Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి విశ్వరూపం చూపిస్తోంది. వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. వీళ్ళలో చాలా మంది కేవలం భయంతోనే తుదిశ్వాస విడవటం బాధాకరం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని అంటోంది కథానాయిక అనుష్క.
'ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి తీసుకురాలేం. అయితే కరోనా మహమ్మారికి మరొకరు బలి కాకుండా జాగ్రత్త పడటం మన చేతుల్లోనే ఉంది. దీని కోసం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. దీని నుంచి బయట పడాలంటే అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకే ప్రయత్నించండి. మీకు మీరే స్వీయ నిర్బంధం విధించుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ సమయాన్ని గడపండి. ప్రతీ ఒక్కరికీ వారి బాధలను ఎలా వ్యక్త పరచాలో తెలియక పోవచ్చు. ఎక్కువగా ఆలోచించ కుండా ప్రశాంతంగా ఉండండి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఇలాంటి సమయంలో మనకు పాజిటివ్ ఎనర్జీ అవసరం. కష్టంలో ఉన్నవారిని ఆదుకోండి. వారి గురించి ప్రార్థనలు చేయండి. ఈ కష్టకాలాన్ని మనం అధిగమిస్తాం. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు' అంటూ అనుష్క ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ లెటర్ని పోస్ట్ చేశారు.