Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై సూపర్‌కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపు
న్యూఢిల్లీ: చివరి బంతివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ముంబయి 4 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్(87నాటౌట్; 34 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. చివరి బంతివరకు క్రీజ్‌లో నిలిచిన పొలార్డ్.. ఆఖరి 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఎన్గిడి వేసిన 5వ బంతిని సిక్సర్, 6వ బంతికి 2 పరుగులు చేసి ముగించాడు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై అంబటి రాయుడు(72నాటౌట్; 27 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు)కి తోడు డుప్లెసిస్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో మెరవడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు గెలిచింది. దీంతో ఐపిఎల్ చరిత్రలో రెండో అత్యధిక లక్ష్యాన్ని ముంబయి ఛేదించగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొలార్డ్ లభించింది.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ గైక్వాడ్(4) త్వరగా పెవీలియన్‌కు చేరిపోయాడు. ఈ దశలో మరో ఓపెనర్ డూ ప్లెసిస్(50; 28బంతుల్లో.. 2ఫోర్లు, 4సిక్సర్లు), మొయిన్ అలీ(58; 36బంతుల్లో.. 5ఫోర్లు, 5సిక్సర్లు) చెలరేగడంతో చెన్నై భారీస్కోర్ దిశగా పయనించింది. వీరిద్దరూ క్రీజ్‌లో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్ ప్లే 6 ఓవర్లలోనే చెన్నై 49 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత వీరు మరింత ధాటిగా ఉడడంతో చెన్నై 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. వీరిద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నాక మొయిన్ అలీ తొలుత ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు మొయిన్-డుప్లెసిస్(108పరుగులు) సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సురేశ్ రైనా(2) నిరాశపర్చినా.. చివర్లో అంబటి రాయుడు(72నాటౌట్; 27బంతుల్లో.. 4ఫోర్లు, 7సిక్సర్లు) శివాలెత్తాడు. బుమ్రా, కులకర్ణి, బౌల్ట్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా(22నాటౌట్; 22బంతుల్లో.. 2ఫోర్లు) ఉన్నా.. రాయుడు బ్యాటింగ్‌కు అలరించాడు. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసి కెరీర్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని ఐపిఎల్‌లో నమోదు చేశాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 218పరుగులు భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్‌కు రెండు, బుమ్రా, బౌల్ట్‌లకు చెరో వికెట్ దక్కాయి.
అనంతరం ముంబయి ఓపెనర్లు డికాక్(38), రోహిత్(35) కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సూర్యకుమార్(5) నిరాశపర్చినా.. కృనాల్-పొలార్డ్ కలిసి నాల్గో వికెట్‌కు 89 పరుగులు జతచేసి మ్యాచ్ స్వరూపం మార్చేశారు. పొలార్డ్ కేవలం 17 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ బాదిన రికార్డు (పృధ్వీ షా 18 బంతుల్లో) పొలార్డ్ అధిగమించాడు. ఆఖరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన దశలో శార్దూల్ వేసిన 18వ ఓవర్లో 17 పరుగులు, శామ్ కర్రన్ వేసిన 19వ ఓవర్లో 15 పరుగులు ముంబయి రాబట్టింది. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేసి పొలార్డ్ మ్యాచ్‌ను ముగించాడు.
స్కోర్‌బోర్డు..
చెన్నై సూపర్‌కింగ్స్: గైక్వాడ్ (సి)హార్దిక్ (బి)బౌల్ట్ 4, డుప్లెసిస్ (సి)బుమ్రా (బి)పొలార్డ్ 50, మొయిన్ అలీ (సి)డికాక్ (బి)బుమ్రా 58, సురేశ్ రైనా (సి)కృనాల్ (బి)పొలార్డ్ 2, రాయుడు (నాటౌట్) 72, జడేజా (నాటౌట్) 22, అదనం 10. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 218 పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/112, 3/116, 4/116.
బౌలింగ్: బౌల్ట్ 4-0-42-1, ధవల్ కులకర్ణి 4-0-48-0, బుమ్రా 4-0-56-1, రాహుల్ చాహర్ 4-0-32-0, నీషమ్ 2-0-26-0, పొలార్డ్ 2-0-12-2.
ముంబయి ఇన్నింగ్స్: డికాక్ (సి అండ్ బి) మొయిన్ 38, రోహిత్ (సి)గైక్వాడ్ (బి)శార్దూల్ 35, సూర్యకుమార్ (సి)ధోనీ (బి)జడేజా 3, కృనాల్ (ఎల్బి) శామ్ కర్రన్ 32, పొలార్డ్ (నాటౌట్) 87, హార్దిక్ (సి)డుప్లెసిస్ (బి)శామ్ కర్రన్ 16, నీషమ్ (సి)శార్దూల్ (బి)శామ్ కర్రన్ 0, కులకర్ణి (నాటౌట్) 0, అదనం 8. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 219 పరుగులు.
వికెట్ల పతనం: 1/71, 2/77, 3/81, 4/170, 5/202, 6/203
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-37-0, శామ్ కర్రన్ 4-0-34-3, ఎన్గిడి 4-0-62-0, శార్దూల్ 4-0-56-1, జడేజా 3-0-29-1, మొయిన్ 1-0-1-1.