Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ సాయం కోసం దేశవాళీ క్రికెటర్ల ఎదురుచూపు
ముంబయి: కరోనా మహమ్మారి సాకుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పని చేయకుండా పడకేసింది. కరోనా కష్టకాలంలో ఐపీఎల్ నిర్వహణపైనే దృష్టి పెట్టిన బీసీసీఐ.. మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికిపోయిన దేశవాళీ క్రికెటర్లను ఆదుకోవటంలో దారుణంగా విఫలమైంది. దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక సాయం అందించటంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఎటువంటి చొరవ తీసుకోలేదని పరిస్థితిని చూస్తేనే తెలుస్తోంది. కరోనా కారణంగా 2020 రంజీ సీజన్‌ను రద్దు చేశారు. ఐపీఎల్లో ప్రాంఛైజీ కాంట్రాక్టులు లభించిన 73 అన్క్యాప్డ్ క్రికెటర్లు మినహా మిగిలిన 700 మంది క్రికెటర్లు దేశవాళీ సీజన్ ద్వారా మాత్రమే ఆర్థికంగా ఆర్జిస్తారు. రంజీ సీజన్ రద్దుతో దేశవాళీ క్రికెటర్లకు నష్ట పరిహారం అందిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిరుడు ప్రకటించాడు. దాదా ప్రకటనకు ఏడాది గడిచినా, క్రికెటర్లకు సాయం అందటంలో ఎటువంటి పురోగతి లేదు. ఈ విషయంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ స్పందించారు.
'దేశవాళీ క్రికెటర్లకు నష్ట పరిహారం చెల్లింపు విషయమై రాష్ట్ర క్రికెట్ సంఘాలతో చర్చించాలి. 2020 సీజన్ జరిగి ఉంటే, ఎవరు ఆడేవారు? బెంచ్ ఆటగాళ్లు? వంటి వివరాలను బీసీసీఐకి రాష్ట్ర సంఘాలకు పంపించాలి. ఈ వివరాలతో కూడిన ప్రతిపాదనలను ఏ రాష్ట్ర సంఘం కూడా పంపించలేదు. త్వరలోనే రాష్ట్ర సంఘాలతో చర్చించి, పరిహారం విడుదల చేస్తాం. సీజన్ ముగిసిన వెంటనే కొన్ని రాష్ట్ర సంఘాలు వివరాలను పంపిస్తే.. క్రికెటర్లకు తక్షణమే చెల్లిస్తాం. ఇప్పుడూ అదే తరహాలో పరిహారం అందజేస్తాం' అని అరుణ్‌కుమార్ ధుమాల్ అన్నారు. బోర్డు కోశాధికారి వాదన నిజమేనని ఓ రాష్ట్ర సంఘం అధికారి తెలిపారు. ' బోర్డు కోశాధికారి చెప్పింది నిజం. నష్ట పరిహారం చెల్లిస్తామని బోర్డు అధ్యక్షుడు గంగూలీ ప్రకటించాడు. రద్దు అయిన సీజన్లో ఎవరు 8 మ్యాచులు, 10 మ్యాచులు ఆడతారు? బెంచ్‌పై ఎవరు కూర్చుంటారనే విషయాలను ఏ విధంగా తేల్చాలి. అలాగని క్రికెటర్లు అందరికీ సమంగా ఇవ్వలేం. రాష్ట్ర సంఘాలకు పరిహారం నిధులు ఇవ్వటం ఓ ప్రతిపాదన, కానీ రాష్ట్ర సంఘాలు ఆ నిధులను క్రికెటర్లకు చేరాయో లేదో అనే విషయంపై సమీక్ష ఎవరు చేస్తారు?' అని సదరు అధికారి అన్నాడు. రంజీ ట్రోఫీలో మ్యాచ్ రోజుకు రూ.35,000 మ్యాచ్ ఫీజు అందుతుంది. రిజర్వ్ క్రికెటర్లకు రూ. 17,500 దక్కుతుంది. ఈ లెక్కన ఓ రంజీ మ్యాచ్‌కు మ్యాచ్ ఫీజు రూపంలో రూ.1.40 లక్షలు క్రికెటర్లకు లభిస్తాయి. గత రంజీ సీజన్ రద్దు కావటంతో.. సీజన్లో జరిగే మ్యాచ్‌లకు రాష్ట్ర క్రికెట్ సంఘాలు పంపించే జట్లకు మ్యాచ్ ఫీజులు చెల్లిస్తామని బోర్డు చెబుతోంది.