Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయో బబుల్‌లో క్రికెటర్ల జీవితం
నవతెలంగాణ క్రీడావిభాగం
కరోనా వైరస్ మహమ్మారి అంతర్జాతీయ క్రికెట్‌కు స్వరూపాన్నే మార్చివేసింది. ఆటలో నిలవాలంటే, బుడగలో బతకాల్సిందే అనే స్థితి వచ్చేసింది. ప్రస్తుతం బయో సెక్యూర్ బబుల్‌లో ఏడాది పాటు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సీజన్ ఐపీఎల్‌కు క్రికెటర్లు అందరూ యుఏఈలో తొలిసారి బుడగ జీవితాన్ని చూశారు. ఏడు నెలల్లోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లు సైతం బుడగలోనే ఆడేశారు. ఐపీఎల్ ధమాకా మళ్లీ రావటంతో క్రికెటర్లు ప్రాంఛైజీల బుడగలోకి ప్రవేశించారు. బుడగలో జీవితానికి కొంత మంది క్రికెటర్లు అలవాటు పడగా.. మరికొందరు ఇప్పటికీ ఇబ్బందులు చవిచూస్తున్నారు. అసలు బుడగలో క్రికెటర్ల జీవితం ఎలా ఉంటుంది?!.
- ఓ జట్టు బృందంగా ఏర్పడిన తర్వాత బుడగ సృష్టించబడదు. క్రికెటర్లు రావడానికి కనీసం వారం రోజుల ముందు నుంచే బుడగ మొదలవుతుంది. క్రికెటర్లు బస చేసే గదులను పూర్తిగా శానిటైజ్ చేయటం సహా హౌటల్ సిబ్బంది సైతం క్వారంటైన్లోకి వెళ్లిపోతారు. జిమ్, స్విమ్మింగ్‌పూల్, గార్డెన్, రెస్టారెంట్లను పూర్తి ఐసోలేషన్‌లో ఉంచుతారు.
- 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో గడటం అత్యంత కష్టమైన పని. ఏడు రోజుల ఐసోలేషన్ సైతం కష్టమే. నాలుగు గోడల నడుమ జీవించటం నైరాశ్యంలోకి నెడుతుంది. సహచర క్రికెటర్లతో కలిసి గదులు పంచుకోలేరు, ఆ సమయంలో వారిని కలువలేరు. హౌస్‌కీపింగ్ సదుపాయమూ ఉండదు. బాల్కనీతో కూడిన గది లభిస్తే క్వారంటైన్లో అది ఇంద్రభవనమే!
- పుస్తకాలు చదివే అలవాటు ఉన్న క్రికెటర్ల కాలయాపన బాగానే సాగుతుంది. మెడిటేషన్, యోగాలతో కొందరు ఒంటరితనాన్ని దూరం చేసుకుంటారు. ఫిట్‌నెస్‌పై ధ్యాస కలిగినవారు అందుబాటులో ఉన్న కిట్‌తో వ్యాయామం చేస్తున్నారు. ఓటీటీలో సినిమాలు, య్యూటూబ్‌లో క్రికెట్‌ను వీక్షిస్తూ కొందరు ఆస్వాదిస్తున్నారు.
- బుడగ సృష్టికి ప్రాంఛైజీలు ఎంచుకున్న హౌటల్ కీలకం. ముంబయి ఇండియన్స్ బీచ్ రిసార్ట్ బుక్ చేసి.. ఒక్కో క్రికెటర్‌కు ఓ విల్లాను కేటాయించింది. ప్రాక్టీస్ సౌకర్యాలకు అందుబాటులో పంజాబ్ కింగ్స్ ఉండగా.. కోల్‌కత ప్రాక్టీస్ కోసం ప్రతి రోజు గంట ప్రయాణం ఉండేలా ఏర్పాటు చేసుకుంది.
- ఐపీఎల్ 2021 బుడగ కాస్త మెరుగ్గా ఉంది. ఈ సారి కుటుంబ సభ్యులు సైతం ఐసోలేషన్‌లో తోడుగా ఉన్నారు. ఐసోలేషన్ సమయంలో అవసరమైన భోజనాన్ని ఇంటి నుంచే తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఐసోలేషన్‌లో సమయంలో క్రికెటర్లు అందరూ వర్చువల్‌గా కలిసేందుకు ప్రాంఛైజీలు ఏర్పాటు చేశాయి.
- బుడగ జీవితంతో క్రికెటర్లు వైవిధ్యత చూపిస్తున్నారు. క్రికెటర్లు, కుటుంబ సభ్యులు బుడగతో మరింత దగ్గరయ్యారు. నాన్ క్రికెట్ సంభాషణలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తరచుగా సంభాషించేందుకు సమయం చిక్కుతుంది.
- క్రికెటర్ల అలవాట్లలోనూ బుడగ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఐపీఎల్లో భిన్న దేశాలకు చెందిన క్రికెటర్లతో మమేకం కావటం, ఇతరుల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు మంచి అవకాశం ఏర్పడింది.
కరోనా వైరస్ మహమ్మారి క్రికెటర్ల జీవితాల్లో ఇంతటి మార్పులు తీసుకొస్తుందని ఎవరూ ఊహించలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మరో ఏడాది పాటు బుడగ జీవితాలు ఇలాగే ఉండనున్నాయి.