Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంబో జట్టుతో కోహ్లి సేన
ముంబయి: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడేందుకు బిసిసిఐ జంబోజట్టును ప్రకటించనుంది. చేతన్‌శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24మందితో జట్టు ప్రకటించనుంది. ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బోర్డుకు సమర్పించగా.. వచ్చే వారం చివర్లో తుది జట్టుపై బిసిసిఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం భారత్ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో టీమిండియాను ప్రత్యేక విమానంలో బిసిసిఐ ఇంగ్లండ్‌కు పంపించనుంది. అక్కడ పది రోజుల క్వారంటైన్ అనంతరం జూన్ 18 నుంచి 22వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసిసి ప్రపంచకప్ ఫైనల్ ఆడతారు. ఇక జూన్ 2న ఆరంభమయ్యే ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ 20మందితో కూడిన జట్టును, ఆ తర్వాత టీమిండియాతో ప్రపంచ టెస్టు సిరీస్ ఫైనల్ ఆడే 15మందితో జట్టును ఎంపిక చేయనున్నారు.
భారత ఆటగాళ్లతోనే కివీస్ జట్టూ..
ఐపిఎల్ వాయిదా పడడంతో ఢిల్లీలోనే ఉన్న కివీస్ ఆటగాళ్లలో కొంతమంది నేరుగా భారత ఆటగాళ్లతో కలిసి ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. కివీస్ బోర్డు ప్రకటించే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఇటు నుంచి ఇటే ఇంగ్లండ్‌కు వెళ్లనుండగా.. మిగిలిన ఆటగాళ్లు శుక్రవారం స్వదేశానికి వెళ్లనున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ డేవిడ్ వైట్ తెలిపారు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్, జెమీసన్, మిచెల్ సాంట్నర్‌తో పాటు ఫిజియో టామీ సిమ్సెక్ కొన్ని రోజులు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సురక్షితమైన మినీ బబుల్‌లో ఉంటారని బోర్డు వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు చార్టెర్డ్ ఫ్లైట్‌లో న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. జూన్ మొదటి వారంలో మిగతా కివీస్ ఆటగాళ్లతో కలిసి ఇంగ్లండ్ చేరుకుంటాడు.