Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు కోచ్‌లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ, హైదరాబాద్ : ఆన్లైన్ యుగంలో ఆఫ్‌లైన్ ధర్నాలు, నిరసనలకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వటం లేదనే విషయం ఇటీవల పలు అంశాల్లో నిరూపణ అయ్యింది. ఉద్యోగ క్రమబద్దీకరణ కోసం స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) కాంట్రాక్టు కోచ్‌లు ఇటీవల ధర్నా చేసిన సంగతి తెలిసిందే. 120 మంది కోచ్‌లు ఎల్బీ స్టేడియంలో భారీ ధర్నా చేసినా స్పందించని క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియాకు స్పందించాడు. ' అథ్లెట్లు, కోచ్‌ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు కోచ్‌లు అందరినీ త్వరలోనే క్రమబద్దీకరిస్తాం' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు. ' మంచి కోచ్‌లు లేకుంటే మంచి అథ్లెట్స్ ఉండరు. స్థానిక కోచ్‌లు ఉద్యోగ క్రమబద్దీకరణకు ధర్నా చేయటం చూస్తే గుండె తరుక్కుపోతుంది. మన అవసరం కోచ్‌లకు ఎంత ఉందో, కోచ్‌ల అవసరం మనకూ అంతే ఉంది. క్రీడా మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ఎంతో చేశారు. కోచ్‌ల సమస్యలను సైతం పరిష్కరించండి' అంటూ బ్యాడ్మింటన్ దిగ్గజం గుత్తా జ్వాల చేసిన ట్వీట్‌కు మంత్రి బదులిచ్చారు. ట్విట్టర్ వేదికగా ఉద్యోగ క్రమబద్దీకరణకు మంత్రి హామీ ఇవ్వటంపై కాంట్రాక్టు కోచ్‌లు హర్షం వ్యక్తం చేశారు.