Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వశం
- ఉత్కంఠ ఫైనల్లో జ్వెరెవ్‌పై మెరుపు విజయం
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2020
2018 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్. మట్టికోర్టు మొనగాడు రఫేల్ నాదల్ చేతిలో వరుస సెట్లలో టైటిల్ చేజారింది. 2019 మళ్లీ అక్కడే, అదే ప్రత్యర్థి. ఫలితమూ మారలేదు. కానీ ఈసారి నాదల్ విజయం కోసం నాలుగు సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్. మెల్బోర్న్లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్. ఈసారి ప్రత్యర్థి నొవాక్ జకోవిచ్. హార్డ్కోర్ట్ సూపర్‌హీరో జకోవిచ్ టైటిల్ కోసం ఏకంగా ఐదు సెట్ల పాటు పోరాడక తప్పలేదు. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ఫైనల్లో తలపడినా, ఒక్కసారీ టైటిల్ దక్కలేదు. 2020 యుఎస్ ఓపెన్ ఫైనల్స్. తొలి రెండు సెట్లు కోల్పోయాడు. ఇక్కడే మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ అనుభవాన్ని రంగరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు డొమినిక్ థీమ్. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై దండయాత్ర చేసిన ఆస్ట్రియా స్టార్ థీమ్ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ముద్దాడాడు.
న్యూయార్క్ (యుఎస్ఏ)
పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోరు. రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయం కోసం పోరాడుతున్నారు. తొలి రెండు సెట్లలో జ్వెరెవ్ పైచేయి సాధించగా, తర్వాతి రెండు సెట్లలో డొమినిక్ థీమ్ ఆధిపత్యం చూపించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో ఇద్దరికీ ముగించే అవకాశం లభించింది. 5-3 వద్ద జ్వెరెవ్ సర్వ్ చేయగా.. థీమ్ బ్రేక్ చేశాడు. 6-5 వద్ద మ్యాచ్ పాయింట్ కోసం థీమ్ సర్వ్ చేయగా దాన్ని జ్వెరెవ్ బ్రేక్ చేశాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ టైబ్రేకర్‌లో తేలే వరకూ వెళ్లింది. ఇక్కడే థీమ్ మరోసారి తన మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ అనుభవాన్ని వినియోగించాడు. సూపర్ టైబ్రేకర్‌లో 8-6తో జ్వెరెవ్‌పై పైచేయి సాధించి కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయం అందుకున్నాడు. టెన్నిస్ ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడినా.. 2-6, 4-6, 6-4, 6-3, 7-6(8-6)తో టైటిల్ విజయం సాధించిన తొలి క్రీడాకారుడిగా థీమ్ రికార్డు సృష్టించాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరుకున్న జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ అద్భుతంగా ఆడినా, థీమ్ దూకుడు ముందు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోక తప్పలేదు.
ఆరంభంలో జ్వెరెవ్ :
గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో జర్మనీ స్టార్ జ్వెరెవ్ దూకుడుగా ఆడాడు. తొలి రెండు సెట్లలో జ్వెరెవ్ దూకుడే కనిపించింది. ఆరున్నర అడుగుల జ్వెరెవ్ గంటకు 140 మీటర్ల వేగంతో సర్వ్ చేసి థీమ్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. జ్వెరెవ్ తొలి సెట్లోనే ఏకంగా 16 విన్నర్లతో జోరందుకున్నాడు. రెండో సెట్లోనూ జర్మనీ స్టార్ హవా కొనసాగింది. 6-2, 6-4తో వరుసగా తొలి రెండు సెట్లు సొంతం చేసుకున్నాడు. టెన్నిస్ ఓపెన్ శకంలో తొలి రెండు సెట్లు కోల్పోయి టైటిల్ గెలిచిన చరిత్ర లేదు. దీంతో జర్మనీ కుర్రాడు గ్రాండ్‌స్లామ్ అందుకోవటం లాంఛనమే అనిపించింది.
ముగింపు థీమ్ది :
మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ఫైనల్లో తలపడినా, విజయం అందుకోని థీమ్ తొలి రెండు సెట్లలో వెనుకంజ వేసి నాల్గోసారీ నిరాశే అనిపించాడు. కానీ మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాక మాదిరిగా, పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ వేగంగా పుంజుకున్నాడు. ఆఖరు వరకూ విజయం కోసం పోరాడాడు. ఆ ప్రయత్నంలో అద్భుత విజయం నమోదు చేసి, చరిత్ర సృష్టించాడు. నాలుగు గంటల ఓ నిమిషం పాటు సాగిన ఫైనల్లో డొమినిక్ థీమ్ 8 ఏస్‌లే కొట్టగా.. జ్వెరెవ్ 15 ఏస్‌లు సంధించాడు. జ్వెరెవ్ 15 డబుల్ ఫాల్ట్స్ చేయగా.. థీమ్ 8 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. జ్వెరెవ్ 8 సార్లు థీమ్ సర్వ్‌ను బ్రేక్ చేయగా.. థీమ్ ఏడుసార్లు జ్వెరెవ్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. ఫైనల్లో ఐదో సెట్లో ఆఖరు ఐదు సర్వ్‌లలో ఏకంగా నాలుగు సర్వ్‌లు బ్రేక్ కావటం విశేషం. జ్వెరెవ్ 52 విన్నర్లు సాధించగా, థీమ్ 43 విన్నర్లే గెల్చుకున్నాడు. జ్వెరెవ్ 65 అనవసర తప్పిదాలకు పాల్పడగా, థీమ్ 55 అనవసర తప్పిదాలే చేశాడు. పాయింట్ల పరంగా థీమ్ 1563-159తో జ్వెరెవ్‌పై పైచేయి సాధించాడు.