Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరుడుగట్టిన నేరస్థులతో దోస్తీ
- టోల్ టాక్స్ బూత్‌లపై ఆధిపత్య ప్రయత్నం
- విచారణలో వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు
భారత దిగ్గజ రెజ్లర్. ఒలింపిక్స్‌లో పతకాలు అందించిన లెజెండ్. యువ క్రీడాకారులకు అతడో స్ఫూర్తి ప్రదాత. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అంటే మనకు తెలిసినది ఇదే!. సుశీల్ కుమార్ గురించి తెలిసింది గోరంత.. తెలియనది కొండంత! అన్నట్టు ఉంది పరిస్థితి. దేశం గర్వించదగిన దిగ్గజ క్రీడాకారుడు టోల్ టాక్స్ బూత్‌లపై ఆధిపత్యం కోసం కరుడగట్టిన నేరస్థులతో చేతులు కలిపాడు. హత్య కేసులో సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
యువ రెజ్లర్ సాగర్ మరణానంతరం దిగ్గజ రెజ్లర్ గత 18 రోజులుగా పరారీలోనే ఉన్నాడు. ఈ 18 రోజుల్లో సుశీల్ కుమార్ పోలీసుల కంటపడకుండా ఉండేందుకు మాత్రమే కాదు, ఉత్తర భారత కరుడుగట్టిన నేరస్థుడు సందీప్ అలియాస్ కాలా జతెడి నుంచి సైతం తప్పించుకు తిరుగుతున్నాడు. హత్య కేసులో ప్రధాన నిందితుడు సుశీల్ కుమార్ ఆచూకి కోసం ఢిల్లీ పోలీసులు రూ. లక్ష రివార్డు సైతం ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్ కాలా జతెడి తనదైన శైలిలో సుశీల్ కుమార్ కోసం వేట సాగించాడు. ఇటీవల జిటీబీ హాస్పిటల్లో ఉన్న తన అనుచరుడు కుల్దీప్ ఫజ్జాను విడుదల చేసేందుకు కాల్పులు జరిపించిన కాలా జతెడి.. సుశీల్ కుమార్ కోసం తన బలగాన్ని అంతా బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. ఒలింపిక్ హీరో, రెజ్లింగ్ లెజెండ్ సుశీల్ కుమార్‌ను ఓ గ్యాంగ్‌స్టర్ ఎందుకు వెంబడిస్తున్నాడు?!. హత్య కేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్ పోలీసులు, న్యాయస్థానంలో శిక్ష కంటే ఎక్కువగా ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఎందుకు భయపడుతున్నాడు? యువ రెజ్లర్ హత్య కేసులో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశాలు ఇవే.
గ్యాంగ్‌స్టర్‌తో దోస్తీ
కాలా జతెడి ఉత్తర భారతదేశంలో కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్. ఇప్పుడు అతడు దుబారులో ఉంటున్నాడు. సాగర్, సోను సహా ఇతర ప్రధాన అనుచరులతో కలిసి న్యూఢిల్లీలోని వివాదాస్పద ఆస్తులను పెద్ద యెత్తున హస్తగతం చేసుకుంటున్నాడు. గ్యాంగ్‌స్టర్ కాలా జతెడితో రెజ్లర్ సుశీల్ కుమార్ చేతులు కలిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని మోడల్ టౌన్లో ఎం2 బ్లాక్‌లో ఓ ఫ్లాట్‌ను తీసుకున్న వీరు.. అక్కడే అక్రమ లావాదేవీలు, సెటిల్మెంట్లకు ప్రణాళిక రచించేవారు. కాలా జతెడి, లారెన్స్ బిష్ణోరు గ్యాంగ్‌లకు చెందిన క్రిమినల్స్‌కు ఈ ఫ్లాట్ నివాసంగా ఉండేది. ఇక్కడే పలు నేరాలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో టోల్ టాక్స్ బూత్‌లపై ఆధిపత్యమే లక్ష్యంగా కాలా జతెడి, సుశీల్ కుమార్ చేతులు కలిపినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.
సుశీల్ రెబల్ ఎజెండా!
కాలా జతెడితో చెలిమి చేస్తూనే సుశీల్ కుమార్ అతడి ప్రత్యర్థులతో చేతులు కలిపినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించాడు. జైల్లో ఉన్న నవీన్ బాలీ, నీరజ్ బవాన ప్రధాన అనుచరులతో సుశీల్ కుమార్ సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు. గత కొన్ని నెలలుగా తన ప్రత్యర్థులతో సుశీల్ కుమార్ సాన్నిహిత్యం పెరగటంతో కాలా జతెడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాలా జతెడి ప్రత్యర్థులతో సుశీల్ కుమార్ ఎందుకు చేతులు కలిపాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఫైట్‌కు సుశీల్ పట్టు
విభేదాల నేపథ్యంలో నార్త్ఈస్ట్ ఢిల్లీలోని ఫ్లాట్‌ను అమ్మాలని, డబ్బులు ఇవ్వాలని కాలా జతెడి ఒత్తిడి చేశాడు. దీంతో ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అతడి అనుచరులను సుశీల్ కుమార్ ఆదేశించాడు. సుశీల్ కుమార్ ఇలా చెప్పటం జతెడి అనుచరుల్లో ఆగ్రహానికి కారణమైంది. సుశీల్ కుమార్ టార్గెట్‌గా సాగర్, సోనులు దూషించటం మొదలుపెట్టారు. ఈ విషయం సుశీల్ కుమార్‌కు తెలియటంతో.. అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలా జతెడి మాటను సుశీల్ కాదనడనే నమ్మకం సోనుకు ఉండేది. ముక్కోపీ సుశీల్ కుమార్ ముఖాముఖి ఫైట్‌కు రావాలని సాగర్‌కు సవాల్ విసిరాడు. ఆ ఫైట్‌ను వీడియో తీయాలని అనుచరులకు సూచించాడు. ఆ వీడియోను ఇతర గ్యాంగ్‌లకు పంపించి, తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాడు.
కాలాతో రాజీకి యత్నం
ఈ 18 రోజులలో పోలీసుల గురించి సుశీల్ కుమార్ పెద్దగా ఆందోళన చెందలేని అతడి సన్నిహితులు చెబుతున్నారు.తన స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వాడవద్దని వారించినా.. వైఫై నుంచి సుశీల్ కుమార్ ఇంటర్నెట్ వినియోగించాడు. పరారీలో ఉండగా కాలా జతెడితో రాజీ కుదర్చుకునేందుకు సుశీల్ కుమార్ తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ అతడి ప్రయత్నాలేవీ ఫలించలేదు. అరెస్టు అనంతరం సైతం పోలీసులతో సుశీల్ కుమార్.. కాలా జతెడి గ్యాంగ్ నుంచి జైల్లో రక్షణ కల్పించాలని కోరినట్టు సమాచారం.
మే 4న జరిగిన గొడవలో సాగర్ మృతిచెందగా.. సోను తీవ్రంగా గాయపడ్డాడు. హత్య, దోపీడీ, కిడ్నాప్ సహా 19 కేసులు సోనుపై ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ కాలా జతెడికి సోను మేనల్లుడు. సోనును కాలా సొంత కొడుకులా చూసుకుంటాడని సన్నిహితులు చెబుతారు. సోనుకు తీవ్ర గాయాలు కావటంతో సుశీల్ కుమార్, అతడి అనుచరులపై కాలా జతెడి యుద్ధం ప్రకటించాడు. సుశీల్ సహా అతడి సహచరులను అందరినీ చంపేస్తానని కాలా జతెడి బెదిరించాడు. జైల్‌కు వెళ్లినా, అక్కడ కాలా మనుషుల నుంచి ముప్పు ఉందని సుశీల్ కుమార్ భయపడుతున్నట్టు కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.