Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్ వేదికగా అక్టోబర్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను అవసరమైతే తటస్థ వేదికగా యుఏఇలో ఎంపిక చేస్తామని భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) తెలిపింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టి20 వరల్డ్‌కప్‌పై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో బిసిసిఐ శుక్రవారం స్పందించింది. భారత్‌నుంచి ఇతర దేశాలకు వెళ్ళే విమాన సర్వీసులపై నిషేధం, ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో టోర్నీకి ప్లాన్-బి కూడా సిద్ధంగా ఉందని అందులో పేర్కొంది. ఇదే విషయాన్ని బిసిసిఐ జనరల్ మేనేజర్, టి20 వరల్డ్‌కప్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రా కూడా ధృవీకరించారు. 'ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ అత్యవసర ప్రణాళిక ప్రకారం టోర్నీ యుఏఇలోనైనా జరుగుతుంది. అయితే ఆతిథ్య హక్కులు మాత్రం బిసిసిఐ దగ్గరే ఉంటాయి' అని ఆయన స్పష్టం చేశారు. టి20 ప్రపంచకప్ టోర్నీ కోసం హైదరాబాద్‌తోపాటు ముంబయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో మైదానాలను బిసిసిఐ ఎంపిక చేసింది.