Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయవాది బిఎస్ జాకర్
న్యూఢిల్లీ : యువ రెజ్లర్ సాగర్ దన్కర్ హత్య కేసులో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్‌పై ఎవరో కుట్ర పన్నుతున్నారని అతడి లాయర్ బిఎస్ జాకర్ పేర్కొన్నారు. మే 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో సాగర్ మృతి అనంతరం దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ సుమారు మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు. ఈ ఆదివారమే పోలీసులు సుశీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకోగా.. న్యాయస్థానం ఆరు రోజుల పోలీసుల కస్టడికీ అప్పగించింది. నార్త్ఈస్ట్ ఢిల్లీలోని ఓ మోడల్ హౌస్‌లో ఫ్లాట్ గురించి మొదలైన వివాదం రెజ్లర్ సాగర్ హత్యకు దారితీసింది. ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి నేర విభాగానికి బదిలీ చేశారు. నేర విభాగం ఉన్నతాధికారులు సుశీల్ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సుశీల్ కుమార్‌పై కుట్ర జరుగుతుందని న్యాయవాది న్యాయస్థానంలో వాదించనున్నారు. 'స్థానిక పోలీసుల వైఖరి కారణంగా కేసును నేర విభాగానికి బదిలీ చేశారు. లోకల్ పోలీసులు కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయటం లేదని ఉన్నతాధికారులు విశ్వసించారు. పోలీసు రిమాండ్ ఆరు రోజుల్లో సుశీల్‌ను ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో నిజం బయటకు రానుంది. పోలీసు కస్టడీ అనంతరం సుశీల్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించే అవకాశం ఉంది. ఈ ఘటనలో సుశీల్ ప్రమేయం లేదు. రెండు గ్రూపుల మధ్య తగాదా పరిష్కరించేందుకే సుశీల్ అక్కడికి వెళ్లాడు. సుశీల్ కుమార్‌పై హత్య, అపహరణ ఆరోపణలు చేశారు. అందుకు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు లేవు. అమాయకుడు అయినప్పుడు పరారీలో ఎందుకు ఉన్నారని పోలీసులు ప్రశ్నించవచ్చు? కానీ సుశీల్ కుమార్ భార్యకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అదే సుశీల్‌కు ఆ నోటీసులు ఇవ్వలేదు. భయంకర నేరస్థులు, పెద్ద గ్యాంగ్స్టర్లపై సైతం ఎఫ్ఐఆర్ నమోదైన పది రోజుల్లోనే ఆచూకి తెలిపిన వారికి రివార్డు ప్రకటించలేదు. అలాంటిది సుశీల్ కుమార్ ఆచూకి కోసం నగదు బహుమతి ప్రకటించారు. అందుకు సుశీల్ కుమార్‌పై కుట్ర జరుగుతుందని భావిస్తున్నాం. ఎవరో కావాలనే సుశీల్‌ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానంలో వాదించనున్నాం' అని బిఎస్ జాకర్ అన్నారు.