Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధం
- ఆర్థిక నష్టంపై ఐఓసీ, జపాన్ మంతనాలు
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. విశ్వ క్రీడా సంరంభానికి మరో పది వారాల గడువే మిగిలింది. ప్రపంచ కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న తరుణంలో ఒలింపిక్స్ నిర్వహణపై అన్ని వర్గాల్లోనూ భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా ప్రమాదం మరింత ముదురుతుండగా.. తమ దేశంలో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై వైద్యుల సంఘం, ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలను గమనంలో ఉంచుకున్న ఐఓసీ, జపాన్‌లు క్రీడల నిర్వహణపై తగు నిర్ణయం తీసుకుంటాయా? అప్పుడు అసలు ఆడాలా? వద్దా? అనేది తేలుతుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
2021, జులై 23. వాయిదా పడిన 2020 ఒలింపిక్స్ ఆరంభం కావాల్సిన తేది. నాలుగేండ్లకు ఓసారి నిర్వహించే విశ్వ క్రీడలకు కౌంట్‌డౌన్ పది వారాలే. అయినా, క్రీడల నిర్వహణపై అటు అధికారుల్లో, ఇటు క్రీడాకారుల్లో ఎటువంటి స్పష్టత లేదు. కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతున్నా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) క్రీడల నిర్వహణ పట్ల పట్టుదలగా కనిపిస్తోంది. ఒలింపిక్స్ ఆతిథ్య దేశం జపాన్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓ వైపు ఆర్థిక నష్టం, మరోవైపు ప్రజల భయాందోళనలు జపాన్ను డైలామాలో పడేశాయి. ఒలింపిక్స్‌కు గడువు ముంచుకొస్తున్న వేళ.. అటు క్రీడాకారుల్లో, ఇటు జాతీయ ఒలింపిక్ సంఘాల్లో మెగా ఈవెంట్ నిర్వహణపై స్పష్టత లేకుండాపోయింది. విశ్వ క్రీడలపై సర్వత్రా అమోమయ పరిస్థితిని తొలగించే బాధ్యత ఐఓసీ, జపాన్లపై నెలకొంది.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత :
షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సుమారు 80 శాతం మంది ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకత చూపారు. జపాన్ వైద్యుల సంఘం ఏకంగా ఆ దేశ ప్రధానికి లేఖ రాసింది. విపత్కర పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణ దిశగా ముందడుగు వేయకూడదని ప్రధానికి సూచించింది. సుమారు 6000 మందితో కూడిన వైద్యుల సంఘం లేఖ అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా వైరస్‌కు దీర్ఘకాలిక విరుగుడు వ్యాక్సినేషన్లోనూ జపాన్ వెనుకంజలోనే నిలిచింది. దేశవ్యాప్తంగా 2 శాతం జనాభాకు కూడా అక్కడ టీకాలు వేయలేదు. మరో ఏడాది పాటు వాయిదా వేయాలనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నా.. ఈ సారి వాయిదా అంటూ పడితే ఇక తదుపరి ఒలింపిక్స్ పారిస్‌లోనే అనే విషయం చెప్పనక్కర్లేదు.
కొత్త రకాలపై ఆందోళన :
ఒలింపిక్స్ నిర్వహణతో జపాన్‌లో కరోనా వైరస్ కొత్త రకాల విజృంభణపై ఆందోళన కనిపిస్తోంది. సుమారు 200 దేశాల నుంచి 15000 మంది అథ్లెట్లు, అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు. వంద మందితో కూడిన లీగ్‌ల నిర్వహణే ఇప్పుడు కష్టతరం. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లు బయో బబుల్ వైఫల్యంతో వాయిదా పడిన ఉదంతాలు తెలిసినవే. బయో బబుల్స్‌లో, ఖాళీ స్టేడియాల్లో, విదేశీ, స్వదేశీ ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆలోచన ఉంది. 15 వేల మంది విదేశీయులు దేశంలో కొత్త రకం వైరస్ల వ్యాప్తికి కారణం అవుతారనే ఆందోళన ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇదే విషయం ఇటీవల సర్వేల్లోనూ వెల్లడైంది. క్రీడాకారులు సైతం క్రీడలు ఆడతామా? లేదా ? అనే ఆందోళనలోనే ఉన్నారు. చాలా మంది క్రీడాకారులు అర్హత టోర్నీల్లో ఆడలేకపోయారు. గడువు పూర్తయ్యేలోపు ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ప్రజల వ్యతిరేకతను విస్మరించి ఒలింపిక్స్ నిర్వహించినా.. క్రీడాకారులకు చిరస్మరణీయ ఈవెంట్‌ను అందించలేరు. వైరస్‌పై మానవాళి పైచేయి సాధించిన విజయానికి చిహ్నంగా టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని చెబుతున్నా... ఇప్పటికీ వైరస్‌తో వార్ కొనసాగుతూనే ఉంది.
ఆర్థిక భారంపై ఆలోచన :
2020 ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ భారీ బడ్జెట్ కేటాయించింది. ఏకంగా రూ. లక్ష కోట్లకు మించి ఖర్చు చేసింది. స్టేడియాల నిర్మాణం, ఒలింపిక్ గ్రామం నిర్మాణం, నూతన వేదికల ఏర్పాటు సహా ఇతర సదుపాయాలు, మౌళిక వసతుల కల్పన కోసం భారీ యెత్తున డబ్బు పెట్టింది. ఒలింపిక్ గ్రామంలో నిర్మించిన అపార్ట్మెంట్లను క్రీడల నిర్వహణ అనంతరం ప్రజలకు అప్పగించేందుకు ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. ఏడాది వాయిదా పడటంతో అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన వారి నుంచి ఒలింపిక్ నిర్వహణ కమిటీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఒలింపిక్స్ అనగానే కార్పోరేట్ మార్కెట్‌తో ముడిపడిన అంశం. ఇప్పుడు ఒలింపిక్స్ వాయిదా పడినా, రద్దు చేసినా ఆర్థికంగా జపాన్ పెను భారాన్ని మోయాల్సి వస్తోంది. అందుకే జపాన్ గత ఏడాది నుంచి రద్దు అనే ఆలోచనకు చోటు ఇవ్వటం లేదు.
రద్దు అధికారం ఎవరిది? :
ఒలింపిక్స్ క్రీడల ఒప్పందం ప్రకారం మెగా ఈవెంట్‌ను రద్దు చేసే అధికారం కేవలం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికే ఉంటుంది. 1916, 1940, 1944 ఒలింపిక్స్‌లను ప్రపంచ యుద్దాల కారణంగా ఐఓసీ రద్దు చేసింది. ఇప్పుడూ ప్రపంచం యుద్ధ వాతావరణంలోనే ఉంది. ప్రాణాంతక వైరస్‌తో ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ కారణంతో ఐఓసీ ఒలింపిక్స్‌ను రద్దు చేయవచ్చు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల భద్రతకు ముప్పు ఉందని భావిస్తే ఐఓసీ ఏ సమయంలోనైనా ఒలింపిక్స్‌ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. భాగస్వాములు, స్పాన్సర్లు, కార్పోరేట్ మార్కెట్ దృష్ట్యా ఐఓసీ రద్దు నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతోంది!. జపాన్, ఐఓసీ సంయుక్తంగా రద్దు నిర్ణయానికి వస్తే క్రీడల నిర్వహణకు బీమా పాలసీ లబ్ది పొందవచ్చు. రోజు రోజుకూ క్రీడల నిర్వహణకు అనుకూల, వ్యతిరేక వర్గాల చర్చ గణనీయంగా పెరుగుతోంది. ఐఓసీ చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.