Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్, హార్దిక్ పోటీ
- హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
- అందుబాటులో ఉండని శ్రేయస్
న్యూఢిల్లీ: లంక టూర్‌కు వెళ్ళే భారతజట్టు కెప్టెన్సీ రేసులో శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నారు. టీమిండియా ఆటగాళ్ల ఓ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే మరోజట్టు శ్రీలంక టూర్‌కు బయల్దేరేందుకు బిసిసిఐ షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు జంబోజట్టును బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. ఆ పర్యటనలో చోటు దక్కని ఆటగాళ్లను లంక టూర్‌కు పంపేందుకు బిసిసిఐ మరో జట్టును సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో లంక టూర్‌కు కెప్టెన్సీ రేసులో ధావన్, హార్ధిక్ ఉండగా.. యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంనుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఆ టూర్‌కు అందుబాటులో ఉండడని బిసిసిఐ మంగళవారం స్పష్టం చేసింది. ఈ టూర్లో టీమిండియా.. శ్రీలంకతో మూడేసి వన్డే, టి20ల సిరీస్ ఆడనుంది. ఇక లంక పర్యటనకు వెళ్ళే జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను పంపాలని బిసిసిఐ యోచిస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సిఏ)కి రాహుల్ ద్రావిడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. శిఖర్ ధావన్‌తో పాటు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైని, ఖలీల్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు లంక టూర్ తుదిజట్టులో చోటు దక్కే అవకాశముంది. భారతజట్టు జులై 5న కొలంబో చేరుకొని వారం రోజులు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
శ్రేయస్ దూరం
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ శ్రీలంక టూర్‌కు దూరమయ్యాడు. టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులేనప్పుడు మూడో ప్రత్యామ్నాయ కెప్టెన్‌గా శ్రేయస్ భారతజట్టుకు కొనసాగాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ తీవ్రంగా గాయపడి ఏప్రిల్ 8న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం బ్యాట్ పట్టనున్నాడు. తాజాగా శ్రేయస్ లంక టూర్‌కు దూరమైనట్లు బిసిసిఐ మంగళవారం ప్రకటించింది.