Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాట్ కమిన్స్ అజేయ అర్థ సెంచరీ
- రాణించిన ముంబయి బౌలర్లు
- కోల్‌కత నైట్‌రైడర్స్ 148/5
అబుదాబి (యుఏఈ)
10.4 ఓవర్లలో 61/5. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ దుస్థితి ఇది. రాహుల్ చాహర్ వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టడంతో కోల్‌కత నైట్‌రైడర్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో టెయిలెండర్ పాట్ కమిన్స్ (53 నాటౌట్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కోల్‌కతను ఆదుకున్నాడు. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (39 నాటౌట్, 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి పాట్ కమిన్స్ ఆరో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు రాణించటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ 148/5తో గౌరవప్రద స్కోరు సాధించింది.
చాహర్ మ్యాజిక్ : టాస్ గెలిచిన కోల్‌కత తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7) నిరాశపరచగా.. రెండు ఫోర్లతో జోరందుకున్న శుభ్‌మన్ గిల్ (21, 23 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో కుదురుకున్నట్టే కనిపించాడు. నం.3 బ్యాట్స్‌మన్ నితీశ్ రానా (5)ను నాథన్ కౌల్టర్ నైల్ వచ్చీ రాగానే అవుట్ చేశాడు. పవర్ ప్లే అనంతరం రాహుల్ చాహర్ మ్యాజిక్ చూపించాడు. పరుగుల కట్టడి చేసిన రాహుల్‌పై వినూత్న షాట్లు ఆడేందుకు వెళ్లి కోల్‌కత నష్టపోయింది. వరుస బంతుల్లో శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్ (4)లను సాగనంపిన చాహర్ కోల్‌కతను ఒత్తిడిలో పడేశాడు. కెప్టెన్సీ వదులుకుని తొలి మ్యాచ్‌లో ఆడుతున్న కార్తీక్ నిరాశపరిచాడు. పది ఓవర్లలోపే క్రీజులోకి వచ్చిన అండ్రీ రసెల్ (12, 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ను బుమ్రా అవుట్ చేశాడు. అంచనలకు అందని బౌన్సర్‌తో రసెల్‌ను సాగనంపాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో జతకలిసిన పాట్ కమిన్స్ హిట్టింగ్తో చెలరేగాడు. ఐదు ఫోర్లు, రెండు ఫోర్లతో మెరిసిన కమిన్స్ కోల్‌కతను ఆదుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో కమిన్స్ అర్థ సెంచరీ సాధించగా.. ఆఖరు ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన మోర్గాన్ స్కోరును 150కి చేరువ చేశాడు. ఆఖరు ఓవర్లో కౌల్టర్ నైల్‌పై 21 పరుగులు పిండుకున్న మోర్గాన్ బౌలర్లకు పోరాడగలిగే స్కోరు అందించాడు. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, బౌల్ట్, కౌల్టర్నైల్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
కోల్‌కత నైట్ రైడర్స్ : రాహుల్ త్రిపాఠి (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) ట్రెంట్ బౌల్ట్ 7, శుభ్‌మన్ గిల్ (సి) కీరన్ పొలార్డ్ (బి) రాహుల్ చాహర్ 21, నితీశ్ రానా (సి) డికాక్ (బి) కౌల్టర్ నైల్ 5, దినేశ్ కార్తీక్ (బి) రాహుల్ చాహర్ 4, ఇయాన్ మోర్గాన్ నాటౌట్ 39, అండ్రీ రసెల్ (సి) డికాక్ (బి) బుమ్రా 12, పాట్ కమిన్స్ నాటౌట్ 53, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148.
వికెట్ల పతనం : 1-18, 2-33, 3-42, 4-42, 5-61.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-32-1, నాథన్ కౌల్టర్ నైల్ 4-0-51-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-22-1, కృనాల్ పాండ్య 4-0-23-0, రాహుల్ చాహర్ 4-0-18-2.
ఐపీఎల్ నేటి మ్యాచ్
రాజస్థాన్ X బెంగళూర్
దుబాయ్ లో మ. 3.30 నుంచి..
చెన్నై X ఢిల్లీ క్యాపిటల్స్
షార్జాలో రా.7.30 నుంచి..
స్టార్‌స్పోర్ట్స్ లో ప్రసారం