Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌సీఏ ఏజీఎం సమావేశం నేడు
నవతెలంగాణ, హైదరాబాద్
అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఏజీఎం ఏం తేల్చనుందనే ఆసక్తి నెలకొంది. మార్చి 28న భేటీ అయిన ఏజీఎం అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై విభేదాలతో వాయిదా పడింది. సంస్థాగత అంశాలపై జరగాల్సిన చర్చ.. మాజీ టెస్టు క్రికెటర్ల మధ్య దూషణలతో సాగింది. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పదవికి హెచ్‌సీఏ ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లను ఏజీఎం ముందుంచిన సంగతి తెలిసిందే. జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, జస్టిస్ మీనాకుమారి, జస్టిస్ దీపక్ వర్మల పేర్లు గత సమావేశంలో చర్చకు వచ్చాయి.
సభ్యుల రాజీ! : అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంలో అపెక్స్ కౌన్సిల్, ఏజీఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జస్టిస్ దీపక్ వర్మను గతంలోనే అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా నియమించాడు. ఆయన పేరునే అజహరుద్దీన్ మరోసారి ప్రతిపాదించాడు. క్లబ్ కార్యదర్శులు అందుకు అంగీకారం తెలపలేదు. దీంతో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పదవిని రెండుగా విడగొట్టనున్నారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా ఇద్దరు న్యాయమూర్తులను నియమించే అవకాశం ఉంది.
హైకోర్టు తీర్పు ప్రభావం : జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్‌మన్‌గా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ నియమించారు. 2020, జూన్ 6 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంబుడ్స్‌మన్‌ను నియమించారు. 2020, ఆగస్టు 13న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంబుడ్స్‌మన్ నియామకాన్ని అధికారికంగా దృవీకరించారు. ఈ విషయాన్ని పక్కనపెట్టిన హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. విజయానంద్, ఓ క్రికెట్ క్లబ్ న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించినట్టు హైకోర్టు భావించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకం చెల్లుబాటు అవుతుందని జస్టిస్ ఎం.ఎస్ రామచంద్ర రావు తీర్పు చెప్పారు. ఓ వైపు హెచ్‌సీఏ ఏజీఎంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై పీటముడి నెలకొనగా.. మరోవైపు జస్టిస్ దీపక్ వర్మనే హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ అని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నేటి ఏజీఎంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా దీపక్ వర్మను ఖరారు చేయాలని అధ్యక్షుడు అజహరుద్దీన్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
కార్యదర్శిపై విమర్శలు : హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. విజయానంద్పై విమర్శలు వస్తున్నాయి. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్న నియామకాన్ని ఉద్దేశపూర్వకంగానే విజయానంద్ అడ్డుకున్నాడని హైకోర్టు సైతం అక్షింతలు వేసింది. విజయానంద్‌కు ఎనిమిది క్రికెట్ క్లబ్‌లు, కోశాధికారి సురేందర్ అగర్వాల్‌కు నాలుగు క్రికెట్ క్లబ్‌లు, మరో సభ్యుడు సయ్యద్ మోయిజుద్దీన్కు నాలుగు క్రికెట్ క్లబ్‌లు ఉన్నట్టు చార్మినార్ క్రికెట్ క్లబ్ ప్రతినిధులు ఆరోపించారు. విరుద్ధ ప్రయోజనాల అంశంలో అనర్హత వేటు పడుతుందనే భయంతోనే అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై హెచ్‌సీఏ సభ్యులు కాలయాపన చేస్తున్నట్టు తెలుస్తోంది.