Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానా, త్రిపాఠి అర్థ సెంచరీలు
- ఛేదనలో సన్‌రైజర్స్ చతికిల
నవతెలంగాణ-చెన్నై: రెండుసార్లు చాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల ఛేదనలో హైదరాబాద్ చతికిల పడింది. జానీ బెయిర్‌స్టో (55, 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (61 నాటౌట్, 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (7), కెప్టెన్ డెవిడ్ వార్నర్ (3) విఫలం కావటంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభమైంది. మనీశ్ పాండే, జానీ బెయిర్‌స్టోలు మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించినా.. మిడిల్ ఆర్డర్‌పై రన్‌రేట్ భారం పడింది. విజరు శంకర్ (11), మహ్మద్ నబి (14) అంచనాలను అందుకోలేదు. అబ్దుల్ సమద్ (14 నాటౌట్, 8 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరుపులు ఆలస్యమైయ్యాయి. అజేయ అర్థ సెంచరీ బాదిన మనీశ్ పాండే భారీ షాట్లు ఆడలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో హైదరాబాద్ 177/5 పరుగులే చేయగల్గింది. అంతకుముందు ఓపెనర్ నితీశ్ రానా (80, 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (53, 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు అర్థ సెంచరీలు సాధించారు. రానా, రాహుల్‌లు రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యంతో కదంతొక్కటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ 187/6 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆ ఇద్దరు కుమ్మేశారు : టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు కోల్‌కత బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. నితీశ్ రానా (80), శుభ్‌మన్ గిల్ (15)లు తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఆరంభంలో భువి ఓవర్లో రానా క్యాచ్‌ను అంచనా వేయటంలో విఫలమైన సమద్ భారీ మూల్యం చెల్లించాడు. గిల్ త్వరగా అవుటైనా.. రాహుల్ త్రిపాఠి (53)తో కలిసి తడాఖా చూపించాడు. భువనేశ్వర్ కుమార్‌కు టార్గెట్ చేసుకున్న ఈ జోడీ పరుగుల వరద పారించింది. త్రిపాఠి 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రానా 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 బంతుల్లో ఫిప్టీ అందుకున్నాడు. రానా, రాహుల్ జోరుతో కోల్‌కత 200 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించింది. స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబిలు కోల్‌కతకు ఆఖర్లో కళ్లెం వేశారు. చివరి ఐదు ఓవర్లలో రసెల్ (5), మోర్గాన్ (2), షకిబ్ (3)లను అవుట్ చేసిన బౌలర్లు.. కేవలం నాలుగు బౌండరీలే ఇచ్చారు. దినేశ్ కార్తీక్ (22 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరు ఓవర్లో మెరవటంతో కోల్‌కత 187 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ సీమర్లు భువనేశ్వర్ (1/45), సందీప్ శర్మ (0/35), నటరాజన్ (1/37)లు విఫలమయ్యారు.
కోల్‌కత ఇన్నింగ్స్ : 187/6 (నితీశ్ రానా 80, రాహుల్ త్రిపాఠి 53, రషీద్ ఖాన్ 2/24, మహ్మద్ నబి 2/32)
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 177/5 (మనీశ్ పాండే 61, జానీ బెయిర్‌స్టో 54, ప్రసిద్ కృష్ణ 2/35, కమిన్స్ 1/32)