Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్‌కు దూరం
- ఆశావహ ఫలితం ఆశిస్తోన్న కోల్‌కత నైట్‌రైడర్స్
- అత్యుత్తమ ప్రదర్శన 2012, 2014 చాంపియన్
రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్. అయితేనేం, వరుసగా గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. గత సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు ఫలిస్తుందని ఆశించినా.. అదీ జరుగలేదు. అరివీర భయంకరుడు అండ్రీ రసెల్ ఫామ్ కోసం ఇబ్బంది పడుతుండగా.. కోల్‌కత నైట్‌రైడర్స్ తంటాలు కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో నైట్‌రైడర్స్ భిన్నమైన ఫలితం ఆశిస్తోంది. ఇంగ్లాండ్‌కు వరల్డ్‌కప్‌కు అందించిన నాయకుడు ఇయాన్ మోర్గాన్.. మరి కోల్‌కత నైట్‌రైడర్స్‌కు మూడో ఐపీఎల్ ట్రోఫీ ముచ్చట తీరుస్తాడా?!
నవతెలంగాణ క్రీడావిభాగం
జట్టు ఎలా ఉంది?
సునీల్ నరైన్, అండ్రీ రసెల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకునేందుకు ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలోకి వెళ్లిన కోల్‌కత నైట్‌రైడర్స్.. షకిబ్ అల్ హసన్, బెన్ కట్టింగ్లను జట్టులోకి తీసుకుంది. కోల్‌కత రెండు ఐపీఎల్ ట్రోఫీ విజయాల్లో షకిబ్ అల్ హసన్ కీలకం. మరోసారి షకిబ్ అల్ హసన్‌ను తీసుకొచ్చిన నైట్‌రైడర్స్ ట్రోఫీ అందుకోవటంలోనూ మార్పు ఆశిస్తోంది. ఆటగాళ్ల వేలం తర్వాత అన్ని విభాగాల్లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టు ఆకట్టుకునేలా ఉంది. కాగితంపై కోల్‌కత బలంగా కనిపిస్తున్నా.. మైదానంలో ఆ జట్టు వైఫల్యాలు చవిచూస్తూనే ఉన్నాయి. తొలిసారి ఐపీఎల్ సీజన్‌ను కెప్టెన్‌గా ఆరంభించనున్న ఇయాన్ మోర్గాన్ ముందు కీలక సవాళ్లు నిలిచాయి. టాప్ ఆర్డర్లో శుభ్‌మన్ గిల్‌కు సరైన భాగస్వామిని అన్వేషించటం మోర్గాన్ తొలి ప్రాధాన్యత. పించ్ హిట్టర్ సునీల్ నరైన్ లేదా మరొకరిని ఎప్పటికప్పుడు ప్రయోగిస్తూ ఉండటం ఎంతమాత్రం ఫలితాలు ఇవ్వదనే విషయం కోల్‌కత గ్రహించటం మేలు.
బలం, బలహీనతలు
శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, నితీశ్ రానా, కరుణ్ నాయర్లు కోల్‌కత బ్యాటింగ్‌కు కీలకం. ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, అండ్రీ రసెల్‌లు ఉండనే ఉన్నారు. ఈ ఏడాది తొలి మూడు మ్యాచులను చెన్నైలో ఆడనున్న కోల్‌కతకు బలమైన స్పిన్ విభాగం ఉంది. కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలకు తోడు టర్బోనేటర్ హర్బజన్ సింగ్ జట్టులోకి వచ్చాడు. స్పిన్‌కు సహకరించే వాంఖడే, అహ్మదాబాద్‌లోనూ గరిష్ట మ్యాచులు ఆడనుండటం కోల్‌కతకు కలిసొచ్చే అంశం. కరుణ్ నాయర్, రాహుల్ త్రిపాఠి సేవలను తెలివిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.
వండర్ఫుల్ క్రికెటర్లు మ్యాచులను వండర్‌ఫుల్‌గా సాధించగలరు. కానీ ట్రోఫీలు సాధించేందుకు ఒక్క వండర్ క్రికెటర్ సరిపోడు. ఈ విషయాన్ని కోల్‌కత వేగంగా గ్రహించాలి. విండీస్ వీరులు అండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లపై కోల్‌కత గత సీజన్లలో అతిగా ఆధారపడింది. ఫలితంగా గత రెండు సీజన్లుగా కోల్‌కత ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఐపీఎల్ 2020లో నరైన్, రసెల్‌లు దారుణంగా నిరాశపరిచారు. ఈ సీజన్లో ఈ ఇద్దరు రాణించకపోతే.. షకిబ్ అల్ హసన్, బెన్ కట్టింగ్ రూపంలో ఇద్దరు బ్యాకప్ వనరులు ఉండటం మంచిదే. అయితే, ఈ ఇద్దరిని బెంచ్‌కు పరిమితం చేసే సంచలన నిర్ణయం మోర్గాన్ తీసుకోగలడా?!
ఎక్స్ ఫ్యాక్టర్
ప్రతిభావంతులైన యువ స్వదేశీ క్రికెటర్లు ఈ సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నారు. బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, బౌలింగ్ విభాగంలో కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ కృష్ణ ప్రదర్శనలు కోల్‌కత గతిని మార్చనున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు క్రికెటర్లు ఈ సీజన్లో కోల్‌కతను నడిపించనున్నారు!.
కోల్‌కత జట్టు (స్వదేశీయులు)
దినేశ్ కార్తీక్, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, కుల్దీప్ యాదవ్, శివం మావి, కమలేశ్ నాగర్కోటి, సందీప్ వారియర్, ప్రసిద్ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్, వైభవ్ అరోరా, హర్బజన్ సింగ్, కరుణ్ నాయర్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి.
విదేశీయులు
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్, అండ్రీ రసెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గుసన్, పాట్ కమిన్స్, షకిబ్ అల్ హసన్, బెన్ కట్టింగ్.