Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నుంచి కోలుకున్న వికెట్ కీపర్
కోల్‌కత : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 అర్థాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ లీగ్ ఆగిపోయింది. ఆ అనుభవం దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ను మెరుగ్గా నిర్వహించేందుకు బీసీసీఐ పక్కా ప్రణాళిక రచించింది. స్థిరంగా ఓ బయో బబుల్‌లో ఆటగాళ్లు క్షేమంగానే ఉన్నప్పటికీ.. నగరాల మధ్య విమాన ప్రయాణం ఆటగాళ్ల భద్రతను గాల్లో దీపం చేసింది!. 2020 ఐపీఎల్‌ను బయో బుడగలో విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ.. స్వదేశంలో 14వ సీజన్‌ను ఆశించిన సమర్థవంతంగా నిర్వహించటంలో విఫలమైంది. ఇదే విషయాన్ని భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా సైతం ఎత్తిచూపాడు.
'ఐపీఎల్ 2021ను యుఏఈలో నిర్వహిస్తే బాగుండేది. ఏం జరిగేదో ఏమో చెప్పలేను కానీ.. అక్కడ లీగ్ సురక్షితమని నా భావన. నిర్వాహకులు ఈ విషయాన్ని పరిశీలించాల్సింది. కోవిడ్-19 నుంచి కోలుకుని బాగున్నాను. అలసట, ఒళ్లునొప్పులు, నీరసం అంటూ ఏమీ లేవు. మ్యాచ్ ట్రైనింగ్‌లో నా శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి' అని సాహా అన్నాడు. ' గత ఏడాది యుఏఈలో ప్రాక్టీస్ సెషన్లలో సైతం ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. మైదాన సిబ్బంది సైతం దగ్గరగా వచ్చేవారు కాదు. ఇక్కడ దగ్గర్లోని గోడల మీద నుంచి జనాలు చూసేవారు. దీనిపై పెద్దగా మాట్లాడాలని అనుకోవటం లేదు. గత సీజన్ యుఏఈలో ఎంత బాగా జరిగిందో చూశాం. ఈ ఏడాది ఇక్కడ కేసులు పెరుగుతున్న దశలో లీగ్ ఆరంభమైంది' అని సాహా అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వృద్దిమాన్ సాహా ఈ ఏడాది లీగ్‌లో కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.