Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్నిస్ స్టార్ నవొమి ఒసాక ప్రకటన
టోక్యో : ప్రపంచ క్రీడారంగంలో నవొమి ఒసాక సరికొత్త ట్రెండ్ సృష్టించింది. మానసిక ఆరోగ్యం కారణంగా కొంతకాలం పాటు ఆటకు దూరమైన క్రీడాకారులను చూశాం. సిరీస్‌లు, మ్యాచ్‌ల మధ్యలోనే మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రీడాకారులనూ చూశాం. కానీ మానసిక ఆరోగ్యం కోసం మీడియా సమావేశాలను రద్దు చేస్తూ టెన్నిస్ స్టార్, జపాన్ భామ నవొమి ఒసాక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ఆదివారం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆరంభం కానుంది. వరల్డ్ నం.2, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత నవొమి ఒసాక ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నిలుస్తున్నా.. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశాలకు హాజరు కాబోదు. ఈ మేరకు ఒసాక సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేసింది. ః అందరికీ నమస్కారం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో నేను ఎటువంటి మీడియా సమావేశాలకు హాజరు కావటం లేదు. అథ్లెట్ల మానసిక ఆరోగ్యంపై ప్రజలకు ఎటువంటి పట్టింపు లేదని నాకనిపించేది. కొన్ని మీడియా సమావేశాలు చూసిన తర్వాత అది నిజమేనని అనిపించింది. మీడియా సమావేశంలో కూర్చున్నప్పుడల్లా గతంలో ఎన్నోసార్లు ఎదుర్కొన్న ప్రశ్నలనే మళ్లీ చవిచూస్తాం. లేదా మనలో మనకు సందేహం కలిగించే ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రజల్లో సందేహం కలిగించే వస్తువుగా నేను ఉండదలచుకోలేదు. ఓటమి అనంతరం ఎంతోమంది అథ్లెట్లు మీడియా సమాశంలో కంటతడి పెట్టిన వీడియోలు చూశాను. ఓటమి బాధతో కుంగిన వ్యక్తిని మళ్లీ బాధ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. మీడియా సమావేశాలకు హాజరుకాకపోవటం టోర్నమెంట్‌కు, పాత్రికేయులకు ఎటువంటి వ్యతిరేక ఉద్దేశంతో కాదు. ఇందులో వ్యక్తిగతం అంటూ ఏదీ లేదుః అని ఒసాక పేర్కొంది. టెన్నిస్ టోర్నీమెంట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ అనంతరం క్రీడాకారులు మీడియా సమావేశానికి హాజరు కావాలి. లేదంటే, అథ్లెట్లపై నిర్వాహకులు జరిమానా విధిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నవొమి ఒసాకపై సైతం నిర్వాహకులు జరిమానా విధించనున్నారు. అయితే, ఆ జరిమానా సొమ్మును మానసిక ఆరోగ్యం ట్రస్ట్‌కు అందిస్తానని ఒసాక తన ప్రకటనలో తెలిపింది.