Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందని ద్రాక్షగానే ఐపీఎల్ టైటిల్
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 సీజన్లను ముగించుకున్నా, టైటిల్‌కు దూరంగానే ఉండిపోయిన జట్లలో ఒకటి పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్). ప్రతి సీజన్‌కు జట్టు నాయకత్వంలో మార్పులు చేసే పంజాబ్ కింగ్స్ తొలిసారి వరుసగా రెండో సీజన్‌కు మార్పులు లేకుండా అడుగుపెడుతోంది. క్రికెట్ జెంటిల్మెన్ అనిల్ కుంబ్లే చీఫ్ కోచ్‌గా, కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ మరోసారి టైటిల్ వేటకు బయల్దేరనుంది. మరి ఈసారైనా పంజాబ్‌కు ఐపీఎల్ టైటిల్ దక్కుతుందా?!
నాలుగు నెలల విరామంలో ఐపీఎల్ పండుగ మళ్లీ వచ్చేసింది. కరోనా మహమ్మారి కారణంగా గత సీజన్ ఆలస్యంగా జరిగింది. నవంబర్ 10న ఐపీఎల్ 13 హంగామా ముగియగా.. తాజాగా ఏప్రిల్ 9న ఐపీఎల్ 14 పండుగకు రంగం సిద్ధమైంది. గత సీజన్లో యుఏఈలో జరిగిన ఐపీఎల్.. ఈ ఏడాది తిరిగి భారత్‌కు వచ్చేసింది. కరోనా వైరస్ రెండో దశ భయాందోళనలతో ఐపీఎల్ భారత్‌లో జరుగుతున్నా.. అభిమానులకు ప్రవేశం కల్పించటం లేదు. ఆరు ఆతిథ్య నగరాల్లో ఎనిమిది జట్లు పోటీపడుతున్న ధనాధన్ లీగ్‌లో టైటిల్ రేసులో జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశను దాటింది రెండు సీజన్లలోనే. 2014లో ఫైనల్స్‌కు చేరిన పంజాబ్, 2008లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ రెండు సీజన్లను మినహాయిస్తే పంజాబ్ కింగ్స్ ఎన్నడూ లీగ్ దశను దాటలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు పేరు మార్పు చేసుకుంది. మరి టైటిల్ వేటలోనూ పంజాబ్ కింగ్స్ కథ మారుతుందా? ఆసక్తిరేపుతోంది. గత సీజన్లో ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసిన పంజాబ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంపైరింగ్ తప్పిదాలు సైతం పంజాబ్‌ను దెబ్బకొట్టాయి. గత సీజన్లో ద్వితీయార్థంలో చూపిన జోరు.. ఈ సీజన్లో ఆరంభం నుంచే మొదలెట్టేందుకు రాహుల్, కుంబ్లే గ్యాంగ్ సిద్ధమవుతోంది.
జట్టు ఎలా ఉంది? : 2021 సీజన్‌కు పంజాబ్ కింగ్స్ మరింత బలంగా సన్నద్ధమైంది. ఈ ఏడాది ఆటగాళ్ల వేలంలో విలువైన విదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. టీ20ల్లో వరల్డ్ నం.1 బ్యాట్స్‌మన్ డెవిడ్ మలాన్‌ను, బౌలింగ్ విభాగంలో జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్లను జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ లైనప్‌లో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ గత సీజన్లో మెరుపులు మెరిపించారు. గత సీజన్ ప్రదర్శనను పునరావృతం చేసేందుకు ఈ కన్నడ జోడీ ఎదురుచూస్తోంది. ఓపెనర్లు అంచనాల మేరకు రాణిస్తే.. మిడిల్ ఆర్డర్లో క్రిస్ గేల్, నికోలస్ పూరన్, డెవిడ్ మలాన్ వంటి ప్రమాదకర హిట్టర్లు రాకెట్ స్పీడ్‌తో పరుగులు పిండుకోగలరు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌ది భయంకర బ్యాటింగ్ లైనప్గా నిలువనుంది!. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, క్రిస్ జోర్డాన్లు కీలక తరుణంలో జట్టును ఆదుకోలేదు. మహ్మద్ షమికి జోడీగా ఈసారి జై రిచర్డ్సన్, రిలే మెరెడిత్లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. కోర్ గ్రూపు ఆటగాళ్లపై విశ్వాసం ఉంచిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్.. ఈ సీజన్లో కచ్చితంగా భిన్నమైన ఫలితం ఆశిస్తోంది.
ఎక్స్ ఫ్యాక్టర్! : పంజాబ్ కింగ్స్‌లో ఎన్నడూ స్టార్స్‌కు లోటు లేదు. గత సీజన్లోనూ ఆ జట్టుకు రాహుల్, అగర్వాల్ మెరుపు ఆరంభాలను అందించారు. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో కీలక ఆటగాళ్లు చేతులెత్తేయటంతో సులువుగా నెగ్గాల్సిన మ్యాచుల్లో పంజాబ్ చతికిల పడింది. మిడిల్ ఆర్డర్ ఆశలు రేపుతున్నా.. పంజాబ్ కింగ్స్ సమిష్టిగా రాణించిన దాఖలాలు తక్కువ. గత అనుభవాల దృష్ట్యా పంజాబ్ కింగ్స్ ఈసారి సమిష్టి ప్రదర్శనలపై దృష్టి పెడితే అంతిమ ఫలితంలో అది ఎక్స్ ఫ్యాక్టర్ కాగలదు.
పంజాబ్ కింగ్స్ జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, దర్షన్ నల్కాండే, దీపక్ హుడా, ఇషాన్ పోరెల్, రవి బిష్ణోరు, ప్రభుసిమ్రన్ సింగ్, షారుక్ ఖాన్, జలజ్ సక్సేనా, ఉత్కర్ష్ సింగ్, సౌరభ్ కుమార్.
విదేశీయులు : క్రిస్ గేల్, నికోలస్ పూరన్, క్రిస్ జోర్డాన్, డెవిడ్ మలాన్, జై రిచర్డ్సన్, రిలే మెరెడిత్, మోయిస్ హెన్రిక్స్, ఫబియన్ అలెన్.
ఉత్తమ ప్రదర్శన : 2014 రన్నరప్, 2008 సెమీఫైనల్స్.