Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా..
చెన్నై: ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో అదరగొట్టిన కేకేఆర్.. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. రాహుల్ చాహర్ నాలుగు వికెట్లతో గేమ్ చేంజర్‌గా మారగా, కృనాల్ పాండ్యా వికెట్ సాధించి 13 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించగా, ఆఖరి ఓవర్లో బౌల్ట్ రెండు వికెట్లు మ్యాచ్‌ను మొత్తం ముంబై వైపు తిప్పాడు. గిల్(33), నితీష్ రానా(57)లు మాత్రమే రాణించడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. 142 పరుగులకే పరిమితమైన కేకేఆర్ ఓటమి పాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైటరైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రాణా(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శుభ్‌మన్ గిల్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33) శుభారంభం అందించడంతో కేకేఆర్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్(4/27) విజంభించడంతో ఆ జట్టు ఒక్కసారిగా డీలా పడిపోయింది.
18 బంతుల్లో 22 పరుగులు చేయలేక గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 18వ ఓవర్లో కృనాల్ 3 రన్స్ ఇవ్వగా.. 19 ఓవర్ జస్ప్రీత్ బుమ్రా 4 పరగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ అవకాశాలను దెబ్బతీశారు. చివరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ట్రెంట్ బౌల్ట్ కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దాంతో ముంబై విజయం లాంఛనమైంది.