Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల జట్టు మాజీ కోచ్ డబ్లూవీ రామన్
చెన్నై : సుదీర్ఘ విరామం అనంతరం భారత మహిళల జట్టు ఐదు రోజుల ఆట ఆడనుంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో ఓ టెస్టు మ్యాచ్ ఆడనున్న మిథాలీరాజ్ సేన.. ఆస్ట్రేలియాతో డే నైట్ గులాబీ టెస్టు మ్యాచ్ పోరులో తలపడనుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మహిళల క్రికెట్‌ను పక్కనపెట్టిన బీసీసీఐ.. ఒకే క్యాలెండర్లో రెండు టెస్టులు ఏర్పాటు చేయటం విమర్శకుల మెప్పు పొందింది. మహిళల జట్టు మరిన్ని టెస్టులు ఆడటంతోనే ఉపయోగం ఉంటుందని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
' వీలైనన్న ఎక్కువ టెస్టులు ఆడటంతో మహిళల క్రికెటర్లు రాటుదేలుతారు. టెస్టుల్లో ఆడటం ద్వారా మెరుగుపడితే.. మరింత ఉన్నత విజయాలు సాధిస్తారు. రెగ్యులర్‌గా టెస్టు మ్యాచులు ఆడితే అన్ని కోణాల్లోనూ క్రికెటర్లు పరీక్షించబడతారు. టెస్టు ఫార్మాట్‌తో క్రికెటర్ల ఫిట్నెస్ గణనీయంగా మెరుగుపడుతుంది. టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెడితే.. అమ్మాయిలు ఐదు రోజుల ఫార్మాట్‌ను ఆస్వాదించటం ఆరంభిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో బోర్డులు మహిళలకు టెస్టులను నిర్వహించలేరు. మూడు నాలుగు బోర్డులతోనే అది సాధ్యపడుతుంది. కమర్షియల్ కోణంలోనూ ఆలోచన చేయాలి. టెస్టు క్రికెట్ ఆడేందుకు అమ్మాయిలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వారికి వీలైనన్ని టెస్టులు షెడ్యూల్ చేయాలి' అని డబ్లూవీ రామన్ అన్నాడు. దక్షిణాఫ్రికాకు వన్డే, టీ20 పరాజయాల అనంతరం భారత మహిళల జట్టు కోచ్ పదవిని రమేశ్ పొవార్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే.