Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో శిఖర్, పృథ్వీ అర్థ శతకాలు
- చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ కొట్టింది. గత సీజన్లో రెండు మ్యాచుల్లోనూ ధోనీసేనను ఓడించిన క్యాపిటల్స్.. తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనూ సూపర్‌కింగ్స్‌కు పరాజయం రుచిచూపించింది. 189 పరుగుల ఛేదనలో ఓపెనర్లు పృథ్వీ షా (72), శిఖర్ ధావన్ (85) అర్థ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యంతో కదంతొక్కిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసింది. ఐపీఎల్ 14 సీజన్‌ను గట్టి బోణీతో ఆరంభించింది.
నవతెలంగాణ-ముంబయి
ధోనీపై పంత్ పైచేయి సాధించాడు. చెన్నై, ఢిల్లీ సీజన్ తొలి మ్యాచ్‌లో క్యాపిటల్స్ అదిరే విజయం సాధించింది. 189 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ ఏ దశలోనూ ఇరుకున పడేయలేదు. ఓపెనర్లు పృథ్వీ షా (72, 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (85, 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 138 పరుగులు జతచేశారు. ఓపెనర్ల భాగస్వామ్యంతోనే మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్ చేజారిపోయింది. పృథ్వీ 27 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదగా.. ధావన్ 35 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేశాడు. చెన్నై బౌలర్లను ఊచకోత కోసిన పృథ్వీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో షాకు రెండుసార్లు జీవనదానం లభించటం యువ ఓపెనర్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ రిషబ్ పంత్ (15 నాటౌట్, 12 బంతుల్లో 2 ఫోర్లు) బౌండరీతో లాంఛనాన్ని ముగించాడు. 18.4 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 190/3తో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 188/7 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54, 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మోయిన్ అలీ (36, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శామ్ కరణ్ (34, 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. రవీంద్ర జడేజా (26 నాటౌట్), అంబటి రాయుడు (23)లు రాణించారు. ఢిల్లీ పేసర్లలో ఆవేశ్ ఖాన్ (2/23), క్రిస్ వోక్స్ (2/18)లు చెన్నైకి కట్టడి చేశారు.
ఓపెనర్ల విధ్వంసం
189 పరుగుల ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ (72), ధావన్ (85) దూకుడుగా ఆడారు. పవర్ ప్లేలోనే చెన్నైకి వెనక్కి నెట్టిన ఓపెనర్లు.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓవర్‌కు పది రన్‌రేట్‌తో పరుగులు పిండుకున్నారు. పృథ్వీ 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగగా.. ధావన్ పది ఫోర్లు, రెండు సిక్సర్లతో కదంతొక్కాడు. ఈ ఇద్దరి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు చెన్నై అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మ్యాచ్‌పై ఆశలు ఆవిరైన అనంతరం ఓపెనర్లను అవుట్ చేసినా.. అప్పటికే మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. రిషబ్ పంత్ (15), స్టోయినిస్ (14) లాంఛనం ముగించారు.
రాణించిన రైనా, కరణ్
ఓపెనర్లు విఫలమైనా మిడిల్ ఆర్డర్ చెన్నైని ఆదుకుంది. రుతురాజ్ (5), డుప్లెసిస్ (0)లు ఆరంభంలోనే చేతులెత్తే శారు. రీ ఎంట్రీలో సురేశ్ రైనా (54) అర్థ సెంచరీ సాధించగా.. నం.3 పించ్ హిట్టర్ మోయిన్ అలీ (36, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెప్పించాడు. అలీ, రైనా మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని చెలరేగిన అలీ వేగంగా ఆడాడు. అశ్విన్‌పై రెండు వరుస సిక్సర్లు కొట్టాడు. రైనా మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. తెలుగు స్టార్ అంబటి రాయుడు (23, 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి నాల్గో వికెట్‌కు రైనా విలువైన 63 పరుగులు జతచేశాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో రాయుడు నిష్క్రమించగా.. జడేజాతో సమన్వయ లోపంతో రైనా రనౌట్‌గా నిష్క్రమించాడు. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (0)ని యువ పేసర్ ఆవేశ్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 137/6తో సూపర్‌కింగ్స్ కీలక వికెట్లు కోల్పోయింది. స్లాగ్ ఓవర్లలో శామ్ కరణ్ (34) విశ్వరూపం చూపించాడు. రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో కదం తొక్కాడు. సోదరుడు టామ్ కరణ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కరణ్ జోరుతో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (26 నాటౌట్, 17 బంతుల్లో 3 ఫోర్లు) పునరాగమనంలో మెప్పించాడు.
చెన్నై ఇన్నింగ్స్ : రుతురాజ్ (సి) ధావన్ (బి) వోక్స్ 5, డుప్లెసిస్ (ఎల్బీ) ఆవేశ్ 0, మోయిన్ (సి) ధావన్ (బి) అశ్విన్ 36, రైనా (రనౌట్) 54, రాయుడు (సి) ధావన్ (బి) కరణ్ 23, జడేజా నాటౌట్ 26, ధోని (బి) ఆవేశ్ 0, శామ్ కరణ్ (బి) వోక్స్ 34, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 188.
వికెట్ల పతనం : 1-7, 2-7, 3-60, 4-123, 5-137, 6-137, 7-188.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 3-0-18-2, ఆవేశ్ ఖాన్ 4-0-23-2, అశ్విన్ 4-0-47-1, టామ్ కరణ్ 4-0-40-1, అమిత్ మిశ్రా 3-0-27-0, మార్కస్ స్టోయినిస్ 2-0-26-0.
ఢిల్లీ ఇన్నింగ్స్ : పృథ్వీ (సి) అలీ (బి) బ్రావో 72, ధావన్ (ఎల్బీ) ఠాకూర్ 85, పంత్ 15 నాటౌట్, స్టోయినిస్ (సి) కరణ్ (బి) ఠాకూర్ 14, హెట్మయర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 190.
వికెట్ల పతనం : 1-138, 2-167, 3-186.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-36-0, శామ్ కరణ్ 2-0-24-2, శార్దుల్ ఠాకూర్ 3.4-0-53-2, జడేజా 2-0-16-0, అలీ 3-0-33-0, బ్రావో 4-0-28-1.