Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ క్రమబద్దీకరణకు మీనమేషాలు
- నిరసనగా శాట్స్ కోచ్‌ల మహాధర్నా
నవతెలంగాణ, హైదరాబాద్ : 'విభజించు, పాలించు' సూత్రాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) పుణికిపుచ్చుకుంది. క్రీడాకారులను తీర్చిదిద్దటంలో కీలకమైన కోచ్‌లను నియమించటంలో ఏండ్లుగా నిర్లక్షం వహిస్తున్న శాట్స్, రాష్ట్ర ప్రభుత్వం.. కాంట్రాక్టు కోచ్‌లు ఐక్యం కాకుండా ఉండేందుకు భిన్న విధానాలు అనుసరిస్తోంది. 1993, 1999 బ్యాచ్ కాంట్రాక్టు కోచ్‌లకు హైకోర్టు ఉత్తర్వులతో మూల వేతనం, ఇతర ప్రయోజనాలు కల్పించిన శాట్స్.. 2009లో తీసుకున్న కోచ్‌లకు ప్రయివేటు ఏజెన్సీ నుంచి వేతనాలు అందజేస్తోంది. పొరుగు సేవల ద్వారా 85 మంది కోచ్‌లు, పే అండ్ ప్లే ద్వారా 50 మంది కోచ్‌లు, డిఎస్ఏ నిధుల ద్వారా 23 మంది కోచ్‌లు, అకాడమీల ద్వారా నలుగురు కోచ్‌లు, స్పోర్ట్స్ స్కూల్ ద్వారా 8 మంది కోచ్‌లను శాట్స్ నియమించింది. ఒక్కో పద్దతిలో నియమితులైన కోచ్‌లకు ఒక్కో విధమైన సమస్యలు ఉండటంతో కాంట్రాక్టు కోచ్‌లు ఇంతకాలం ఉమ్మడిగా ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రయత్నం చేయలేదు. 28 ఏండ్లుగా శాట్స్ కోచ్‌లుగా సేవలందిస్తున్న వారికి సైతం ఉద్యోగ క్రమబద్దీకరణ రాకపోవటంతో శాట్స్లోని కోచ్‌లందరూ ఇప్పుడు ఏకమయ్యారు. కాంట్రాక్టు, పొరుగుసేవలు, ఇతర పద్దతుల్లో పనిచేస్తున్న శాట్స్ కోచ్‌లను అందరిని క్రమబద్దీకరించాలని మంగళవారం ఎల్బీస్టేడియంలో శాట్స్ చైర్మన్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. న్యాయపరమైన అవరోధాలు, క్రమబద్దీకరణ దస్త్రం ముసాయిదాలో లోపాలు, ఇతర కారణాలతో కాంట్రాక్టు కోచ్‌లను ఇన్నేండ్లు మభ్యపెట్టారు. ఇప్పుడైనా చిత్తశుద్దితో ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలని కాంట్రాక్టు కోచ్‌లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కోచ్‌ల ప్రతినిథులు, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిలు క్రీడా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజుతో క్రమబద్దీకరణ అంశంపై సమావేశమయ్యారు. ఏప్రిల్ 15 లోగా కాంట్రాక్టు కోచ్‌ల సమస్యలను పరిష్కరించాలని శాట్స్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.