Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో భారత్ కు తప్పని ఓటమి
- విరాట్ కోహ్లి, రాహుల్ పోరాటం వృథా
- మళ్లీ శతకం బాదిన స్టీవ్ స్మిత్
- రాణించిన వార్నర్, ఫించ్, లబుషేన్, మాక్స్వెల్
- 2-0తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
సిడ్నీలో మరోమ్యాచ్ ఓడారు. కానీ ఈ పరాజయం సిరీస్‌లో వెనుకంజలో నిలిచేలా చేసింది కాదు, ఏకంగా సిరీస్‌నే కోల్పోయేలా చేసింది. భారీ స్కోర్ల ఛేదనలో కోహ్లిసేనకు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. 390 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు విరాట్ కోహ్లి (89), కెఎల్ రాహుల్ (76) పోరాటం సరిపోలేదు. స్టీవ్ స్మిత్ (104) మళ్లీ శతకంతో చెలరేగగా.. డెవిడ్ వార్నర్ (83), అరోన్ ఫించ్ (60), లబుషేన్ (70), మాక్స్వెల్ (63) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. వరుసగా రెండో విజయంతో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే బుధవారం కాన్బెర్రాలో జరుగనుంది.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
సిరీస్ ఆశలు ఆవిరి. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో తొలిసారి అభిమానుల నడుమ జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆశలు కోల్పోయింది. తొలి వన్డేను 66 పరుగులతో నెగ్గిన ఆసీస్, రెండో వన్డేను 51 పరుగుల విజయంతో సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. స్టీవ్ స్మిత్ (104, 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. డెవిడ్ వార్నర్ (83, 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అరోన్ ఫించ్ (60, 69 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్), మార్నస్ లబుషేన్ (70, 61 బంతుల్లో 5 ఫోర్లు), గ్లెన్ మాక్స్వెల్ (63, 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించగా తొలుత ఆస్ట్రేలియా 389/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లి (89, 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (76, 66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో పోరాడినా ఫలితం దక్కలేదు. భారత్ 338/9 పరుగులే చేసింది. మెరుపు సెంచరీతో కదం తొక్కిన స్టీవ్ స్మిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందు కున్నాడు.
ఎదురులేని ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంతా ఓ స్వప్నంలా సాగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచీ ఆఖరు బంతి వరకు ఆ జట్టు ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్ స్వర్గధామం సిడ్నీ పిచ్‌పై కంగారూ బ్యాట్స్‌మెన్ పరుగుల పండుగ చేసుకున్నారు. ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (83, 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అరోన్ ఫించ్ (60, 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 142 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 22.5 ఓవర్ల పాటు భారత్‌కు వికెట్ నిరాకరించిన ఆసీస్ ఓపెనర్లు.. మిడిల్ ఆర్డర్‌కు గట్టి పునాది ఏర్పాటు చేశారు. ఐపీఎల్లో పేలవ ఫామ్ చూపిన స్టీవ్ స్మిత్ సిడ్నీలో ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. తొలి వన్డేలో 62 బంతుల్లో శతకబాదిన స్మిత్.. రెండో వన్డేలో 61 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 14 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన స్మిత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైన మార్నస్ లబుషేన్ (70), గ్లెన్ మాక్స్వెల్ (63 నాటౌట్, 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) డెత్ ఓవర్లలో చిచ్చరపిడుగులా ఆడాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌లో వరుసగా ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్‌లు నమోదు చేయటంతో తొలుత ఆ జట్టు 389 పరుగుల భారీ స్కోరు చేసింది.
విరాట్ మెరిసినా..
సిడ్నీలో ఆడిన గత ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన చేశాడు. అక్కడ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 21 పరుగులే అత్యధిక స్కోరు. 390 పరుగుల భారీ ఛేదనలో విరాట్ కోహ్లి (89, 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (28), శిఖర్ ధావన్ (30)లు తొలి వికెట్‌కు ధనాధన్ ఆరంభం అందించారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు జోడించింది. హజిల్‌వుడ్ ఓవర్లో ధావన్, కమిన్స్‌కు అగర్వాల్‌లు వికెట్లు కోల్పోయి వెన్వెంటనే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ (38, 36 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి విరాట్ కోహ్లి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయ్యర్ నిష్క్రమణ తర్వాత విరాట్‌కు కెఎల్ రాహుల్ (76, 66 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. విరాట్, రాహుల్ క్రీజులో ఉండగా భారత్ గెలుపు దిశగా పయనించింది. హార్దిక పాండ్య రావాల్సి ఉండటంతో ఆఖరు పది ఓవర్లలో వంద పరుగులు చేయటం సాధ్యమే అనిపించింది. కానీ విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌ల నిష్క్రమణతో కథ మారిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు మానసికంగా పైచేయి సాధించారు. హార్దిక్ పాండ్య (28) వేగంగా పరుగులు చేయలేకపోయాడు. రవీంద్ర జడేజా (24, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులకు చాలా ఆలస్యం అయిపోయింది. నిర్ణీత ఓవర్లలో 338 పరుగులు చేసిన భారత్.. 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు పాట్ కమిన్స్ (3/67), హజిల్‌వుడ్ (2/59)లు వికెట్లతో రాణించారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (రనౌట్) 83, అరోన్ ఫించ్ (సి) విరాట్ కోహ్లి (బి) మహ్మద్ షమి 60, స్టీవ్ స్మిత్ (సి) మహ్మద్ షమి (బి) హార్దిక్ పాండ్య 104, మార్నస్ లబుషేన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) జశ్‌ప్రీత్ బుమ్రా 70, గ్లెన్ మాక్స్వెల్ నాటౌట్ 63, మోయిసిస్ హెండ్రిక్స్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (50 ఓవర్లలో 4 వికెట్లకు) 389.
వికెట్ల పతనం : 1-142, 2-156, 3-292, 4-372.
వికెట్ల పతనం: 9-0-73-1, జశ్‌ప్రీత్ బుమ్రా 10-1-79-1, నవదీప్ సైని 7-0-70-0, యుజ్వెంద్ర చాహల్ 9-0-71-0, రవీంద్ర జడేజా 10-0-60-0, మయాంక్ అగర్వాల్ 1-0-10-0, హర్దిక్ పాండ్య 4-0-24-1.
భారత్ ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ (సి) అలెక్స్ కేరీ (బి) పాట్ కమిన్స్ 28, శిఖర్ ధావన్ (సి) మిచెల్ స్టార్క్ (బి) జోశ్ హజిల్‌వుడ్ 30, విరాట్ కోహ్లి (సి) హెండ్రిక్స్ (బి) హజిల్‌వుడ్ 89, శ్రేయాస్ అయ్యర్ (సి) స్మిత్ (బి) హెండ్రిక్స్ 38, కెఎల్ రాహుల్ (సి) హజిల్‌వుడ్ (బి) జంపా 76, హార్దిక్ పాండ్య (సి) స్మిత్ (బి) కమిన్స్ 28, రవీంద్ర జడేజా (సి)మాక్స్వెల్ (బి) కమిన్స్ 24, నవదీప్ సైని నాటౌట్ 10, మహ్మద్ షమి (సి,బి) మాక్స్వెల్ 1, జశ్‌ప్రీత్ బుమ్రా (ఎల్బీ) జంపా 0, యుజ్వెంద్ర చాహల్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 338.
వికెట్ల పతనం : 1-58, 2-60, 3-153, 4-225, 5-288, 6-321, 7-321, 8-326.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 9-0-82-0, జోశ్ హజిల్‌వుడ్ 9-0-59-2, పాట్ కమిన్స్ 10-0-67-3, ఆడం జంపా 10-0-62-2, మోయిసిస్ హెండ్రిక్స్ 7-0-34-1, గ్లెన్ మాక్స్వెల్ 5-0-34-1.
మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాం. బంతితో మేము ప్రభావంతంగా లేము. అనుకున్న ఏరియాలో నిలకడగా బంతిని వేయలేకపోయాం. ఆసీస్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది, వారికి యాంగిల్స్ తెలుసు.ఛేదించాల్సిన లక్ష్యం సైతం భారీగా ఉంది. మేము 340 పరుగులు చేసినా.. ఇంకా 51 పరుగుల వెనుకంజలోనే ఉన్నాం. వారు బంతులు వేసిన తీరుతో, అవకాశాలను సృష్టించుకున్నారు. నేను కోరటంతో హార్దిక్ పాండ్య ఈ పిచ్‌పై బౌలింగ్ చేశాడు. రాహుల్, నేను చివరి పది ఓవర్లలో వంద పరుగులు చేయగలమని అనుకున్నాం. నేను, రాహుల్ 40వ ఓవర్ వరకు క్రీజులో ఉంటే, ఆసీస్‌ను ఒత్తిడిలో పడేసేవాళ్లం. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ అద్భుతంగా ఉంది.
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్.