Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ ప్రైజ్‌మనీ అందుకోని అమ్మాయిలు
- ఏడాదిగా నాన్చుతున్న భారత క్రికెట్ బోర్డు
- కరోనా కష్టకాలంలోనూ కనికరించని గంగూలీ
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఐసీసీ ఆదాయంలో సింహభాగం వాటా అనుభవిస్తున్న క్రికెట్ బోర్డు. అయితేనేం.. అమ్మాయిలకు దక్కాల్సిన నగదు ప్రోత్సాహకాన్ని సైతం ఏడాది కాలంగా తొక్కిపెడుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2020 ముగిసిన వెంటనే నగదు బహుమతిని ఐసీసీ నుంచి అందుకున్న బీసీసీఐ.. మహిళా క్రికెటర్లకు పంచటంలో మాత్రం తాత్సారం చేస్తోంది. నిబంధనలకు విరుద్దమైనా అమ్మాయిలకు నగదు ఇచ్చేందుకు సుముఖంగా లేదు!.
ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐకి సిగ్గుచేటు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి అంచనాలను అందుకోవటంలో నానాటికీ విఫలమవుతోంది. కరోనా కష్టకాలంలో దేశవాళీ క్రికెటర్లను ఆదుకునేందుకు ముందుకు రాని బీసీసీఐ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకున్న అమ్మాయిలకు దక్కాల్సిన ప్రైజ్‌మనీని బీసీసీఐ ఏడాదిగా తొక్కిపెడుతోంది. ఇటీవల మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మూడు కేటగిరీల్లో వార్షిక కాంట్రాక్టులు అందించిన బీసీసీఐ.. పురుష క్రికెటర్లతో పోల్చితే అమ్మాయిలకు మరీ అన్యాయంగా వేతనాలు ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో టాప్ గ్రేడ్ క్రికెటర్లకు రూ. 7 కోట్లు ఇవ్వనున్న బీసీసీఐ... అమ్మాయిల్లో టాప్ గ్రేడ్ క్రికెటర్‌కు రూ.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. మెన్స్ క్రికెట్లో గ్రేడ్-సి క్రికెటర్ రూ. 1 కోటి అందుకోనుండగా... అమ్మాయిల్లో గ్రేడ్-సి క్రికెటర్లు రూ.10 లక్షలు మాత్రమే తీసు కోనున్నారు. మెన్స్, ఉమెన్స్ క్రికెటర్ల వార్షిక వేతనాల్లో భారీ వ్యత్యాసాలపై విమర్శల వర్షం కొనసాగుతుండగానే... అమ్మాయిలకు ఇవ్వా ల్సిన నగదు ప్రోత్సాహకాన్ని బీసీసీఐ ఏడాదిగా తొక్కిపెడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
నిబంధనలకు విరుద్ధం : ఐసీసీ మహిళల 2020 టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కప్పు ఫైట్‌లో బలమైన ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. మెగా ఈవెంట్ ఫైనల్స్‌కు చేరుకున్న భారత మహిళల జట్టుకు ఐసీసీ భారీ ప్రైజ్‌మనీ అందించింది. 5 లక్షల అమెరికన్ డాలర్లు (రూ.3.75 కోట్లు) భారత్‌కు అందజేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన రోజుల వ్యవధిలోనే 5 లక్షల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని బీసీసీఐ ఖాతాలోకి జమచేసింది. నిబంధనల ప్రకారం ఐసీసీ నుంచి ప్రైజ్‌మనీ అందిన 15 రోజుల్లో క్రికెటర్లకు ఆ సొమ్మును అందజేయాలి. కానీ బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కింది. ఏడాది గడిచినా ప్రైజ్‌మనీ ఊసెత్తటం లేదు.
ఏడాది కాలంగా మహిళా క్రికెటర్లు మైదా నాలకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచకప్ ముగిసిన ఏడాది తర్వాత గానీ తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు అవకాశం లభించలేదు. కరోనా కారణంగా దేశవాళీ సీజన్ సైతం జరుగలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులోని 15 మందిని ఆ సొమ్మును సమానంగా పంచాల్సి ఉంటుంది. ఆ లెక్కన ప్రతి క్రికెటర్‌కు రూ. 25 లక్షల రూపాయాలు దక్కాలి. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు, మ్యాచుల ఫీజుల కంటే ఎంతో విలువైన ప్రైజ్‌మనీని బీసీసీఐ అమ్మాయిలకు ఇవ్వకపోవటం విమర్శలకు తావిస్తోంది.
బాధ్యతా రాహిత్యం
దేశవాళీ సర్క్యూట్లో మహిళా క్రికెటర్లకు వన్డే మ్యాచ్‌కు రూ. 12,500, టీ20 మ్యాచ్‌కు రూ.6,250 ఇస్తున్నారు. అదే దేశవాళీ పురుష క్రికెటర్లు వన్డే మ్యాచ్‌కు రూ.35,000, టీ20 మ్యాచ్‌కు రూ.17,500 సహా రంజీ మ్యాచ్‌లో రోజుకు రూ.35,000 పొందుతున్నారు. ఈ ఏడాది లీగ్ దశలో ఐదు మ్యాచులు ఆడిన మహిళా క్రికెటర్ రూ.60 వేలు, ఫైనల్స్ వరకు ఆడిన మహిళా క్రికెటర్ రూ. 1 లక్ష వరకు మ్యాచ్ ఫీజుల రూపంలో పొందారు. ఈ మొత్తం ఏడాది మొత్తానికి లభించిన పారితోషికం. మెన్స్ క్రికెట్‌తోనే ఆదాయం వస్తుందని, మహిళా క్రికెటర్లకు ఆ స్థాయిలో వేతనాలు ఇవ్వలేమని బీసీసీఐ బాహాటంగానే చెబుతోంది. స్టేడియాలకు అభిమానులను రప్పించటం, ఆటను మార్కెట్ చేయటం, స్పాన్సర్లను ఆకర్షించటం క్రికెటర్ల పని కాదు. క్రికెట్ పాలకులుగా అది బీసీసీఐ బాధ్యత. మహిళల క్రికెట్ అభివృద్ది విస్మరించిన బీసీసీఐ.. మహిళా క్రికెటర్లకు మేలు చేసే చిన్నపాటి పనులు చేసేందుకు సైతం బద్దకిస్తోంది.