Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో శుభ్‌మన్ గిల్, మోర్గాన్ జోరు
- సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అలవోక విజయం
విజయం సాధించాల్సిన తొలి మ్యాచ్‌లో అనుభవలేమి మిడిల్ ఆరర్ కారణంగా ఓటమి దరిచేరింది. అనుభవజ్ఞులు వృద్దిమాన్ సాహా, మహ్మద్ నబిలు మిడిల్లో రావటంతో సన్‌రైజర్స్ కథ మారుతుందనే అనుకున్నారు. కానీ మైదానంలో షో అందుకు భిన్నంగా సాగింది. పేలవ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 142/4 పరుగులే చేసింది. ఆరెంజ్ ఆర్మీపై నైట్‌రైడర్స్ పక్కా ప్రణాళిక అమలు చేసింది!. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (70 నాటౌట్) రాణించటంతో కోల్‌కత సీజన్లో తొలి విజయం సాధించింది.
అబుదాబి (యుఏఈ) : సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ తడబడింది. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మనీశ్ పాండే (51, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (36, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా హైదరాబాద్ 142/4 స్కోరు సాధించింది. స్వల్ప ఛేదనను కోల్‌కత 12 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (70 నాటౌట్, 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇయాన్ మోర్గాన్ ( 43 నాటౌట్, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) 92 పరుగుల భాగస్వామ్యంతో రాణించారు. 18 ఓవర్లలోనే కోల్‌కత 145/3తో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఛేదనలో గిల్ జోరు
స్వల్ప ఛేదనలో సునీల్ నరైన్ (0), దినేశ్ కార్తీక్ (0)లు డకౌట్‌గా నిష్క్రమించినా.. కోల్‌కత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (70 నాటౌట్) తొలుత నితీశ్ రానా (26)తో, తర్వాత ఇయాన్ మోర్గాన్ (42 నాటౌట్)తో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి హైదరాబాద్ ఆశలు వమ్ము చేశాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిసిన శుభ్‌మన్ గిల్ 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో కోల్‌కత హడావుడి లేకుండా పని పూర్తి చేసింది.
ఆదుకున్న మనీశ్ పాండే
టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. జానీ బెయిర్‌స్టో (5) పది బంతుల్లో ఐదు పరుగులే చేశాడు. పాట్ కమిన్స్‌కు వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ డెవిడ్ వార్నర్ (36, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకలిసిన మనీశ్ పాండే (51, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతులు ఆడిన డెవిడ్ వార్నర్ దూకుడుగా పరుగులు రాబట్టలేదు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో మెరిసిన మనీశ్ పాండే 35 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. భారీ షాట్లు కొట్టేందుకు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. మనీశ్ పాండే వచ్చీ రాగానే రెండు సిక్సర్లతో కదం తొక్కినా.. బౌండరీల్లో నిలకడ చూపించలేదు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వార్నర్ వెనుదిరగగా.. వృద్దిమాన్ సాహా (30, 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెప్పించలేదు. స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు సైతం ఇబ్బంది పడిన సాహా.. 31 బంతుల్లో 30 పరుగులే చేశాడు. సాహా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ కనీసం ఓ 20 పరుగులు కోల్పోయింది!. ఆఖర్లో మహ్మద్ నబి (11 నాటౌట్, 8 బంతుల్లో 2 ఫోర్లు), అభిషేక్ శర్మ (2 నాటౌట్) జట్టు స్కోరును 140 మార్క్ దాటించారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి,బి) వరుణ్ చక్రవర్తి 36, జానీ బెయిర్‌స్టో (బి) పాట్ కమిన్స్ 5, మనీశ్ పాండే (సి,బి) అండ్రీ రసెల్ 51, వృద్దిమాన్ సాహా రనౌట్ (కమిన్స్/కార్తీక్) 30, మహ్మద్ నబి నాటౌట్ 11, అభిషేక్ శర్మ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-24, 2-59, 3-121, 4-138.
బౌలింగ్ : సునీల్ నరైన్ 4-0-31-0, పాట్ కమిన్స్ 4-0-19-1, శివం మవి 2-0-15-0, కుల్దీప్ యాదవ్ 2-0-15-0, వరుణ్ చక్రవర్తి 4-0-25-1, కమలేశ్ నాగర్కోటి 2-0-17-0, అండ్రీ రసెల్ 2-0-16-1.
కోల్‌కత ఇన్నింగ్స్ : శుభ్‌మన్ గిల్ నాటౌట్ 70, సునీల్ నరైన్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 0, నితీశ్ రానా (సి) సాహా (బి) నటరాజన్ 26, దినేశ్ కార్తీక్ (ఎల్బీ) రషీద్ ఖాన్ 0, ఇయాన్ మోర్గాన్ నాటౌట్ 42, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం :(18 ఓవర్లలో 3 వికెట్లకు) 145.
వికెట్ల పతనం : 1-6, 2-43, 3-53.
బౌలింగ్ : భువనేశ్వర్ 3-0-29-0, ఖలీల్ అహ్మద్ 3-0-28-1, నటరాజన్ 3-0-27-1, రషీద్ ఖాన్ 4-0-25-1, మహ్మద్ నబి 4-0-23-0, అభిషేక్ శర్మ 1-0-11-0.