Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దు చేయాలంటున్న టోక్యో డాక్టర్లు
టోక్యో: ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ టోక్యో డాక్టర్లూ మంగళవారం పిలుపునిచ్చారు. జపాన్‌లోని అన్ని నగరాల్లో కరోనా వైరస్ ఉధృతంగా ఉందని, ఆసుపత్రులన్నీ వైరస్ రోగులతో కిటకిటలాడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించడంతో అంత మంచిది కాదని టోక్యో మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. టోక్యో నగరంలోని 6వేలమంది వైద్యసిబ్బంది ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్నారని, ప్రస్తుతం ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీగా లేవని, టోక్యోలో మే 31వరకు ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని ఈ సందర్భంగా వైద్య నిపుణులు గుర్తుచేశారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లలో ఎవరైనా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని, ఆరోగ్య నిపుణుల్లో 80%మంది ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ సంతకాలు చేశారని వారు తెలిపారు. జపాన్‌లో కేవలం 3.5%మందికి మాత్రమే కరోనా టీకాలు వేయడం జరిగిందని, టోక్యో, ఒసాకాలో టీకాలు వేసేందుకు నేటినుంచి ఆన్లైన్ సైట్లను తెరచినా.. అవి సాంకేతిక సమస్యతో మొరాయించాయన్నారు. ఈ క్రమంలో ప్రధాని యోషిహిడే సుగేను ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖ రాయమని కోరనున్నట్లు వారు తెలిపారు.
ఒలింపిక్స్ జరుగుతాయి: స్పాన్సర్
రీ షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరిగి తీరుతాయని టోక్యో ఒలింపిక్స్ స్పాన్సర్ స్వఛ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హయాక్ తెలిపారు. ఒలింపిక్స్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఒమేగా బ్రాండ్ హక్కులను దక్కించుకుంది. స్విస్ న్యూస్ పేపర్ మంగళవారం ప్రచురించిన కథనంలో ఒలింపిక్స్ సజావుగానే సాగుతాయని తెలపడం విశేషం.
ఒలింపిక్స్ జెర్సీలను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా
ఒలింపిక్స్‌పై రకరకాల పుకార్లు వస్తున్నా.. మరోవైపు ఆస్ట్రేలియా ప్రారంభోత్సవ వేడుకల్లో అథ్లెట్లు ధరించే జెర్సీలను మంగళవారం విడుదల చేసింది. ఆసీస్ క్రీడాకారులు టామీ స్టెప్టో(సాఫ్ట్‌బాల్(ఎడమ), సఫ్వాన్ ఖలీల్(తైక్వాండో) ఆటగాళ్లు ధరించిన జెర్సీల ఫొటోను ట్వీట్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు జులై 23న జరగాల్సి ఉండగా.. కోవిడ్ దృష్ట్యా అథ్లెట్లంతా రెండు వారాల ముందే టోక్యోకు చేరుకోవాల్సి ఉంది.