పోరులో నిలిచింది. రెండేండ్ల క్రితం ఇక్కడే దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌పై తొలి యుఎస్ ఓపెన్ టైటిల్ విజయం రుచి చూసిన జపాన్ సూపర్‌స్టార్ నవోమి ఒసాక మరోవైపు నిలిచింది. టైటిల్ పోరులో తొలి సెట్. ఫేవరెట్‌గా మొదలుపెట్టిన ఒసాక అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. బేస్‌లైన్ దగ్గర తడబాటుకు లోనైన ఒసాక తొలి సెట్లో దారుణంగా ఆడింది. 1-6తో విక్టోరియా అజరెంకాకు ఆధిక్యం సమర్పించుకుంది. గ్రాండ్‌స్లామ్ ఓపెన్ టైటిల్ పోరు. తొలి సెట్లో ఒక్క గేమ్ మాత్రమే గెల్చుకున్న ఒసాకపై తీవ్రమైన ఒత్తిడి. న్యూయార్క్ ప్రధాన స్టేడియంలో ఫైనల్లో తొలి సెట్లో వెనుకంజ వేసిన తర్వాత, టైటిల్ విజయం సాధించిన రికార్డు 1994 తర్వాత లేనేలేదు. విక్టోరియా అజరెంకా జోరుచూసిన తర్వాత, ఒసాక మళ్లీ పుంజుకుంటుందనే అంచనాలు సైతం లేవు. ఆశలు లేని మ్యాచ్‌లో నవోమి ఒసాక అద్భుతంగా రాణించింది. చివరి రెండు సెట్లలో కండ్లుచెదిరే ప్రదర్శనతో మెరిసింది. 6-3, 6-3తో చివరి రెండు సెట్లను గెల్చుకుని యుఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది. మూడేండ్లలో రెండో టైటిల్‌తో సత్తా చాటింది. 2018లో తొలిసారి యుఎస్ ఓపెన్ విజయం సాధించిన ఒసాక..పెద్దగా వార్తల్లో నిలువలేదు. అప్పట్లో సెరెనా విలియమ్స్ వివాదాస్పద వాగ్వాదంతో నవోమి ఒసాక టైటిల్ విజయాన్ని పెద్దగా ఆస్వాదించలేదు. ఈ ఏడాది అభిమానులు లేకపోయినా, చారిత్రక విజయం నమోదు చేసిన ఒసాక ర్యాంకింగ్స్‌లోనూ హవా చూపింది. మహిళల సింగిల్స్ డబ్లూటీఏ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి చేరుకుంది.
అదిరే విజయం
కెరీర్ మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నవోమి ఒసాక అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెల్చుకున్న క్రీడాకారిణిగా చైనా అమ్మాయి లీ నా రికార్డును అధిగమించింది. ఈ విజయంతో జపాన్‌లోనే కాదు ప్రపంచ టెన్నిస్‌లోనూ నవోమి ఒసాక సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఆదివారం నాటి మహిళల సింగిల్స్ ఫైనల్లో 1-6, 6-3, 6-3తో అపూర్వ విజయం సాధించిన ఒసాక.. విక్టోరియా అజరెంకాతో ఒక గంట 53 నిమిషాల పాటు పోరాడింది. ఆరు ఏస్‌లు కొట్టిన ఒసాక..34 విన్నర్లు సాధించింది. అజరెంకా 30 అనవసర తప్పిదాలు చేయగా.. ఒసాక 34 అనవసర తప్పిదాలకు పాల్పడింది. పాయింట్ల పరంగా విక్టోరియాపై 86-83తో పైచేయి సాధించింది. ఫైనల్లో తొలి 30 నిమిషాల ఆటలో ఒసాక ఎంతో ఇబ్బంది పడింది. బేస్ లైన్ ఆట, నెట్ గేమ్, ర్యాలీలలోనూ అజరెంకాతో పోటీపడలేకపోయింది. దీంతో తొలి సెట్లో సులువుగానే తలొంచింది. రెండో సెట్ నుంచి ఒసాక ఆట తీరే మారిపోయింది. కోరుకున్న చోట పాయింట్లు సాధించిన ఒసాక సూపర్ ఆటతో టైటిల్ విజయం సాధించింది. తొలి సెట్లో విజయంతో టైటిల్ లాంఛనమే అనుకున్న అజరెంకాకు ఒసాక అనూహ్య షాకిచ్చింది.
చెత్తగా ఓడిపోవద్దని అనుకున్నాను
'నిజాయితీగా చెప్పాలంటే తొలి సెట్లో విక్టోరియా అజరెంకా గొప్పగా ఆడిందని అనుకున్నాను. ఇక నేను చేయగలిగేది ఏమీ లేదు అనిపించింది. రెండో సెట్లో ప్రతి పాయింట్ కోసం ప్రయత్నించాను.
తొలి సెట్లో నేను ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. వంద శాతం ఆటతీరు కనబర్చాలని నా ఉద్దేశం కాదు. కనీసం 70 శాతం ప్రదర్శన చేసినా చాలు అనుకుంటాను. రెండో సెట్ ఆరంభంలోనూ వెనుకంజ వేశాను. అప్పుడు అనుకున్నాను మళ్లీ 1-6, 0-6తో ఓడిపోవద్దని. సానుకూల దృక్పథంతో ఆడాలని అనుకున్నాను. నాకు అదే మేలు చేసిందని అనుకుంటున్నాను. ఫైనల్లో అత్యంత ముఖ్యమైన గేమ్ అంటే.. మూడో సెట్లో అజరెంకా గేమ్‌ను బ్రేక్ చేయటమే అనుకుంటాను' అని మూడో గ్రాండ్‌స్లామ్ విజయం ఆనందంలో నవోమి ఒసాక వ్యాఖ్యానించింది. ' ఫైనల్లో ఒసాకకు రెండో సెట్ ఆరంభంలో బ్రేక్ లభించిందని అనుకుంటాను. అక్కడి నుంచి ఒసాక మెరుగ్గా ఆడటం మొదలుపెట్టింది. నేను కొన్ని మంచి షాట్లు కొట్టినా కానీ, ఒసాక ఎంతో దూకుడుగా ఆడింది. రెండో సెట్లోనూ నాకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. టైటిల్ పోరులో నేను చేయగలిగినదంతా చేశాను. ఇంతకన్నా మెరుగ్గా ఆడాల్సిందా? అంటే నాకు తెలిసి అవును. కానీ కోర్టులో నా శక్తిమేరకు పోరాడాను. ఒసాక మ్యాచ్ గెలిచింది. ఆమె చాంపియన్' అని విక్టోరియా అజరెంకా తెలిపింది.