Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడిపై సభ్యుల తిరుగుబాటు
- హెచ్‌సీఏ ఏజీఏం గందరగోళం
నవతెలంగాణ-హైదరాబాద్: అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు, ఆర్థిక అవకతవకల్లో నిండా మునిగి ఉన్న హెచ్‌సీఏ.. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపై మరిన్ని వివాదాలకు ఆజ్యం పోసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏజీఎం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. హైకోర్టు తీర్పుతో జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్టు ఏజీఎంలో అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తేల్చాడు. బీసీసీఐలో హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహరుద్దీన్‌ను తనను తాను ప్రకటించుకున్నాడు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి 33 జిల్లాలకు బీసీసీఐ నిధుల్లో 20 శాతం కేటాయించనున్నట్టు ఏజీఎంలో తీర్మానించారు. అనంతరం ఏజీఎం ముగిసినట్టు అధ్యక్షుడు ప్రకటించాడు. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకంపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు హైకోర్టు తీర్పుపై నిరసన సైతం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం అజహరుద్దీన్ ప్రమేయం లేకుండానే కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌లు ఏజీఎం పేరిటి మరో సమావేశం నిర్వహించారు.
ఇద్దరినీ నియమించారు : అజహరుద్దీన్ ప్రమేమం లేకుండా సాగిన మరో సమావేశంలో హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ మీనా కుమారిలను నియమించారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌కు ఇచ్చిన జీత భత్యాలనే ఇద్దరికీ ఇవ్వనున్నట్టు తెలిపారు. బీసీసీఐకి సైతం అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ ఒక్కడే ఉండగా.. హెచ్‌సీఏ మాత్రం ఇద్దరు న్యాయమూర్తులను నియమించింది. ఆఫీస్ బేరర్లు, హెచ్‌సీఏ సభ్యులపై వచ్చే ఫిర్యాదులలో ఏ అంశం ఎవరు పరిశీలించాలనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మిగలనుంది.
బీసీసీఐలో హెచ్‌సీఏ ప్రతినిధిగా భారత క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఎన్.శివలాల్ యాదవ్‌ను నియమించారు. హెచ్‌సీఏ క్రికెట్ టాలెంట్ కమిటీలోకి మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ను తీసుకున్నారు. మాజీ కార్యదర్శి టి. శేషు నారాయణ్‌ను హెచ్ఆర్ మేనేజర్‌గా ఎంపిక చేశారు. సీనియర్ టోర్నమెంట్ కమిటీ, టూర్, ఫిక్సర్స్ అండ్ టెక్నికల్ కమిటీ, క్రికెట్ సలహా కమిటీ, జూనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెట్ టాలెంట్ కమిటీ, అంపైర్ కమిటీ, టీటీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, గ్రౌండ్స్ కమిటీ, సీఈఓ, సీఎఫ్ఓ సహా మేనేజర్లను నియమించారు.
మళ్లీ కోర్టుకు? : హెచ్‌సీఏలో ఆఫీస్ బేరర్లలో ఎక్కువ మంది విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. తాజా ఏజీఎంలో అధ్యక్షుడు ఒకరిని, ఇతర సభ్యులు మరొకరిని అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌గా ప్రకటించటంతో ఈ వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకు వెళ్లనుందని చెప్పవచ్చు. అంతిమంగా, ఆఫీస్ బేరర్లు విరుద్ధ ప్రయోజనాలు అనుభవిస్తూనే ఉండనున్నారు!.