Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై పేసర్ అద్భుత ప్రదర్శన
- పంజాబ్‌పై సూపర్‌కింగ్స్ గెలుపు
పంజాబ్ కింగ్స్ విధ్వంసక హిట్టర్లతో నిండి ఉంది. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయటంలో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లు విఫలమవుతున్నారు. సహజంగానే ఈ రెండు జట్ల ముఖాముఖిలో పంజాబ్‌దే పైచేయి కావాలి. స్వింగ్ బౌలర్ దీపక్ చాహర్ (4/13) అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. పంజాబ్ కింగ్స్ 107/8 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్‌పై విజయంతో సీజన్లో సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది.
నవతెలంగాణ-ముంబయి
సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్ దీపక్ చాహర్ (4/13) పవర్‌ప్లేలో నిప్పులు చెరిగే బంతులు వేయటంతో పంజాబ్ కింగ్స్ పనైపోయింది. 26/5తో కష్టాల్లో పడిన పంజాబ్‌ను షారుక్ ఖాన్ (47, 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. స్వల్ప ఛేదనలో మోయిన్ అలీ (46, 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. ఓపెనర్ డుప్లెసిస్ (36 నాటౌట్, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఛేదనలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ పేసర్ మహ్మద్ షమి రెండు వికెట్లతో మెరిశాడు.
మోయిన్ మోత : 108 పరుగుల స్వల్ప ఛేదనలో చెన్నైకి ధనాధన్ ఆరంభం లభించలేదు. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 5) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో డుప్లెసిస్ సైతం నెమ్మదిగా ఆడటంతో ఆరంభ ఓవర్లలో చెన్నై పెద్దగా పరుగులు రాబట్టుకోలేదు. గైక్వాడ్ నిష్క్రమణతో సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. పించ్ హిట్టర్ మోయిన్ అలీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెన్నైకి గెలుపు గీతకు చేరువ చేశాడు. సురేశ్ రైనా (8), రాయుడు (0)లు వరుస బంతుల్లో నిష్క్రమించినా శామ్ కరన్ తోడుగా ఓపెనర్ డుప్లెసిస్ లాంఛనం ముగించాడు.
చాహర్ చెలరేగాడు : మయాంక్ అగర్వాల్ (0), క్రిస్ గేల్ (10), దీపక్ హుడా (10), నికోలస్ పూరన్ (0).. పంజాబ్ కింగ్స్ భీకర బ్యాట్స్‌మెన్ చెన్నై పేసర్ దీపక్ చాహర్ స్వింగ్‌కు విలవిల్లాడారు. వరుసగా నాలుగు ఓవర్లు వేసిన చాహర్.. ఓ మెయిడిన్ ఓవర్ సహా నాలుగు వికెట్లు కూలగొట్టాడు. దీపక్ చాహర్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ 26/5తో బ్యాటింగ్ లైనప్‌ను కోల్పోయింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న చెన్నైకి చాహర్ అదిరే ఆరంభాన్ని అందించాడు. మయాంక్, హుడా, పూరన్, గేల్‌ను చాహర్ అవుట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ (5)ను కండ్లుచెదిరే డైరెక్ట్ హిట్‌తో జడేజా రనౌట్ చేశాడు. వందలోపే ఆలౌటయ్యేలా కనిపించిన పంజాబ్ కింగ్స్‌ను యువ బ్యాట్స్‌మన్ షారుక్ ఖాన్ (47) ఆదుకున్నాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన షారుక్ ఖాన్ టెయిలెండర్లతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఆఖర్లో జై రిచర్డ్సన్ (15) షారుక్‌కు సహకరించాడు. శార్దుల్ ఠాకూర్ (0/35) పరుగుల కట్టడిలో విఫలమయ్యాడు. అర్థ సెంచరీ ముంగిట షారుక్ అవుటయ్యాడు. పంజాబ్ కింగ్స్ 107/8 స్కోరుతో సరిపెట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షలు జరిమానా కట్టిన సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని.. పంజాబ్‌తో మ్యాచ్‌ను సరిగ్గా 90 నిమిషాల్లోనే ముగించాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌కు షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు తెరపడింది.
పంజాబ్ ఇన్నింగ్స్ : రాహుల్ (రనౌట్) 5, మయాంక్ (బి) చాహర్ 0, గేల్ (సి) జడేజా (బి) చాహర్ 10, హుడా (సి) డుప్లెసిస్ (బి) చాహర్ 10, పూరన్ (సి) ఠాకూర్ (బి) చాహర్ 0, షారుక్ (సి) జడేజా (బి) కరన్ 47, రిచర్డ్సన్ (బి) అలీ 15, అశ్విన్ (సి) డుప్లెసిస్ (బి) బ్రావో 6, షమి నాటౌట్ 9, మెరెడిత్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106.
చెన్నై ఇన్నింగ్స్ : గైక్వాడ్ (సి) హుడా (బి) సింగ్ 5, డుప్లెసిస్ నాటౌట్ 36, మోయిన్ అలీ (సి) షారుక్ (బి) అశ్విన్ 46, సురేశ్ రైనా (సి) రాహుల్ (బి) షమి 8, రాయుడు (సి) పూరన్ (బి) షమి 0, కరన్ నాటౌట్ 5,
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-21-2, రిచర్డ్సన్ 3-0-21-0, అర్షదీప్ సింగ్ 2-0-7-1, రిలే మెరెడిత్ 3.4-0-21-0, ఎం. అశ్విన్ 3-0-32-1.