Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 52 బంతుల్లోనే సెంచరీ
- రాజస్థాన్‌పై బెంగళూరు పది వికెట్లతో గెలుపు
ముంబయి : ప్రస్తుత ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయాన్ని అందుకుంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌పై ఏకంగా పది వికెట్లతో సునాయంగా ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. దేవదత్ పడిక్కల్ 101 పరుగులు (52 బంతుల్లో 6 సిక్స్‌లు, 11 ఫోర్లు) చేయగా, విరాట్ కోహ్లి 72 పరుగులు (47 బంతుల్లో మూడు సిక్స్‌లు, 6 ఫోర్లు) చేశారు. దీంతో బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు ప్రత్యర్ధికి బ్యాటింగ్ అప్పగించింది. రాజస్థాన్ జట్టులో శివం దుబే 46 పరుగులు ( 32 బంతుల్లో రెండు సిక్స్‌లు, 5 ఫోర్లు), రాహుల్ తేవాటియా 40 పరుగులు (23 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు) చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లులో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు నిరాశపర్చారు. బట్లర్ 8, మనన్ వోహ్రా 7 పరుగులకే అవుటయ్యారు. ఈ దశలో వచ్చిన మిల్లర్ డకౌటయ్యాడు. దీంతో 4.3 ఓవర్లకు 3 వికెట్ల కోల్పోయిన రాజస్థాన్ 18 పరుగులే చేసింది. ఈ దశలో కెప్టెన్ సంజు సాంమ్సన్ (21), రియాన్ పరాగ్ (25) ఫరవాలేదని పించగా, శివం దుబే 46 పరుగులతో రాణించాడు.
ఈ తరువాత వచ్చిన రాహుల్ తేవాటియా వేగంగా 40 పరుగులు చేసి 19 ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్ తొలి బంతికి క్రిస్ మోర్రిస్ (10) అవుటవ్వగా, రెండో బంతికి చేతన్ సకారియా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 20 ఓవర్లలో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో సిరాజ్, హర్షల్ పటేల్‌కు చెరో మూడు వికెట్లు లభించాయి.