Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 పరుగుల తేడాతో రాయల్స్ ఓటమి
- కెఎల్ రాహుల్, హుడా మెరుపు ఇన్నింగ్స్‌లు
- బోణీ కొట్టిన పంజాబ్ కింగ్స్
222 పరుగుల లక్ష్యం. బెన్ స్టోక్స్ (0), జోశ్ బట్లర్ (25) విఫలమయ్యారు. రాజస్థాన్‌కు ఇక కష్టమే అనుకున్న తరుణంలో కెప్టెన్ సంజు శాంసన్ (119) శతకబాదాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లతో వీర విహారం చేశాడు. రాయల్స్‌కు మెరుపు విజయాన్ని కట్టబెట్టినట్టే కనిపించాడు. శాంసన్‌ను అవుట్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ల మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. ఆఖరు బంతికి ఐదు పరుగులు చేయాల్సిన ఉండగా.. సిక్స్ కొట్టే ప్రయత్నంలో సంజు అవుటయ్యాడు. ఐపీఎల్14 సీజన్ తొలి శతకం వృథా అయిపోయింది.
నవతెలంగాణ-ముంబయి : పరుగుల వరద పారిన వాంఖడేలో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. 222 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నిలుపుకుంది. కెప్టెన్ సంజు శాంసన్ (119, 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత శతకంతో కదం తొక్కినా.. రాజస్థాన్‌కు నిరాశే మిగిలింది. అంతకుమందు, కెఎల్ రాహుల్ (91, 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్ హుడా (64, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఉప్పెనలా విరుచుకుపడ్డారు. హుడా ఆరు సిక్సర్లు, రాహుల్ సిక్సర్లతో చెలరేగారు. క్రిస్ గేల్ (40, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం మెరవటంతో పంజాబ్ కింగ్స్ 221/6 పరుగుల భారీ స్కోరు చేసింది. దీపక్ హుడా, కెఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 105 పరుగులు జోడించి పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు.
ఒక్కడే పోరాడాడు : రికార్డు లక్ష్య ఛేదనలో స్టోక్స్, బట్లర్ చేతులెత్తేసినా.. సంజు శాంసన్ (119) ఒంటరిపోరాటం చేశాడు. సహచరుల నుంచి సహకారం లభించకపోయినా క్రీజులో సంజు సహనంతో నిలబడ్డాడు. రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శాంసన్.. తర్వాతి 21 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. రియాన్ పరాగ్ (25, 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) సైతం మెరవటంతో ఆఖర్లో సంజు పని సులువైనట్టే అనిపించింది. పరాగ్ నిష్క్రమణ, రాహుల్ తెవాటయ వైఫల్యంతో భారమంతా శాంసన్‌పై పడింది. ఆఖరు ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. సంజు శాంసన్ క్రీజులో ఉన్నప్పటికీ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. పేసర్ అర్షదీప్ సింగ్ ఆఖరు ఓవర్లో శాంసన్‌ను కట్టడి చేసి పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.
హుడా, రాహుల్ మెరుపుల్ : దేశవాళీ క్రికెటర్ల అదిరే విన్యాసాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (64, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 9.5 ఓవర్లలో 89/2తో సాగుతున్న పంజాబ్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వచ్చీ రాగానే శ్రేయాస్ గోపాల్‌పై బౌండరీ బాదిన హుడా.. వరుస ఓవర్లలో శివం దూబెపై రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్‌పై మూడు సిక్సర్లు, క్రిస్ మోరీస్‌పై ఓ సిక్సర్‌తో ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. యువ పేసర్ చేతన్ సకరియను సైతం హ్యాట్రిక్ బౌండరీలు బాదిన హుడా.. కెప్టెన్ రాహుల్‌తో కలిసి 47 బంతుల్లోనే 105 పరుగులు పిండుకున్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో పంజాబ్ అలవోకగా భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (91) అర్థ సెంచరీతో రాణించాడు. మయాంక్ అగర్వాల్ (14)తో కలిసి శుభారంభం చేసిన రాహుల్.. క్రిస్ గేల్ (40)తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. క్రిస్ మోరీస్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా బాదిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. రాయల్స్ బౌలర్లలో చేతన్ సకరియ (3/31), క్రిస్ మోరీస్ (2/41) రాణించారు.
పంజాబ్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) తెవాటియ (బి) చేతన్ 91, మయాంక్ (సి) సంజు (బి) చేతన్ 14, గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40, హుడా (సి) పరాగ్ (బి) మోరీస్ 64, పూరన్ (సి) చేతన్ (బి) మోరీస్ 0, షారుక్ నాటౌట్ 6, రిచర్డ్సన్ (సి) మోరీస్ (బి) చేతన్ 0, ఎక్స్‌ట్రాలు: 06, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221.
వికెట్ల పతనం : 1-22, 2-89, 3-194, 4-201, 5-220, 6-221.
బౌలింగ్ : చేతన్ 4-0-31-3, ముస్తాఫిజుర్ 4-0-45-0, మోరీస్ 4-0-41-2, గోపాల్ 3-0-40-0, స్టోక్స్ 1-0-12-0, తెవాటియ 2-0-25-0, పరాగ్ 1-0-7-1, దూబె 1-0-20-0.
రాజస్థాన్ ఇన్నింగ్స్ : స్టోక్స్ (సి,బి) షమి 0, వోహ్రా (సి,బి) అర్షదీప్ 12, శాంసన్ (సి) హుడా (బి) అర్షదీప్ 119, బట్లర్ (బి) రిచర్డ్సన్ 25, దూబె (సి) హుడా (బి) అర్షదీప్ 23, పరాగ్ (సి) రాహుల్ (బి) షమి 25, తెవాటియ (సి) రాహుల్ (బి) మెరెడిత్ 2, మోరీస్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217.
వికెట్ల పతనం : 1-0, 2-25, 3-70, 4-123, 5-175, 6-201, 7-217.
బౌలింగ్ : మహ్మద్‌షమి 4-0-33-2, రిచర్డ్సన్ 4-0-55-1, అర్షదీప్ 4-0-35-3, మెరెడిత్ 4-0-49-1, అశ్విన్ 4-0-43-0.