Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి 52 రోజుల క్రికెట్ పండుగ
- టీ20 ప్రపంచకప్ సన్నాహాకంగా ధనాధన్ లీగ్
- తొలి మ్యాచ్‌లో ముంబయి, బెంగళూర్ ఢ
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండగా, టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హంగామా వచ్చేసింది. అత్యధిక కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను మూడోస్థానికి నెట్టేందుకు భారత్ సమీపిస్తుంది. ఈ సమయంలో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించటం సురక్షితమేనా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బయో బబుల్ రూపంలో భారత్‌కు తిరిగొచ్చిన ఐపీఎల్ 14 సీజన్ 2021 టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలదా?!
ఐపీఎల్ బబుల్ సురక్షితం కాదనే విషయం ఇప్పటికే తేలిపోయింది. లక్షణాలు లేని కోవిడ్ కేసులు బబుల్‌లో నమోదవుతున్నాయి. ఖాళీ స్టేడియాల్లో జరిగిన ఐపీఎల్ 13ను 8 కోట్ల మంది వీక్షించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 10 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. బబుల్‌పై అనుమానాలు, కోవిడ్ భయం పక్కనపెడితే 8 జట్లు పోటీపడే 52 రోజుల మెగా ఈవెంట్‌కు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. నేడు చెన్నై చెపాక్‌లో బెంగళూర్, ముంబయి ఢతోీ ఐపీఎల్ 14 టైటిల్ రేసు షురూ కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
టీ20 ప్రపంచకప్ లక్ష్యం?
భారత క్రికెటర్లకు సంబంధించి సెలక్షన్ కమిటీ దృష్టిలో పడేందుకు ఐపీఎల్ ఓ చక్కటి వేదిక. 2021 టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరుగనుండటంతో బీసీసీఐ సహా ఇతర క్రికెట్ బోర్డులు ఐపీఎల్ ప్రదర్శనలపై ఓ దృష్టి పెట్టనున్నారు. ఐపీఎల్ ప్రాంఛైజీల వరకు టీ20 ప్రపంచకప్ ఓ చిక్కు సమస్య మిగల్చనుంది. ప్రపంచకప్‌కు ఫిట్‌గా సిద్ధం కావాలనుకునే క్రికెటర్లు ఐపీఎల్లో తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఐపీఎల్లో పని భారం సైతం క్రికెటర్లు లెక్కలోకి తీసుకోనున్నారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన డెవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సహా ఇతర క్రికెటర్లు ఈ సీజన్లో పని భారంపై దృష్టి పెట్టనున్నారు. నయా స్టార్స్‌ను అందించటంలో ఐపీఎల్ ఎప్పుడూ ముందుంటుంది. గత సీజన్లో టి నటరాజన్ (సన్‌రైజర్స్), వరుణ్ చక్రవర్తి (నైట్‌రైడర్స్), రాహుల్ తెవాటియ (రాయల్స్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్)లు రాణించి భారత జట్టుకు ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో స్వదేశీ, విదేశీ క్రికెటర్లు జాతీయ జట్టుపై ఓ కన్నేసి బరిలోకి దిగనున్నారు.
ధనాధన్ నాయకులు
ఐపీఎల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన జాబితాలో రిషబ్ పంత్, సంజు శాంసన్ ముందుంటారు. ఈ ఇద్దరూ కలిసి 2017లో గుజరాత్ లయన్స్‌పై దండయాత్ర చేశారు. బౌలర్ ఎవరైనా భయం లేకుండా బంతి బలంగా బాదే ఈ ఇద్దరు ఈ సీజన్లో నాయకత్వ బాధ్యతలు అందుకుంటు న్నారు. కెప్టెన్సీ బాధ్యతలు పంత్, సంజులకు పరీక్షగా నిలువనుంది. నాయకత్వ బాధ్యతతో సహజ విధ్వంస లక్షణం కోల్పోతారా? సారథ్యం వారిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. భారత జట్టు భవిష్య కెప్టెన్ అంటూ రిషబ్ పంత్‌పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. గత ఆరు నెలలుగా అద్వితీయ క్రికెట్ ఆడుతున్న రిషబ్ పంత్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్ అందిస్తాననే నమ్మ కంతో కనిపిస్తున్నాడు. బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన రాయల్స్‌ను సంజు శాంసన్ ఎలా నడిపిస్తాడో చూడాలి. ఈ ఇద్దరూ నాయకత్వంలో విజయవంతమైతే జాతీయ జట్టు రేసు మరింత రసవత్తరం కానుంది.
మళ్లీ స్పిన్ రాజ్యం!
ఐపీఎల్ స్వదేశానికి రావటంతో స్పిన్నర్లు కచ్చితంగా సంతోషిస్తారు. యుఏఈలో జరిగిన ఐపీఎల్లో స్పిన్నర్ల సగటు 34.03. 2016 తర్వాత ఐపీఎల్లో స్పిన్నర్లకు ఇదే చెత్త రికార్డు. స్పిన్నర్ల ఎకానమీ రేటు సైతం 7.54తో ఏమంత ఆశాజనంగా లేదు. సీజన్ మొత్తంలో స్పిన్నర్లు 198 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ సీజన్లో స్పిన్నర్లు ఊపిరీ పీల్చుకోవచ్చు. ఉపఖండ వేసవిలో మ్యాచులు ఉండటంతో ఇక్కడి పిచ్‌లపై టర్న్‌తో పాటు మంచి బౌన్స్ లభించనుంది. పేసర్లపై ఆధారపడిన జట్లు భారత్‌లో పిచ్‌లకు అనుగుణంగా తమ ప్రణాళికలు మార్పు చేసుకోక తప్పదు.
బుడగలో భద్రమేనా?
2020 ఐపీఎల్లో తొలిసారి ఎనిమిది ప్రాంఛైజీలు బుడగ జీవితం అనుభవం పొందాయి. అప్పటి నుంచి క్రికెటర్లు భిన్న బుడగల్లో ఉంటూ అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొన్నారు. గత సీజన్లో చాలా ప్రాంఛైజీలు విలాసవంతమైన రిసార్టులు, ప్రయివేటు బీచులు అద్దెకు తీసుకుని బుడగ ఏర్పాటు చేసుకున్నాయి. బుడగ దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో టీమ్ బాండింగ్ సెషన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బుడగ జీవితంపై క్రికెటర్లలో విరక్తి.. ఐపీఎల్ ద్వితీయార్థంలో స్పష్టంగా కనిపించింది. ముంబయి ఇండియన్స్ మినహా ఇతర జట్లు అన్ని బుడగ బాధలు చవిచూశాయి. బుడగలో వైవిధ్యత లోపించటం అన్ని జట్లను ప్రభావితం చేసింది. బుడగ భయంతోనే ముగ్గురు ఆసీస్ క్రికెటర్లు ఈ సీజన్‌కు దూరమయ్యారు. వివిధ దశల్లో క్వారంటైన్, ఐసోలేషన్ అనంతరం ఐపీఎల్ బుడగలోకి వచ్చిన క్రికెటర్లు.. మానసిక సమస్యలు అధిగమించి రాణించటం సవాలుతో కూడుకున్నది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ మినహా ఇతర ప్రాంఛైజీల బుడగ సామర్థ్యం తక్కువగా ఉంది. చెన్నైలో బీచ్‌తో కూడిన రిసార్ట్‌ను ముంబయి బుక్ చేసుకోగా.. ఇతర జట్లు విలాసవంత హౌటళ్లకే పరిమితం అయ్యాయి. కొన్ని జట్లకు స్విమ్మింగ్‌పూల్, టెర్రస్ ప్రవేశం సైతం పరిమితమే. మార్చి ఆరంభం నుంచి ముంబయి ఇండియన్స్ బుడగలో ఉంటున్న సహాయక కోచ్ కిరణ్ మోరె ఇటీవల కోవిడ్-19 బారిన పడటంతో బుడగ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
క్యారవాన్ షెడ్యూల్
ఐపీఎల్లో తొలిసారి క్యారవాన్ షెడ్యూల్ అమలు కానుంది. ఈ షెడ్యూల్లో ప్రతి జట్టు నిర్ణీత వేదికలోనే పలు మ్యాచులు ఆడనుంది. ఓ వేదికలో పూర్తి మ్యాచులు ఆడిన తర్వాతే.. మరో వేదికకు ప్రయాణం అవుతుంది. ఒకే వేదికలో వరుస మ్యాచులు ఆడనుండటం అన్ని ప్రాంఛైజీలకు కలిసి రానుంది. తుది జట్టు ఎంపికలోనూ స్థిరత్వం కనిపిస్తుంది. వేదిక మారితే గానీ తుది జట్టులో నూతన సమీకరణాలను పరిగణనలోకి రావు. ప్రతి జట్టు రెండు ప్రధాన స్టేడియాల్లో తొమ్మిది మ్యాచులు ఆడనుంది.. మిగతా ఐదు మ్యాచులను ఇతర రెండు వేదికల్లో ఆడనుంది. ప్రతి మ్యాచ్ కోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకపోవటం క్రికెటర్లకు మేలు చేయనుంది. ఆరు స్టేడియాల్లోని క్యూరేటర్లు నేరుగా బీసీసీఐ గ్రౌండ్స్, పిచ్‌ల కమిటీ పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు. ఆతిథ్య మైదానం అనుకూలత ఏ జట్టుకూ లేదు. క్యారవాన్ షెడ్యూల్ బేషుగ్గా ఉన్నప్పటికీ.. అభిమానులకు అనుమతి లేకపోవటం ఒక్కటే ఈ సీజన్లో భర్తీ చేయలేని లోటుగా కనిపిస్తుంది.
కొత్త చాంపియన్‌ను చూస్తామా?
ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు, చెన్నై సూపర్‌కింగ్స్ మూడుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (డెక్కన్ చార్జర్స్), కోల్‌కత నైట్‌రైడర్స్‌లు రెండేసి సీజన్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. 13 సీజన్లలో ఐదుగురు చాంపియన్లనే చూశాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు ఇప్పటికీ తొలి ట్రోఫీ కోసం విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. తటస్థ వేదికల్లో, క్యారవాన్ షెడ్యూల్‌తో బుడగలో జరుగుతున్న ఈ సీజన్లోనైనా కొత్త చాంపియన్‌ను చూస్తామా? ఆసక్తికరం. బెంగళూర్, పంజాబ్, ఢిల్లీలు ఈ సీజన్‌ను టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటం రేసును మరింత రక్తి కట్టించబోతుంది.