Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ పేసర్ ఐదు వికెట్ల జోరు
- ఛేదనలో డివిలియర్స్ ధనాధన్
ముంబయిపై బెంగళూర్ గెలుపు
'యార్కర్లు, స్లో బాల్స్, రివర్స్ స్వింగ్, స్లోబాల్ యార్కర్లు..' ముంబయి బ్యాట్స్‌మెన్‌పై పేసర్ హర్షల్ పటేల్ (5/27) ప్రతాపం ఇది. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కీరన్ పొలార్డ్ వంటి ప్రమాదకర హిట్టర్లను బోల్తాకొట్టించిన హర్షల్ పటేల్.. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌పై పంజా విసిరాడు. ఫామ్‌లో ఉన్న నవదీప్ సైనిని కాదని హర్షల్ పటేల్‌ను ఎలా తీసుకున్నారు? అని విమర్శించిన వారికి హర్షల్ అద్భుత బౌలింగ్‌తో బదులిచ్చేశాడు. ఛేదనలో ఏబీ డివిలియర్స్ (48) మెరుపులతో ముంబయిపై విజయంతో బెంగళూర్ ఘనంగా బోణీ కొట్టింది.
నవతెలంగాణ-చెన్నై
బెంగళూర్ బోణీ కొట్టింది. ముంబయిపై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ పేసర్ హర్షల్ పటేల్ (5/27) తొలుత ముంబయిని స్వల్ప స్కోరుకు పరిమితం చేయగా.. ఛేదనలో ఏబీ డివిలియర్స్ (48, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. హర్షల్ పటేల్, ఏబీ డివిలియర్స్ షోతో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. ఐదుసార్లు చాంపియన్ మరోసారి టైటిల్ రేసును ఓటమితోనే ఆరంభించింది. క్రిస్ లిన్ (49), సూర్యకుమార్ యాదవ్ (31), ఇషాన్ కిషన్ (28), రోహిత్ శర్మ (19) రాణించటంతో ముంబయి ఇండియన్స్ తొలుత 159/9 పరుగులు చేసింది. ఆఖరు బంతి వరకూ ఉత్కంఠ రేపిన ఛేదనను బెంగళూర్ కూల్‌గా ముగించింది.
ఏబీ మెరుపులే
160 పరుగుల ఛేదనలో వాషింగ్టన్ (10, 16 బంతుల్లో), కోహ్లి (33, 29 బంతుల్లో 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడారు. నం.3 పాటిదార్ (8) నిరాశపరచగా 46/2తో బెంగళూర్ ఒత్తిడిలో పడింది. మాక్స్వెల్ (39, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించి ఆశలు రేపారు. కోహ్లిని బుమ్రా, మాక్స్‌వెల్‌ను జెమీసన్ పక్కా వ్యూహంతో సాగనంపారు. దీంతో బెంగళూర్ కష్టాల్లో పడింది. ఛేదన భారం డివిలియర్స్‌పై పడింది. టెయిలెండర్ల సహకారంతో అద్భుతంగా ఆడిన ఏబీ.. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆఖరు ఓవర్లో రనౌట్ అయినా.. అప్పటికే లాంఛనం ముగించాడు. చివరి బంతికి సింగిల్‌తో బెంగళూర్ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.
మెరిసిన క్రిస్ లిన్
గత సీజన్లో పూర్తిగా బెంచ్‌కు పరిమితమైన డ్యాషింగ్ ఓపెనర్ క్రిస్ లిన్ (49, 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కసి తీర్చుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (19, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన క్రిస్ లిన్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. చాహల్‌పై సిక్సర్‌తో రోహిత్ శర్మ బ్యాంగ్ బ్యాంగ్ మొదలెట్టగా.. క్రిస్ లిన్ మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో చెలరేగాడు. వికెట్ల మధ్య సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్‌గా నిష్క్రమించాడు. సూర్యకుమార్ యాదవ్ (31, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ లిన్లు ముంబయిని భారీ స్కోరు దిశగా నడిపించారు. ఇషాన్ కిషన్ (28, 19 బంతుల్లో 2 ఫోర్లు) ఫామ్ కొనసాగించాడు. ఆఖరు ఓవర్లలో దండిగా పరుగులు పిండుకునేందుకు ముంబయి రంగం సిద్ధం చేసుకోగా.. డెత్ ఓవర్లలో కోహ్లి కొత్త వ్యూహంతో ఆకట్టుకున్నాడు.
హర్షల్ అదుర్స్
హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కీరన్ పొలార్డ్ వంటి బిగ్ హిట్టర్లు క్రీజులో నిలిచినా చివరి నాలుగు ఓవర్లలో ముంబయి కేవలం 25 పరుగులే సాధించింది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముంబయిపై తొలి ఐదు వికెట్ల ప్రదర్శన గావించాడు. ఆఖరు ఓవర్లో ఓ రనౌట్ సహా నాలుగు వికెట్లు కూల్చిన హర్షల్ ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అర్థ సెంచరీ ముంగిట క్రిస్ లిన్‌ను అవుట్ చేయటంతో పాటు హార్దిక్, పొలార్డ్, కృనాల్‌లను డగౌట్ బాట పట్టించాడు. హర్షల్ పటేల్ జోరుతో ముంబయి నిర్ణీత ఓవర్లలో 159/9 పరుగులే చేసింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (0/22) ఆకట్టుకున్నాడు.
ముంబయి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (రనౌట్) 19, క్రిస్ లిన్ (సి,బి) వాషింగ్టన్ 49, సూర్యకుమార్ యాదవ్ (సి) డివిలియర్స్ (బి) జెమీసన్ 31, ఇషాన్ కిషన్ (ఎల్బీ) హర్షల్ పటేల్ 28, హార్దిక్ పాండ్య (ఎల్బీ) హర్షల్ పటేల్ 13, పొలార్డ్ (సి) వాషింగ్టన్ (బి) హర్షల్ పటేల్ 7, కృనాల్ పాండ్య (సి) క్రిస్టియన్ (బి) హర్షల్ పటేల్ 7, మార్కో జెన్సన్ (బి) హర్షల్ పటేల్ 0, రాహుల్ చాహర్ (రనౌట్) 0, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159.
వికెట్ల పతనం : 1-24, 2-94, 3-105, 4-135, 5-145, 6-158, 7-158, 8-158, 9-159.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 4-0-22-1, జెమీసన్ 4-0-27-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-41-0, షాబాజ్ అహ్మద్ 1-0-14-0, హర్షల్ పటేల్ 4-0-27-5, క్రిస్టియన్ 2-0-21-0, వాషింగ్టన్ సుందర్ 1-0-7-1.
బెంగళూర్ ఇన్నింగ్స్ : వాషింగ్టన్ (సి) లిన్ (బి) కృనాల్ 10, విరాట్ (ఎల్బీ) బుమ్రా 33, పాటిదార్ (బి) బౌల్ట్ 8, మాక్స్వెల్ (సి) లిన్ (బి) జెన్సన్ 39, డివిలియర్స్ (రనౌట్) 48, షాబాజ్ (సి) కృనాల్ (బి) జెన్సన్ 1, క్రిస్టియన్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1, జెమీసన్ రనౌట్ 4, హర్షల్ నాటౌట్ 4, సిరాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-36, 2-46, 3-98, 4-103, 5-106, 6-122, 7-152, 8-158.
బౌలింగ్ : బౌల్ట్ 4-0-36-1, బుమ్రా 4-0-26-2, జెన్సన్ 4-0-28-2, కృనాల్ 4-0-25-1, రాహుల్ 4-0-43-0.