Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి వివక్ష అవమానంపై మైకల్ హౌల్డింగ్
లండన్ : శ్వేత జాతి పోలీసు అధికారి చేతిలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయి ఏడాది గడిచింది. కరోనా మహమ్మారి సమయంలోనూ జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన వ్యక్తం చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ప్రభావం క్రీడా రంగంలో, క్రికెట్లోనూ కనిపించింది. కరోనా అనంతరం జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీబావంగా క్రికెటర్లు మోకాళ్లపై కూర్చోని మద్దతు పలికారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం ఉవ్వెతున ఎగిసిపడటం, జాతి వివక్ష నిర్మూలనపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకల్ హౌల్డింగ్ 'ది క్రికెట్ షో'లో ఆసక్తికర వ్యాఖ్యానం చేశాడు. ఈ కార్యక్రమంలో హౌల్డింగ్ సహా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, ఎబోని రెయిన్‌ఫోర్డ్ బ్రెంట్లు పాల్గొన్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు సభ్యుల జాత్యహంకార వైఖరిపై సైతం మైకల్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
'జాతి వివక్ష ఎప్పటికి ఉంటుంది. జాత్యహంకార వాదులూ ఉంటారు. జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించటం.. నేరాలను పూర్తిగా కట్టడి చేయటం వంటిది. స్వల్ప నేర గణాంకాలు ఉన్న సమాజం, తక్కువ జాత్యహంకారం కలిగిన సమాజం.. ప్రగతిశీల భవిష్యత్ దిశగా మనల్ని నడిపిస్తాయి. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీబావంగా క్రికెటర్లు మోకాళ్లపై కూర్చుంటున్నారు. మోకాలిపై కూర్చువాలని, మోకాళ్లపై ఎందుకు కూర్చోవాలని గానీ నేను చెప్పబోవటం లేదు. కానీ అదేదో తంతుగా మాత్రం చేయవద్దని చెబుతున్నాను. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలవాలనుకుంటే.. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునే మనసు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన సంఘీబావం ఇది. జీవితాంతం వివక్షను ఎదుర్కొనే బాధ ఎలా ఉంటుందో ప్రజలకు అర్థం కాదు. కొంతమంది తాము ఏమి మాట్లాడుతున్నామో, దాని ప్రభావం నల్ల జాతీయులపై ఏ విధంగా పడుతుందోననే సృహ లేకుండానే వ్యవహరిస్తున్నారు. సంఘీబావం అంటే..అదేదో అలవాటుగా చెబుతున్నారు. నల్లజాతీయుడిగా.. కొందరు మాట్లాడే మాటలతో దహించివేస్తాయి. చాలా సందర్భాల్లో నన్ను భిన్నంగా చూసినప్పుడు.. వాళ్లు సభ్యతలేనివారా? జాత్యహంకారులా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నేను నల్ల జాతీయుడిని అని అలా చూస్తున్నారా? లేక వారికి మర్యాద తెలియక అలా చేస్తున్నారా? అని నాలో నేనే ఆలోచన చేసుకుంటాను. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్(యుకె)లో ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించటం లేదు. అమెరికాలో బడా కార్పోరేట్ కంపెనీలు మిలియన్ల డాలర్లను జాతి వివక్ష వ్యతిరేక నిర్మూలనకు వెచ్చిస్తున్నాయి. ఆ పరిస్థితి యునైటెడ్ కింగ్డమ్లో కనిపించటం లేదు' అని మైకల్ హౌల్డింగ్ అన్నాడు.