Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో 42 బంతుల్లోనే 85
- 223 టార్గెట్‌ను ఊదేసిన రాజస్థాన్ మయాంక్ అగర్వాల్ శతకం వృథా
సంజు శాంసన్ (85, 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మళ్లీ చెలరేగాడు. 224 పరుగుల ఛేదనలో పంజాబ్ బౌలర్లపై సంజు పంజా విసిరాడు. రాహుల్ తెవాటియ (53), స్టీవ్ స్మిత్ (50) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. సంజు విశ్వరూపంతో 19.3 ఓవర్లలaోనే రాజస్థాన్ లక్ష్యాన్ని చేధించింది. మయాంక్ అగర్వాల్ (106, 50 బంతుల్లో 10 ఫోర్లు,7 సిక్స్‌లు) కెరీర్ తొలి ఐపీఎల్ శతకం వృథా అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
షార్జా (యుఏఈ) : రాజస్థాన్ రాయల్స్ షార్జాలో మరో తుఫాన్ సృష్టించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సంజు శాంసన్ (85, 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్ తెవాటియ (53, 31 బంతుల్లో 7 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (50, 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ చెలరేగటంతో రాజస్థాన్ రాయల్స్ 19.3 ఓవర్లలోనే 226/6తో 4 వికెట్ల తేడాతో సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఛేదనలో చెలరేగిన సంజు శాంసన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (106, 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం, కెఎల్ రాహుల్ (69, 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో భారీ స్కోరు సాధించింది.
రాయల్స్ ఊదేసింది : 224 పరుగుల లక్ష్యం. ఓపెనర్ జోశ్ బట్లర్ (4) త్వరగా అవుటయ్యాడు. ఆరంభంలో పంజాబ్‌కు మొగ్గు. కానీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (50) దూకుడుగా పరుగులు రాబట్టాడు. 2 సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఛేదనకు చక్కటి పునాది వేశాడు. మరో ఎండ్‌లో సంజు శాంసన్ వచ్చీ రాగానే విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో పంజా విసిరాడు. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 27 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన శాంసన్... ఆ తర్వాత నాలుగు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్మిత్ నిష్క్రమణ తర్వాత రాహుల్ తెవాటియ (53) సంజుతో కలిసి పంజాబ్‌పై దండయాత్ర చేశాడు. రాహుల్ ఏడు సిక్సర్లతో విశ్వరూపం చూపించి 30 బంతుల్లో అర్ద సెంచరీ నమోదు చేశాడు. ఆఖర్లో సంజు అవుటైనా.. అప్పటికే రాయల్స్ విజయానికి రంగం సిద్ధం చేసి పెట్టాడు. జోఫ్రా ఆర్చర్ (13 నాటౌట్, 3 బంతుల్లో 2 సిక్స్‌లు) మళ్లీ బ్యాట్‌తో కదం తొక్కటంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ లక్ష్యాన్ని చేరుకుంది. మహ్మద్ షమి (3/53) మూడు వికెట్లు కూల్చినా.. పరుగుల కట్టడి చేయలేకపోయాడు.
మయాంక్ మెరుపుల్ : టాస్ నెగ్గిన రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ అజేయ శతక హీరో కెఎల్ రాహుల్ (69) జతగా మమాంక్ అగర్వాల్ (106) పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. చిన్న బౌండరీల షార్జాలో అందరి చూపులు రాహుల్‌పైనే ఉన్నాయి. విధ్వంసానికి అగర్వాల్ నాయకత్వం వహించాడు. రాహుల్ తోడుగా రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్.. ఏడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 45 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. జోఫ్రా ఆర్చర్‌కు హ్యాట్రిక్ బౌండరీలతో స్వాగతం పలికిన కెఎల్ రాహుల్.. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా రాహుల్ చక్కగా సహకరించాడు. ఓపెనర్లు ఇద్దరూ పంజాబ్‌కు 183 పరుగులు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రాయల్స్ బౌలర్లందరినీ సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్ ఐపీఎల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మయాంక్, స్కోరు వేగం పెంచే క్రమంలో రాహుల్ నిష్క్రమించారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (25 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), గ్లెన్ మాక్స్వెల్ (13 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు) జట్టు స్కోరును 223కు చేర్చారు. రాయల్స్ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్, టామ్ కరన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు
పంజాబ్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) శ్రేయాష్ గోపాల్ (బి) అంకిత్ రాజ్‌పుత్ 69, మయాంక్ అగర్వాల్ (సి) సంజు శాంసన్ (బి) టామ్ కరన్ 106, గ్లెన్ మాక్స్వెల్ నాటౌట్ 13, నికోలస్ పూరన్ నాటౌట్ 25, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223.
వికెట్ల పతనం : 1-183, 2-194.
బౌలింగ్ : జైదేవ్ ఉనద్కత్ 3-0-30-0, అంకిత్ రాజ్‌పుత్ 4-0-39-1, జోఫ్రా ఆర్చర్ 4-0-46-0, శ్రేయాష్ గోపాల్ 4-0-44-0, రాహుల్ తెవాటియ 1-0-19-0, టామ్ కరన్ 4-0-44-1.
రాజస్థాన్ ఇన్నింగ్స్ : జోశ్ బట్లర్ (సి) సర్ఫరాజ్ (బి) కాట్రెల్ 4, స్టీవ్ స్మిత్ (సి) షమి (బి) నీషమ్ 50, సంజు శాంసన్ (సి) రాహుల్ (బి) షమి 85, రాహుల్ (సి) మయాంక్ (బి) షమి 53, ఉతప్ప (సి) పూరన్ (బి) షమి 9, ఆర్చర్ నాటౌట్ 13, రియాన్ పరాగ్ (బి) అశ్విన్ 0, టామ్ కరన్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226.
వికెట్ల పతనం : 1-19, 2-100, 3-161, 4-203, 5-222, 6-222.
బౌలింగ్ : కాట్రెల్ 3-0-52-1, షమి 4-0-53-3, బిష్ణోరు 4-0-34-0, నీషమ్ 4-0-40-1, ఎం. అశ్విన్ 1.3-0-16-1, మాక్స్వెల్ 3-0-29-0.