Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీల్ గవాస్కర్‌కు అనుష్క సూటిప్రశ్న
- నా వ్యాఖ్యలు వక్రీకరించారన్న సన్నీ
దుబాయ్ : బయో సెక్యూర్ బబుల్ ఐపీఎల్లో అంపైరింగ్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండగా.. తాజాగా వ్యాఖ్యాతల కామెంట్లు సైతం రచ్చ లేపుతున్నాయి. దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన చేశాడు. అజేయ శతక హీరో కెఎల్ రాహుల్ రెండు సులువైన క్యాచులు నేలపాలు చేసిన విరాట్ కోహ్లి.. బ్యాటింగ్‌లోనూ తేలిపోయాడు. ఐదు బంతుల్లో ఒక్క పరుగే చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్‌స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ భారత కెప్టెన్ ప్రదర్శనపై ఈ విధంగా వ్యాఖ్యానించాడు. ' బ్యాటింగ్ మెరుగుపర్చుకునేందుకు విరాట్ కోహ్లి ఎంతో ఆసక్తిగా ఉంటాడు. నిరంతర ప్రాక్టీస్‌తో అది సాధ్యపడుతుందని అతడికి తెలుసు. లాక్డౌన్ (కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్) సమయంలో విరాట్ కేవలం అనుష్క శర్మ బౌలింగ్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడు. అది అతడికి పెద్దగా ఉపయోగపడలేదని తెలుస్తోంది' అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు విరాట్ కోహ్లి అప్పటికీ క్రీజులోనే కొనసాగుతున్నాడు. విరాట్ పేలవ ప్రదర్శనకు అనుష్క శర్మను నిందించటం ఎంత వరకు సబబని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సునీల్ గవాస్కర్‌ను ప్రశ్నించారు. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సన్నీ వ్యాఖ్యలపై స్పందించింది. ' మిస్టర్ గవాస్కర్, మీ వ్యాఖ్యలు అసహ్యకరమైనవి. భర్త ఆటతీరుపై భార్యను నిందించటానికి గల కారణం ఎందుకో వివరణ ఇస్తే సంతోషిస్తాను. ఏండ్లుగా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలకు మీరెంతో గౌరవం ఇచ్చారని నాకు తెలుసు. అదే రీతిలో నాపై, మాపై సమాన గౌరవం ఉంటుందని అనుకోవటం లేదా? నా భర్త ప్రదర్శనపై వ్యాఖ్యానం చేసేందుకు, మీ దగ్గర మరెన్నో పదాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఈ ప్రక్రియలో నాపేరు వాడటానికి ఏమైనా సంబంధం ఉందా?' అని అనుష్క శర్మ పోస్ట్ చేసింది. అనుష్క శర్మ, అభిమానుల ఫైర్‌పై సన్నీ స్పందించాడు. ' ముందుగా, నేను అనుష్క శర్మను ఎక్కడ నిందించాను? లాక్డౌన్లో కోహ్లికి అనుష్క బౌలింగ్ చేసిన వీడియో చూశాను. లాక్డౌన్లో కాలక్షేపం కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడారు. అందులో విరాట్ వైఫల్యానికి అనుష్కను ఎక్కడ నిందించాను? పర్యటనలకు వెళ్లినప్పుడు క్రికెటర్లకు తోడుగా భార్యలు ఉండాలని మద్దతుగా నిలిచింది నేనే.
అనుష్క లాక్డౌన్లో కోహ్లికి బౌలింగ్ చేసింది. అందుకే అలా అన్నాను. నేను ఎక్కడా అనుష్కను నిందించలేదు, సెక్సీస్ట్ కామెంట్ చేయలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తే, అందుకు నేనేం చేయగలను' అని గవాస్కర్ అన్నాడు.