Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టి20 వరల్డ్‌కప్‌పైనా నీలి నీడలు
-విదేశీ ఆటగాళ్ల చేరవేతలో బిసిసిఐ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) నిరవధికంగా వాయిదాపడింది. కోవిడ్-19 కారణంగా సీజన్-14 ఐపిఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. రోజు రోజుకు ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిసిసిఐ పేర్కొంది. దీంతో మంగళవారం ముంబయి ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అలాగే భారత్ వేదికగా అక్టోబర్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌పై నీలి నీడలు కమ్ముకొన్నాయి. భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ విజృంభించడంతో టి20 టోర్నీ కోసం బిసిసిఐ ప్రత్యామ్నాయ వేదికగా యుఏఇని ఎంచుకోక తప్పదని తెలుస్తోంది.
విదేశీ ఆటగాళ్ళను వెనక్కి పంపే పనిపై దృష్టి: ఐపిఎల్ ఛైర్మన్
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు నిషేధం విధించిన నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను వెనక్కి పంపే పనిపై బిసిసిఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐపిఎల్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం ఆయా ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపారు. ఆంక్షల నేపథ్యంలో.. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నటు తెలిసింది. ఆండ్రూ టై, రిచర్డ్సన్, జంపా ఈ సీజన్‌నుంచి ఇప్పటికే తప్పుకోగా.. తాజాగా ఐపిఎల్ నిరవధికంగా వాయిదాపడడంతో మిగిలిన ఆటగాళ్లను ఎలా తిరిగి వెనక్కి పంపాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా ప్రధాని స్పందిస్తూ... ఆటగాళ్లకోసం ప్రత్యేక వసతులేమీ కల్పించలేమనీ, వారంతా వ్యక్తిగతంగానే భారత్‌కు వెళ్లారని అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఆటగాళ్లను క్షేమంగా తిరిగి పంపే విషయమై ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో బిసిసిఐ ప్రస్తుతం సంప్రదింపులు మొదలుపెట్టింది.