Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టైటిల్ వేటలో ఢిల్లీ క్యాపిటల్స్
- యువ కెప్టెన్‌పై అభిమానుల ఆశలు
- అత్యుత్తమ ప్రదర్శన 2020 రన్నరప్
ఐపీఎల్ రెగ్యులర్ జట్లలో టైటిల్ పోరుకు చేరుకోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్!. అయితే, ఇది 2020 సీజన్ ఆరంభానికి ముందు మాట. ఎప్పుడూ తుది జట్టులో, నాయకత్వంలో అస్థిరతతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. యువ నాయకుడు శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన డీసీ మేనేజ్మెంట్ గత సీజన్లో టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. అయ్యర్ గాయంతో దూరం కాగా.. ఈ సీజన్లో విధ్వంసకారుడు రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ అందించిన డిసీ, ఇప్పుడు ఆ టైటిల్ కోరికనూ తీర్చుకుంటుందా? ఐపీఎల్ ట్రోఫీకి తొలి ముద్దు పెడతారా? ఆసక్తికరం.
నవతెలంగాణ క్రీడావిభాగం
జట్టు ఎలా ఉంది?
తొలి సీజన్ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ.. మళ్లీ ఎప్పుడూ ఆ స్థానంలో నిలువలేదు. కానీ గత సీజన్లో అంతకుమించిన ఘనతే సాధించింది. లీగ్ దశలో టాప్-2లో నిలిచింది. తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఘనత యువ కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్‌కు దక్కుతుంది. గొప్ప సీజన్ అనంతరం అయ్యర్‌ను కోల్పోవటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద దెబ్బ. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో అయ్యర్ భుజం గాయంతో ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. శ్రేయాష్ అయ్యర్ లేకపోవటంతో డిసీ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారే ప్రమాదం ఉంది. ఆటగాళ్ల వేలంలో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఎంచుకోవటం డిసీకి ఇప్పుడు కలిసి రానుంది. శ్రేయాష్ అయ్యర్ ఉంటే.. అజింక్య రహానె, స్టీవ్ స్మిత్‌లు ఒకే తుది జట్టులో నిలిచేవారు కాదు. ఇప్పుడు ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. పేస్ విభాగంలో కగిసో రబాడ, స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌ను బలోపేతం చేస్తున్నారు.
బలం, బలహీనత
అయ్యర్ దూరమవటం మినహా డీసీ ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. గత సీజన్లో నిరాశపరిచిన రిషబ్ పంత్ గత నాలుగు నెలలుగా అసమాన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పంత్ ప్రదర్శన ఉంటోంది. బరిలోకి దిగిన ప్రతిసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. మ్యాచులను సింగిల్ ఇన్నింగ్స్‌తో మార్చేస్తున్నాడు. ఈ సీజన్లో డీసీ బలం రిషబ్ పంతే. 22 ఏండ్ల పంత్ ఈసారి కెప్టెన్సీ సైతం వహించనున్నాడు. యువ ఓపెనర్ పథ్వీ షా విజరు హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. 800 పైచిలుకు పరుగులతో కదం తొక్కాడు. శిఖర్ ధావన్ తోడుగా షా మెరుపులు అభిమానులను ఊరించనున్నాయి. గత సీజన్ డీసీ హీరో మార్కస్ స్టోయినిస్ ఇప్పుడూ కీలకమే.
క్రికెట్ మైదానంలో భయమెరుగని క్రికెటర్ రిషబ్ పంత్. అటువంటి పంత్‌కు డీసీ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్ తీరుపై కెప్టెన్సీ బాధ్యత సానుకూల ప్రభావం చూపుతుందా? ప్రతికూల ప్రభావం చూపుతుందా? అనేది అందరిని తొలిచివేస్తోన్న ప్రశ్న. అజింక్య రహానె, స్టీవ్ స్మిత్ రూపంలో ఇద్దరు సంప్రదాయ క్రికెటర్లు బ్యాటింగ్ లైనప్‌లో ఉండటం ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ల లక్ష్యాలను గండికొట్టే ప్రమాదం లేకపోలేదు. కగిసో రబాడకు తోడు నాణ్యమైన స్వదేశీ టీ20 పేసర్ కరువయ్యాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లకు ఐపీఎల్లో మంచి రికార్డు లేదు. స్పిన్ విభాగంలో తిరుగులేకపోయినా.. పేస్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇబ్బందిపడే అవకాశం లేకపోలేదు.
ఎక్స్ ఫ్యాక్టర్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్లో అన్నీ రిషబ్ పంతే!. ఇది కాస్త అతిశయోక్తి అనిపించినా.. అదే వాస్తవం. 100 టెస్టులు ఆడిన క్రికెటర్ సాధించిన ఘనతలకు మించి పంత్ అప్పుడే సాధించేశాడు. అందుకే ఈ సీజన్లో రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా, వ్యూహరచనలో రాటుదేలిన కెప్టెన్‌గా, వికెట్ల వెనకాల చురుకైన కీపర్‌గా త్రిపాత్రాభినయం చేయనున్నాడు. రిషబ్ పంత్ ప్రదర్శన ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరం భావోద్వేగాలను సశించనుంది. రబాడ, స్టోయినిస్, షా, ధావన్, స్మిత్ రూపంలో కీలక ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఎక్స్ ఫ్యాక్టర్ రిషబ్ పంతే.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (స్వదేశీయులు)
రిషబ్ పంత్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, శిఖర్ ధావన్, ప్రవీణ్ దూబె, లుక్మాన్ మరివాలా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, పథ్వీ షా, మణిమరన్ సిద్దార్థ్, విష్ణు వినోద్, లలిత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ (గాయంతో దూరం).
విదేశీయులు
శామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, షిమ్రోన్ హెట్మయర్, కగిసో రబాడ, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్.