Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెజ్లర్ సుశీల్ అరెస్ట్‌పై క్రీడాకారులు
న్యూఢిల్లీ : భారత దిగ్గజ రెజ్లర్. ఒలింపిక్ పతకాలు అందించిన ధీరుడు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు కొల్లగొట్టిన మల్లయోధుడు. అతడే సుశీల్ కుమార్. అద్వితీయ విజయాలతో మువ్వెన్నల జెండాను భుజాలపై మోస్తూ కనిపించిన సుశీల్ కుమార్.. ముఖానికి టవల్ చుట్టుకుని పోలీసుల అదుపులో ఉండటంతో భారత క్రీడాలోకం నివ్వెరపోయింది. ఇదంతా ప్రపంచ రెజ్లింగ్ దినోత్సవం నాడే చోటుచేసుకోవటం విచిత్రం. 23 ఏండ్ల యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో సుశీల్ కుమార్ ప్రధాన నిందితుడు. సుశీల్ కోసం ఢిల్లీ పోలీసులు గత కొన్నిరోజులుగా ముమ్మరంగా గాలించారు. ఆచూకి తెలిపినవారికి భారీ నజరానా సైతం ప్రకటించారు. భారత అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడైన సుశీల్ కుమార్ అరెస్ట్ పట్ల క్రీడాకారులు ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ఉన్నారు.
'భారత క్రీడారంగానికి సుశీల్ కుమార్ చేసిన ఘనతను ఎవరూ అతడి నుంచి దూరం చేయలేరు. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇదే. కేసుపై తొలుత స్పష్టత రావాలి. దీనిపై కామెంట్ చేయదలచుకోవటం లేదు' అని దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. సుశీల్ కుమార్‌తో కలిసి విజేందర్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ' భారత అత్యుత్తమ క్రీడాకారుల్లో సుశీల్ ఒకరు. ప్రజలు అతడిని చూసి స్ఫూర్తి పొందుతారు. ఆ ఘటనలో సుశీల్ నిజంగానే భాగస్వామి అయితే అది రెజ్లింగ్‌తో పాటు ఇతర క్రీడలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది' అని టేబుల్ టెన్నిస్ ఆటగాడు అచంట శరత్ కమల్ అన్నాడు.