Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో పాండే, శంకర్ అర్థ సెంచరీలు
- మూడు వికెట్లతో మెరిసిన హోల్డర్
- రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ సూపర్ విజయం
దుబాయ్ (యుఏఈ)
రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మలి మ్యాచ్‌లో అదిరే విజయం సాధించింది.. బిగ్ హిట్టర్లతో కూడిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌ను క్రమం తప్పకుండా వికెట్లతో కట్టడి చేసిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ఆ జట్టును 154 పరుగులకే పరిమితం చేశారు. సీజన్లో అరంగేట్ర సీమర్ జేసన్ హౌల్డర్ (3/33) రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో రాయల్స్ చివరి 11 ఓవర్లలో 8 వికెట్లు చేతిలో నిలుపుకున్నా.. ధనాధన్ ఆడలేకపోయింది. ఇక ఛేదనలో హైదరాబాద్ అదరగొట్టింది. డెవిడ్ వార్నర్ (4), జానీ బెయిర్‌స్టో (10) నిష్క్రమించినా.. మనీశ్ పాండే (83 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), విజరు శంకర్ (52 నాటౌట్, 51 బంతుల్లో 6 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో 18.1 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోగా.. ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సరసన రాజస్థాన్ చేరింది.
ఛేదన అదిరింది : హైదరాబాద్ లక్ష్యం 155. జోఫ్రా ఆర్చర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (4), జానీ బెయిర్‌స్టో (10)లను అవుట్ చేశాడు. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్ సేవలను 16 పరుగులకే కోల్పోయిన హైదరాబాద్ ఛేదనలో ఇక కష్టమే అనిపించింది. కానీ తొలిసారి దేశవాళీ బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్ కు కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మనీశ్ పాండే (83 నాటౌట్), విజరు శంకర్ (52 నాటౌట్)లు మూడో వికెట్‌కు అజేయంగా 140 పరుగులు జోడించారు. మనీశ్ పాండే 8 సిక్సర్లతో వీర వీహారం చేయగా.. జోరు మీదున్న మనీశ్ పాండేకు విజయ్ శంకర్ మరో ఎండ్ నుంచి చక్కటి సహకారం అందించాడు.
జేసన్ మెరిసెన్! : గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన విండీస్ పేసర్ జేసన్ హౌల్డర్ (3/33)తో నిప్పులు చెరిగాడు. మూడు బౌండరీలతో ప్రమాదకరంగా మారిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19)ను తెలివిగా రనౌట్ చేసిన హోల్డర్ .. విధ్వంసకారుడు సంజు శాంసన్ (36)ను స్లో డెలివరీతో బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ (19), రియాన్ పరాగ్ (20)లు సైతం హోల్డర్ బంతికే వికెట్ కోల్పోయారు. ఉతప్ప నిష్క్రమణతో బెన్ స్టోక్స్‌తో కలిసి సంజు శాంసన్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. వేగంగా పరుగులు రాకపోయినా.. ఆఖర్లో విధ్వంసానికి పునాది వేశారు. కానీ వరుసగా వికెట్లు కూల్చిన సన్‌రైజర్స్ బౌలర్లు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆఖర్లో రాహుల్ జోఫ్రా ఆర్చర్ (16 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు రాజస్థాన్‌కు 154 పరుగుల స్కోరు అందించింది. డెత్ ఓవర్లలో నటరాజన్ భారీగా పరుగులు ఇచ్చి.. హైదరాబాద్ లక్ష్యాన్ని కనీసం 10 పరుగులు పెంచాడు!. విజయ్ శంకర్ (1/15) ఆకట్టుకోగా.. రషీద్ ఖాన్ (1/20) రాణించాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ ఇన్నింగ్స్ : 154/6 ( సంజు శాంసన్ 36, బెన్ స్టోక్స్ 30, జేసన్ హౌల్డర్ 3/33, విజరు శంకర్ 1/15)
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 156/2 ( మనీశ్ పాండే 83 నాటౌట్, విజయ్ శంకర్ 52 నాటౌట్, జోఫ్రా ఆర్చర్ 2/21)