Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వాయిదా పడ్డ సీజన్-14 ఐపిఎల్ మిగతా మ్యాచ్‌లు జరిగే అవకాశమే లేదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆటగాళ్లను వెనక్కి తీసుకొచ్చి 14రోజుల క్వారంటైన్ ఏర్పాటు చేయడం కష్టంతో కూడుకున్నదని, మిగిలిన 31 ఐపిఎల్ మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించడం జరిగే పని కాదన్నాడు. అన్ని బోర్డులతో సంప్రదించి ఐపిఎల్ మిగతా సీజన్ గురించి ఆలోచిస్తామని వెల్లడించారు. ఇక లీగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. తగిన విండో కోసం ప్రయత్నించాలని గంగూలీ అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ మిగిలిన సీజన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు చాలా దేశాలు, క్రికెట్ సంఘాలు ముందుకొస్తున్నాయని ఈ సందర్భంగా గంగూలీ గుర్తుచేశారు. ఇంగ్లండ్ క్లబ్‌లు వార్విక్ షైర్, సర్రేతోపాటు ఆస్ట్రేలియాలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి), శ్రీలంక, యుఏఇ తమ వద్ద నిర్వహించాలని తమకు ప్రతిపాదనలు పంపాయన్నారు. అయితే బోర్డు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉందని, ముంబయి, చెన్నై వేదికల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు సవ్యంగానే సాగాయని, ఎప్పుడైతే ఢిల్లీ, అహ్మదాబాద్‌కు ఆటగాళ్లను తరలించామో బయో బుడగ అప్పుడు బలహీన పడిందన్నాడు. ప్రయాణాలు, ఇతర కారణాలవల్ల ఆటగాళ్లకు వైరస్ సోకి ఉండవచ్చని ఈ సందర్భంగా గంగూలీ గుర్తుచేశాడు.
తొలి డోస్ వేయించుకున్న విరాట్, ఇషాంత్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ సోమవారం కరోనా తొలి డోస్‌ను వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కోహ్లి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్ త్వరగా వేయించుకోవాలని సూచించాడు. ఇక ఇషాంత్.. ప్రతి ఒక్కరు తప్పక కరోనా డోస్ తీసుకోవాలని, సేవచేస్తున్న ప్రతిఒక్క సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీమిండియా ఆటగాళ్లంతా కరోనా వైరస్ తొలి డోస్‌ను ఇక్కడే వేయించుకోవాల్సి ఉంది. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానే, పేసర్ ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, రవిశాస్త్రి తొలిడోస్‌ను వేయించుకున్న సంగతి తెలిసిందే.