Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయల్స్‌పై మళ్లీ పైచేయి
- అగ్రస్థానానికి అయ్యర్ జట్టు
దుబాయ్ (యుఏఈ) : ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై క్యాపిటల్స్ సీజన్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దుబారు పిచ్‌పై స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల ఛేదనలో ఓపెనర్ బెన్ స్టోక్స్ (41, 35 బంతుల్లో 6 ఫోర్లు), జోశ్ బట్లర్ (22, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించినా ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 148/8 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధావన్ (57, 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయాస్ అయ్యర్ (53, 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధంచటంతో ఆ జట్టు 161/7 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. సీజన్లో ఆరు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు మరో రెండు విజయాల దూరంలో నిలిచింది.
బౌలర్ల తెగువ!
స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ బౌలర్లు చక్కగా కాపాడుకున్నారు. ఆరంభంలోనే జోశ్ బట్లర్ (22) మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో విరుచుకుపడగా.. సంజు శాంసన్ (25, 18 బంతుల్లో 2 సిక్సర్లు) మరో రెండు సిక్స్‌లతో చెలరేగాడు. బెన్ స్టోక్స్ ఓ ఎండ్‌లో నిలకడగా రాణించటంతో రాయల్స్ లక్ష్యం దిశగానే సాగింది. కానీ వరుస వికెట్లతో ఢిల్లీ బౌలర్లు రాయల్స్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ స్మిత్ (1)ను అశ్విన్ వెనక్కి పంపగా.. తనపై సీజన్లో తొలి సిక్సర్ కొట్టిన సంజు శాంసన్‌ను అక్షర్ పటేల్ సాగనంపాడు. మిడిల్ ఆర్డర్లో నిలబడిన రాబిన్ ఉతప్ప (32, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)ను నోకియా డగౌట్‌కు చేర్చాడు. ఈ సారి రాహుల్ తెవాటియ (14 నాటౌట్, 18 బంతుల్లో 1 ఫోర్), రియాన్ పరాగ్ (1)లు ఢిల్లీ బౌలర్లపై సంచలనాలు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టుకు సీజన్లో ఐదో పరాజయం తప్పలేదు.
గబ్బర్ గర్జన
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తొలి బంతికే యువ ఓపెనర్ పృథ్వీ షా (0)ను కోల్పోయిన క్యాపిటల్స్.. అజింక్య రహానె (2) వికెట్‌నూ ఎంతోసేపు నిలుపుకోలేదు. ఈ దశలో శిఖర్ ధావన్ (57), శ్రేయాస్ అయ్యర్ (53)లు మూడో వికెట్‌కు విలువైన 85 పరుగులు జోడించారు. శిఖర్ ధావన్ ఐపీఎల్లో 39వ అర్థ సెంచరీ సాధించగా.. అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ (18), అలెక్స్ కేరీ (14), అక్షర్ పటేల్ (7)లు ఆఖర్లో ఢిల్లీని 160 పరుగుల మార్క్ దాటించారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ ఇన్నింగ్స్
161/7 ( శిఖర్ ధావన్ 57, శ్రేయాస్ అయ్యర్ 53, జోఫ్రా ఆర్చర్ 3/19, జైదేవ్ ఉనద్కత్ 2/32)
రాజస్థాన్ ఇన్నింగ్స్
148/8 ( బెన్ స్టోక్స్ 41, రాబిన్ ఉతప్ప 32, దేశ్‌పాండే 2/37, నోకియా 2/33, రబాడ 1/28)