Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్
ముంబయి : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి ఫైనల్లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. టెస్టు ఫార్మాట్లో వరల్డ్‌కప్‌గా పరిగణిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్ జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఇప్పటివరకు ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల్లో అనుసరించిన నిబంధనలనే.. డబ్ల్యూటీసీ లీగ్ టెస్టుల్లోనూ అనుసరించారు. సాధారణంగా టెస్టుల్లో ఫలితం తేలుతుందనే గ్యారంటీ ఉండదు. వాతావరణం అనుకూలించకపోతే.. అసలు మ్యాచ్ ఆరంభం అవుతుందనే నమ్మకం కూడా ఉండదు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ డ్రా, టై, లేదా వర్షార్పణం అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మదిని తొలుస్తుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్ రూల్స్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
'ప్రపంచ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్ మరో ద్వైపాక్షిక సిరీస్ వంటిది కాదు. అంతిమ సమరం ప్లేయింగ్ కండిషన్స్ గురించి తెలియాల్సి ఉంది. ప్రధానంగా మూడు మౌళిక అంశాలను తేల్చాల్సి ఉంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీ త్వరలోనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ ఫైనల్స్ ప్లేయింగ్ కండిషన్స్‌ను విడుదల చేయనుంది. ఫైనల్ మ్యాచ్ డ్రా, టై, రద్దు అయితే విజేతగా ఏ విధంగా తేల్చుతారనే అంశంపై ఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ ఫైనల్లో పోటీపడేందుకు భారత జట్టు జూన్ తొలి వారంలో ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. లండన్ నుంచి కోహ్లిసేన నేరుగా సౌథాంప్టన్ చేరుకుని అక్కడే క్వారంటైన్లో గడపనున్నారు.