Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత క్రికెట్‌పై రామచంద్ర గుహ
బెంగళూర్ : భారత క్రికెట్లో సంస్కరణల పర్వం సంపూర్ణ వైఫల్యమని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. బారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సమూల సంస్కరణలకు సంకల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2016లో సంచనల తీర్పు వెలువరించింది. 2018లో ఆ సంచలన తీర్పుకు పెను మార్పులు చేస్తూ మరో ఆదేశం జారీ చేసింది. పాలకుల కమిటీ (సీఓఏ) నుంచి బీసీసీఐ అధికార పగ్గాలు స్వీకరించిన భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. బోర్డు అధ్యక్షుడిగా తన వార్షిక సర్వ సభ్య సమావేశంలోనే సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించాడు. త్వరలోనే సుప్రీంకోర్టులో బీసీసీఐకి అనుకూలంగా తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్ర గుహ ఆసక్తికరంగా మారాయి. క్రికెట్‌పై తన నాలుగో పుస్తకం ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ విడుదల సందర్భంగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ' భారత క్రికెట్లో సంస్కరణల పర్వం సంపూర్ణ వైఫల్యం. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో విరుద్ధ ప్రయోజనాలు వ్యాప్తి చెందాయి. ఎవరిలోనూ నైతికంగా ఈ అంశంపై ఆలోచన లేదు. అందరూ అందరం చేస్తున్నం కదా అనే ధోరణిలోనే ఉంటున్నారు. బిషన్ సింగ్ బేడీ కాలంలో క్రికెటర్లకు స్వేచ్ఛ లేదు. బోర్డు నుంచి ఆర్థిక ఫలాలూ లేవు. కానీ ఇప్పటి క్రికెటర్లు అలా కాదు. అసామాన్య అభిమాన ఆదరణ, బోలెడంత డబ్బు, విపరీతమైన స్వేచ్ఛ ఉంది. 2019 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత, కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇష్టం లేదని కోచ్ అనిల్ కుంబ్లేను తప్పించారు. చీఫ్ కోచ్‌ను వీటో చేసే అధికారం ప్రపంచ క్రీడల్లో అంతకుముందు ఎక్కడా ఉన్నట్టు నాకు తెలియదు. ఇక ఎం.ఎస్ ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. అతడి కాంట్రాక్టును ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌కు మార్చాలని సూచించాను. కానీ పాలకుల కమిటీ అందుకు భయపడింది. ధోని వార్షిక కాంట్రాక్టు గ్రేడ్‌ను కుదించే సాహాసం చేయలేకపోయింది. ఐపీఎల్లో కాంట్రాక్టుల విషయంలోనూ వ్యక్తులను బట్టి నిబంధనలు మారాయి. బీసీసీఐ మేనేజ్మెంట్ వ్యవస్థీకృతంగా పని చేయాలని కోరుకున్నాను. పాలకుల కమిటీలో ఉండగా, దాని గురించే గళం విప్పాను. ఇప్పుడు క్రికెట్ అభిమానిగా అటువంటి అంశాలను పట్టించుకోవటం లేదు. ఆటను మాత్రమే ఆస్వాదిస్తున్నాను. సంస్కరణలను మార్చటం లాంఛనమే కావటంతో.. బంధుప్రీతి, అవినీతి, విరుద్ధ ప్రయోజనాలతో కూడిన బీసీసీఐ వ్యవస్థను క్రికెట్ అభిమనులు భరించాల్సిందే' అని గుహ అన్నారు.