Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒసాక నగరంలో కోవిడ్ విశ్వరూపం
- టోక్యో ఒలింపిక్స్ రద్దు కోసం ప్రజల పట్టు
మరో తొమ్మిది వారాల్లో విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన దేశం అది. సుమారు 200 దేశాలకు చెందిన 15000 మంది అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వబోనున్న నగరానికి ఆమడ దూరంలో ఉన్న నగరం అది!. జపాన్‌లో మూడో అతిపెద్ద నగరం ఒసాక ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడింది. హాస్పిటల్లో పడకలు దొరక్క కోవిడ్ రోగులు అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అతి త్వరలోనే ఒలింపిక్స్ ఆతిథ్య నగరం టోక్యోలోనూ కోవిడ్ విశ్వరూపం చూపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
నవతెలంగాణ-టోక్యో
2020 టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ పనుల్లో అధికారులు నిమగం కాగా.. జపాన్ ఆరోగ్య సంక్షోభంలో కూరుకునే ప్రమాదం దిశగా పయనిస్తోంది. జపాన్‌లో కోవిడ్ సంక్షోభానికి నిదర్శనం ఒసాక నగరంలో కోవిడ్ రోగుల ఆర్తనాదాలే. గత కొన్ని రోజులుగా కోవిడ్-19 కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. దీంతో ఒసాక నగరంలో äస్పిటల్ పడకలు దొరకటం లేదు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన రోగులు హాస్పిటల్ పడకల కోసం గంటల కొద్ది నిరీక్షిస్తున్నా.. బెడ్ లభించని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో కోవిడ్ కొత్త కేసుల నమోదు నూతన రికార్డు సృష్టించనుందనే అంచనాలతో.. వైద్య సిబ్బందిపై అపార భారం పడనుంది. కోవిడ్ రోగుల తాకిడితో ఇప్పటికే జపాన్ వైద్య రంగంపై విపరీతమైన ఒత్తిడి, భారం పడింది. ' ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మా విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్నామని' ఓ వైద్యుడు తెలిపాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.
జపాన్ కింకర్తవ్యం :
రూ. లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్వహించ తలపెట్టిన ఒలింపిక్స్‌ను వాయిదా లేదా రద్దు చేసేందుకు జపాన్ ప్రభుత్వం వెనుకాడుతోంది. ఓ వైపు ప్రజారోగ్యం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం జపాన్ను కలవర పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించే వాతావరణం లేదని స్థానికులు చెబుతున్నా.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ), టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీలు షెడ్యూల్ ప్రకారమే క్రీడలు నిర్వహిస్తామని పదేపదే చెబుతున్నాయి. ఐఓసీ సమ్మతి లేకుండా జపాన్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒలింపిక్స్ నిర్వహణపై చేతులెత్తేస్తే.. అప్పుడు జపాన్ ఒలింపిక్ సంఘంపైనే ఆర్థిక భారం పడుతుంది. ఐఓసీతో సంయుక్తంగా రద్దు లేదా వాయిదా ప్రకటన చేస్తేనే జపాన్ ప్రభుత్వం ఆర్థిక భారం కొంచమైనా తగ్గుతుంది. ఆ దిశగా జపాన్ ప్రభుత్వం ఐఓసీతో చర్చలు జరపటం మంచిది.
ఒలింపిక్స్ వద్దు :
ఒలింపిక్స్ నిర్వహణ పట్ల జపాన్‌లో రోజురోజుకు వ్యతిరేకత రెట్టింపు అవుతోంది. వ్యాపార వర్గాల్లో నిర్వహించిన ఓ కార్పోరేట్ సర్వేలో అత్యధికులు ఒలింపిక్స్ రద్దు లేదా వాయిదా వేయాలని కోరారు. ఈ నెల 6-17న నిర్వహించిన ఈ సర్వేలో 37 శాతం కంపెనీలు ఒలింపిక్స్ రద్దు కోరగా.. 32 శాతం కంపెనీలు వాయిదా వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే తరహా సర్వే ఫిబ్రవరిలో నిర్వహించగా రద్దు చేయాలని 29 శాతం మందే కోరారు. ఇప్పుడు అది 36 శాతానికి చేరుకుంది. ' ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఎటువంటి ఆస్కారం లేదు' అని ఓ కంపెనీ మేనేజర్ అనగా.. ' ప్రభుత్వం ఏదీ ప్రణాళిక ప్రకారం చేయటం లేదు. ప్రస్తుతం అంతా ప్రజల్లో ఆందోళన పెంచేందుకు చేసేందుకు ప్లాన్ చేసినట్టు ఉంది' అని మరోకరు వెల్లడించారు. ' విభిన్న కోవిడ్ రకాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. భయానక పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది' అని ఓ యోగా టీచర్ చెప్పాడు. రద్దు లేదా వాయిదా ఫలితం ఆర్థిక నష్టం అపారంగా ఉంటుందనే అంచనాలను వ్యాపార వర్గాలు అంతగా పట్టించుకోవటం లేదు!. ఆర్థిక నష్టం పరిమితంగానే ఉంటుందని 60 శాతం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఆర్థిక నష్టం చాలా తక్కువ అని 13 శాతం కంపెనీలు భావిస్తున్నాయి.
భద్రతకు హామీ ఇవ్వండి :
ఎట్టకేలకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై పునరాలోచన చేసింది. షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు మెగా ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్య భద్రతకు, సురక్షిత వాతావరణంలో విశ్వ క్రీడలను నిర్వహిస్తారనే భరోసాను మళ్లీ ఇవ్వాలని జపాన్ ప్రభుత్వాన్ని ఐఓసీ కోరింది. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కమిటీకి లేఖ రాశారు. మూడు రోజుల పాటు సమావేశమైన ఐఓసీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారితో జపాన్ అతలాకుతలం అవుతోన్న నేపథ్యంలో ఐఓసీకి జపాన్ ప్రభుత్వం ఇచ్చే స్పందనపై ఇప్పుడు 2020 ఒలింపిక్స్ నిర్వహణ ఆధారపడి ఉంది.