Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారథ్యం వదులుకున్న దినేశ్ కార్తీక్
- ఇయాన్ మోర్గార్ కు కోల్‌కత పగ్గాలు
అబుదాబి (యుఏఈ)
గురువారం, అబుదాబిలో ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్. డిఫెండింగ్ చాంపియన్‌తో పేలవ రికార్డున్న కోల్‌కత నేటి మ్యాచ్‌లో మెరుగైన వ్యూహలతో నాలుగు సార్లు చాంపియన్‌ను ఇరుకున పెట్టగలదా? లేక రోహిత్ సేన మరోసారి కోల్‌కతపై పైచేయి సాధిస్తుందా? ఇలా అందరి దృష్టి వ్యూహప్రతివ్యూహలపైనే. కానీ మ్యాచ్‌కు గంటల ముందు కోల్‌కత నైట్‌రైడర్స్ నుంచి సంచలన ప్రకటన వెలువడింది. 2018 నుంచి కోల్‌కత నాయకుడిగా కొనసాగుతున్న దినేశ్ కార్తీక్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్ 2020లో కోల్‌కతను ఏడు మ్యాచుల్లో నాలుగింట గెలుపు దారిలో నడిపించిన దినేశ్ కార్తీక్.. సీజన్ మధ్యలో కెప్టెన్సీ బరువును దింపేసుకున్నాడు.
ఇప్పుడే ఎందుకు? : కోల్‌కత నైట్‌రైడర్స్ అభిమానులు ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ ముందు నుంచీ కోరుకోవటం లేదు. ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో మినహా కార్తీక్ నాయకత్వంలో పెద్దగా మెప్పించలేదు. ప్రపంచ అత్యుత్తమ టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జట్టులో ఉండగా.. దినేశ్ కార్తీక్ నాయకత్వాన్ని అభిమానులు, విశ్లేషకులు ఓ పట్టాన అంగీకరించలేకపోయారు. చివరి మ్యాచ్‌లో అర్థ సెంచరీ మినహా దినేశ్ కార్తీక్ బ్యాట్స్‌మన్‌గా రాణించింది లేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులే చేశాడు. కోరుకున్న స్థానంలో ఆడేందుకు కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ అంగీకరించటం లేదని స్వయంగా కార్తీక్ ఓ మీడియా సమావేశంలో నోరుజారాడు. 2018లో రూ.7.4 కోట్లకు దినేశ్ కార్తీక్‌ను తీసుకున్న కోల్‌కత అతడినే కెప్టెన్‌గా ఎంచుకుంది. 2018లో మూడో స్థానంలో నిలిచిన కోల్‌కత, 2019లో ఐదో స్థానంలో నిలిచింది. ఇక గత సీజన్లో అండ్రీ రసెల్ సైతం కార్తీక్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కంటే పెద్ద ఆటగాళ్లను కార్తీక్‌ను సరిగా మేనేజ్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇయాన్ మోర్గాన్ సైతం డ్రెస్సింగ్‌రూమ్‌లో చేరాడు. ఈ కారణాలు సైతం కార్తీక్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.
మోర్గానే ఎందుకు? : ' దినేశ్ కార్తీక్ వంటి లీడర్‌ను కలిగి ఉండటం కోల్‌కత అదృష్టం. కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. అయినా అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం. కోల్‌కతలో ఇది కేవలం బాధ్యతల మార్పిడి మాత్రమే' అని కోల్‌కత నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు. 2020 వేలంలో ఇయాన్ మోర్గాన్‌ను రూ.5.25 కోట్లకు కోల్‌కత సొంతం చేసుకుంది. 2012లో ఇదే ప్రాంఛైజీలో బ్రెండన్ మెక్‌కలమ్‌తో కలిసి మోర్గాన్ డ్రెస్సింగ్‌రూమ్ పంచుకున్నాడు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ నాయకుడిగా ఎదిగిన మోర్గాన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 కెప్టెన్లలో ఒకడిగా పేరొందాడు. నాయకత్వంలో బ్రెండన్ మెక్కలమ్నే మోర్గాన్ ఆదర్శంగా తీసుకుంటాడు. బ్రెండన్‌తో ఆ అనుబంధం, టీ20ల్లో స్ఫూర్తిదాయక నాయకత్వంతో కోల్‌కత నైట్‌రైడర్స్ పగ్గాలు ఇయాన్ మోర్గాన్ చేతికి చిక్కాయి. ఐపీఎల్లో బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, పంజాబ్, ముంబయి ప్రాంఛైజీలకు భారత క్రికెటర్లు కెప్టెన్సీ వహిస్తుండగా.. హైదరాబాద్, కోల్‌కత, రాజస్థాన్ నాయకత్వం విదేశీ క్రికెటర్ల చేతుల్లో ఉంది.