Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు ఆరో టైటిల్ పై ముంబయి గురి
- రోహిత్‌సేనను అడ్డుకోవటం పెను సవాలే
- అత్యుత్తమ ప్రదర్శన 2013, 2015, 2017, 2019, 2020 చాంపియన్
'2021 ఐపీఎల్ ఫైనల్లో ముంబయి ఇండియన్స్ చేతిలో పరాజయం చవిచూడబోయే జట్టు ఏదీ?'... ఐపీఎల్ 14 ఆరంభానికి ముందు ఓ ఆన్లైన్ పోల్ ఇది. కాస్త అతిశయోక్తి అనిపిస్తున్నా.. వాస్తవిక పరిస్థితులో పోల్‌ను ప్రతిబింబించేలా కనిపిస్తున్నాయి. ఎనిమిదేండ్లలో ఏకంగా ఐదు టైటిళ్లు సాధించిన ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ టైటిళ్లు కొట్టిన జట్టుగా నిలిచేందుకు తహతహలాడుతోంది. హ్యాట్రిక్ టైటిళ్లు కొట్టేందుకు ముంబయి ఇండియన్స్‌కు కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. అండర్డాగ్లు అద్భుతాలు చేసే ఆధునిక క్రికెట్లో ముంబయి ఇండియన్స్‌కు ఎదురుందా?!
నవతెలంగాణ క్రీడావిభాగం
జట్టు ఎలా ఉంది?
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, తాజా సీజన్‌ను సైతం టైటిల్ ఫేవరేట్‌గా మొదలుపెట్టనుంది. టోర్నీ చరిత్రలో తొలి హ్యాట్రిక్ కొట్టగల సత్తా, సామర్థ్యం ఆ జట్టు సొంతం. గత సీజన్ లీగ్ దశలో 14 మ్యాచుల్లో ముంబయి 9 మ్యాచుల్లో విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్‌లో ఇక ఆ జట్టుకు ఎదురేలేదు. ఈ సీజన్లోనూ మిగతా ఏడు జట్లు ఓడించాలని స్వప్నిస్తున్న ముంబయి. ఆటగాళ్ల వేలంలో పియూశ్ చావ్లా, ఆడం మిల్నె, మార్కో జెన్సన్లను తీసుకున్న ముంబయి బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకుంది. రాహుల్ చాహర్, జయంత్ యాదవ్‌లు రాణించినా.. స్పిన్ విభాగంలో అనుభవం లేదనే విమర్శను ముంబయి ఈసారి సరి చేసుకుంది. పియూశ్ చావ్లా రాకతో స్పిన్ విభాగం బలోపేతమైంది. ఈ సీజన్లో ఐదు మ్యా చులు చెన్నైలోనే ఆడాల్సి రావటంతో పియూశ్ చావ్లా అనుభవం ముంబయికి ఉపయుక్తం కానుంది.
బలం, బలహీనతలు
ముంబయి ఇండియన్స్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు ఆటగాళ్లు ఇటీవల భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. బ్యాటింగ్ లైనప్‌లోని ఇద్దరు విదేశీ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, కీరన్ పొలార్డ్‌లు భయమెరుగని క్రికెట్‌కు చిరునామా. గత సీజన్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్‌లు నాలుగేసి అర్థ సెంచరీలు సాధించారు. ఇషాన్ కిషన్ ఏకంగా 30 సిక్సర్లు కొట్టాడు. క్రిస్ లిన్ అంతటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌కు గత సీజన్లో అవకాశం రాలేదు. ఆ స్థాయిలో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఏడుగురు బ్యాట్స్‌మెన్ భీకర ఫామ్‌లో ఉండటం ముంబయికి మరింత కలిసిరానుంది. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ పవర్‌ప్లేలో, జశ్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో కండ్లుచెదిరే ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సీజన్లో బౌల్ట్, బుమ్రా కాంబినేషన్ మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశాలు ఎక్కువ.
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, పేసర్లు, స్పిన్నర్లు.. ఇలా ఏ కోణంలో చూసినా ముం బయి ఇండియన్స్ అత్యంత పటిష్టంగా ఉంది. గత సీజన్లో గాయాల కారణంగానే తుది జట్టులో మార్పులు జరిగాయి. కీలక ఆటగాళ్లలో ఇద్దరు, ముగ్గురు ఏకకాలంలో గాయపడితే తుది జట్టులోకి వచ్చేందుకు నాణ్యమైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ముంబయికి లేరు. తొలి ప్రాధాన్య తుది జట్టు అద్భుతంగా కనిపిస్తున్నా..రిజర్వ్ బలం ఆశించిన స్థాయిలో లేదు. ముంబయి ఇండియన్స్‌కు ఇది అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. గాయాల బెడద ఉత్పన్నమైతేనే ముంబయి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఎక్స్ ఫ్యాక్టర్
పేస్ జోడీ జశ్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నారు. భారీ స్కోర్లు నమోదయ్యే ధనాధన్ లీగ్‌లో పరుగుల కట్టడితో పాటు వికెట్లు కూల్చ టంలో బుమ్రా, బౌల్ట్ సిద్దహస్తులు. పవర్‌ప్లేలో బౌల్ట్, డెత్ ఓవర్లలో బుమ్రా అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో ముంబయి బ్యాటింగ్ లైనప్‌కు చెక్ పెట్టింది. అదే ఫార్ములా ఇతర జట్లు పాటిస్తే.. అప్పుడు ఈ జోడీ ఫలితాన్ని శాసించనుంది.
ముంబయి జట్టు (స్వదేశీయులు)
రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్ప్రీత్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, పియూశ్ చావ్లా, ఇషాన్ కిషన్, ధవల్ కులకర్ణి, మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, అనుకూల్ రారు, ఆదిత్య తారె, అర్జున్ టెండూల్కర్, సౌరభ్ తివారి, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యుధ్వీర్ సింగ్.
విదేశీయులు
ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్‌నైల్, క్వింటన్ డికాక్, మార్కో జెన్సన్, ఆడం మిల్నె, జేమ్స్ నీషమ్, కీరన్ పొలార్డ్, క్రిస్ లిన్.